Sunday, October 31, 2010

రోశయ్యే సుప్రీం ! ‘‘ రోశయ్య సుప్రీం ’’

roshaiah-cmm
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన, పార్టీ ప్రజాప్రతి నిధులపై క్రమంగా పట్టుబిగుస్తున్నారు. బలహీన ముఖ్యమంత్రి అన్న భావన నుంచి బయటపడి బలమైన ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తున్నారు. కొద్దికాలంపాటు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ‘‘ముఖ్యమంత్రి మార్పు’’ ఊహాగానాల... నుంచి మళ్లీ పాలనపై పట్టుసాధించే పరిస్థితికి చేరుకొన్నారు. అనారోగ్యం నుంచి తేరుకొని మునుపటి కంటే ఎక్కువగా ప్రభుత్వ శాఖల సమీక్షలకు అధిక సమయం కేటాయిస్తున్నారు. దీనికి తోడు...పార్టీ అధిష్ఠానానికి, తనకు ప్రత్యక్షంగా-పరోక్షంగా కంట్లో నలుసుగా మారిన వై.ఎస్‌.జగన్‌ వ్యవహారం ‘‘పార్టీపరంగా’’ ‘ముగింపు దశకు రావడం, ఆయన విధేయులంతా రోశయ్యకు మద్దతు ప్రకటించడం, ప్రతిపక్షం కూడా వై.ఎస్‌.హయాం స్థాయిలో ఉద్యమించక పోవ టంతో ఇక ఇప్పట్లో కొణిజేటికి తిరుగులేదన్న భావన, ఇక ‘‘ఆయనే సుప్రీం’’ అన్న నమ్మకం పార్టీ వర్గాలలో బలపడుతోంది.

అధిష్ఠానం అండదండలు...
పార్టీలో సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ వస్తున్న రోశయ్యకు అధిష్ఠానం పూర్తిస్థాయిలో దన్నుగా నిలవడంతో ‘‘సుప్రీం’’గా అవతరించారు. అయితే...వై.ఎస్‌.మాదిరిగా దానిని ఎక్కడా కనిపించనీయకుండా ఢిల్లీ పర్యటనలోనూ హడావుడి చేయకుండా, ప్రచారానికి దూరంగా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న వైనాన్ని పార్టీ నాయకులు గ్రహించారు. అధిష్ఠానం కూడా... రోశయ్యకు మద్దతు పలకకపోతే పార్టీలో భవితవ్యం ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ సొంత విధేయతలను పక్కకుపెట్టి అనివార్య పరిస్థితులలో రోశయ్యకు విధేయత ప్రకటిస్తున్నారు.

దానికి అదనంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులలో ఎక్కువ మద్దతు ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ను పక్కకు పెట్టి అధిష్ఠానం అండదండలున్న రోశయ్యకే విధేయత ప్రకటించడంతో కెవిపి సలహాల ప్రకారం నడిచే సదరు మెజార్టీ ప్రజాప్రతినిధులంతా ఆయనను అనుసరిస్తున్నపరిస్థితి కనిపిస్తోంది.అందని ముఖ్యమంత్రి కిరీటం కోసం అర్రులు చాస్తూ పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్‌కు ఇక పార్టీలో భవితవ్యంలేదని నిర్ధారించుకొన్న ప్రజా ప్రతినిధులంతా నాయకత్వం దన్ను ఉన్న రోశయ్యకు సహాయనిరాకరణ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్లు కూడా దక్కవన్న భయాన్ని ప్రకాశం జిల్లా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా స్వయంగా గ్రహించారు.

జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం స్వయంగా చెప్పడంతో ప్రకాశంజిల్లా ఎమ్మెల్యేలలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా జగన్‌ యాత్రకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. జగన్‌తో ఉంటే భవిష్యత్తులేదని అధిష్ఠానం విస్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, అంతకు ముందు జగన్‌కు మద్దతు దార్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రోశయ్యను బలోపేతం చేస్తున్నారు. ఇక పాలనా పరంగా కూడా రోశయ్య పట్టుబిగుస్తున్నారు.

అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పూర్తిస్థాయిలో ప్రభుత్వ శాఖల సమీక్షలు నిర్వహిస్తున్నారు. బదిలీలు, ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపులు వివిధ శాఖలలో ఖాళీల భర్తీలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియామకాలు ప్రకటిస్తు న్నారు. కీలకమైన వివాదాలను కూడా ఆయన చాక చక్యంగా పరిష్కరిస్తూ అధిష్ఠానం ప్రశంసలు అందుకొంటున్నారు.

సర్కార్‌ను అతలాకుతలం చేసిన హైకోర్టు న్యాయవాదుల ఆందోళనను సమర్థవంతంగా పరిష్కరించి తానేమిటో, తాన రాజకీయ అనుభవం ఏమిటో చాటారు. ఆంధ్ర-తెలంగాణకు 40 చొప్పున, రాయలసీమకు 20శాతం స్టాండింగ్‌ కౌన్సెల్‌, ఏజిపి, జిపి పోస్టులను ప్రాంతాల వారీగా విభజించి, ఆ సమస్యను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించారు. ప్రాణహిత పుష్కరాలు, బతుకమ్మ జాతర వంటి సాంస్కృతికపరమైన అంశాలలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా...ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ప్రాంతీయ అభిమానాలు ఉండవని, అన్ని ప్రాంతాలు సమానమేనని చాటిచెప్పి ‘‘తాను ప్రాంతాలకు అతీతుడినినని’’ రుజువు చేసుకొన్నారు. ఇన్ని కీలకమైన వివాదాలు పరిష్కరించి ‘‘రోశయ్య సుప్రీం’’ అనిపించుకొన్నారు.

తగ్గిపోయిన ధిక్కార ధోరణి
రోశయ్య సుప్రీంగా మారుతున్న తీరుతో మంత్రులు సైతం తమ దిక్కారధోరణీ, వ్యవహార శైలినీ మార్చుకొని ఆయనకు పూర్తి విధేయతను ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఎవరి ఇష్టంవారిదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రులు మాత్రం అవతరణ దినోత్సవాలలో పాల్గొం టామని స్పష్టంచేయటం రోశయ్యకు పూర్తిస్థాయిలో విధేయత ప్రదర్శించటంగానే స్పష్టమవుతోంది.

డిసెంబర్‌ పరిణామాలకు సిద్ధం
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి డిసెంబర్‌ అనంతర పరిణా మాలకు సిద్దంగానే ఉన్నారు. కేంద్రం నుంచి పారా మిలటరీని పిలిపిస్తున్నారు.శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అందులో రాజకీయ నేతల ప్రమేయాన్ని సహించవద్దని డిజిపికి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్‌ అనంతర పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించటం, కఠి నంగా అణిచివేయటం ద్వారా తాను బలమైన ముఖ్యమంత్రినన్న సంకేతాలు పంపేందుకు రోశయ్య సిద్దమవుతున్నారు.

Wednesday, October 27, 2010

ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్యకు గుదిబండలు

roshaiah
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు చాలా మంది మం త్రులు గుదిబండలుగా పరిణమించారు. సగానికిపైగా మం త్రులు క్రియాశీలరాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తూ ముఖ్యమంత్రిపై పనిభారం మరింత పెంచుతున్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనుంచే వినిపిస్తు న్నాయి. సచివులు ఏదో మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశం ఏ కోశానా లేదన్న విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు మంత్రిపదవులు చేసిన వారు, అంతకన్నా మించి పనిచేసిన వారే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుండటంపై విస్మయం వ్యక్త మవు తోంది. దీనివల్ల.. ఈ మంత్రివర్గం రోశ య్యకు గుదిబండలా మారిందని, ప్రక్షా ళన చేస్తే తప్ప ప్రయోజనం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రోశయ్య ముఖ్య మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్‌ క్యాబినెటే ఇంకా కొనసాగుతోంది. వారిలో ఒక్క కొండా సురేఖ మినహా, మిగిలిన వారంతా పాతవారే ఉన్నారు. రోశయ్య సీఎం అయిన దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల వరకూ మంత్రులు మంత్రివర్గ సమావేశాల్లోనే నాన్‌ సీరియస్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అన్ని వైపుల నుంచి ఎదువుతున్న విమర్శలను తిప్పికొట్టి ఎదురుదాడి చేయడంలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన మంత్రులంతా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. చాలామంది మంత్రులు ఇప్పటికీ జగన్‌ నామస్మరణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్వయంగా ప్రతి పక్షంపై విరుచుకుపడి, తనపై విమర్శలు వస్తుంటే ఎదురు దాడి చేయవలసిన బాధ్యత మీకు లేదా అని పదే పదే అభ్య ర్థించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. దానితో అప్పటి కప్పుడు నలుగురైదుగురు మంత్రులు మీడియాను పిలిచి, హడావుడి చేయడం, ఆ తర్వాత మాయమవడం ఆనవాయితీగా మారింది. మళ్లీ పిలిచి ఆగ్రహంవ్యక్తం చేస్తే తప్ప మంత్రులెవరూ కనిపించడం లేదు. శాఖల వారీగా తలెత్తుతున్న రోజువారీ సమస్యలపై కూడా మంత్రుల నిర్లిప్త వైఖరి ముఖ్య మంత్రిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. తమ శాఖ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన మంత్రులే సీఎంపైనే భారమంతా నెట్టి.. వారు జారు కోవడం ఇటీవలి కాలంలో తరుచుగా జరగడంతో.. ముఖ్యమంత్రి సదరు మంత్రుల తీరుపై బాహాటంగా అసహనం వ్యక్తం చేయడం, వెటకార ధ్వని వచ్చేలా వ్యాఖ్యానించడం చేస్తు న్నా మంత్రుల పనితీరులో మార్పు కనిపించడం లేదంటున్నారు. ఈరకంగా వ్యవహరిస్తున్న మంత్రుల సంఖ్య రోశయ్య కేబినేట్‌లో సగానికిపైగానే ఉండడంతో.. వారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది.

పెద్దాయనకు పెను సమస్యలు
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రతిపక్షాలు రోశయ్య ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. వరద ల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు తదితర సమస్యలు ప్రత్యక్షంగా రోశయ్య సర్కారును, పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీనీ అప్రతిష్ఠ పాలు చేశాయి. వీటిపై విపక్షాలు విరుచుకుపడినా మం త్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌బాబు, చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, విప్‌ శైలజానాధ్‌ వంటి కొందరు మాత్రమే విపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తుంటే.. మిగిలిన వారంతా పత్తా లేకుండా పోయారు.

చివరకు రోశయ్య తర్వాత సీనియర్‌ మంత్రి అయిన గీతారెడ్డి సైతం ఈ విషయంలో వెనుకబడిపోయారన్న విమర్శలు వినవ స్తున్నాయి. స్వయంగా శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న గీతారెడ్డి పాత్రికేయులతో సత్సంబంధాలు నెరపడంలో సైతం విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు మిగిలిన సహచర మంత్రుల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఒక్క గీతారెడ్డి మాత్రమే కాకుం డా మిగిలిన మంత్రులు కూడా పాత్రికేయులతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, వైఎస్‌ ఉండగా, మంత్రులు వారితో సన్నిహిత సంబంధాలు నెరిపేవారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మంత్రులు వట్టి వసంతకుమార్‌, ముఖేష్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి, జూపల్లి, శిల్పా మోహన్‌రెడ్డి, బాలి నేని వంటి మంత్రులు మీడియాకు దూరంగా ఉంటారన్న విమర్శ ఉంది.

అసలు మీడియా విషయంలో గతంలో వైఎస్‌ అనుస రించిన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కొందరు, ఇందులో ముఖ్యమంత్రి తప్పిదం కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తు న్నారు. కేవలం కొన్ని పత్రికలకే దగ్గరకావడంతో మిగిలిన వారం తా దూరమవుతున్నారని, వైఎస్‌ జీవించిన సమయంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. స్వయంగా సీఎం హాజరయిన సమావేశాలకు సైతం మంత్రులు ఆలస్యంగా హాజరవుతున్న వైచిత్రి. సోమవారం జరిగిన ఒక సదస్సుకు రోశయ్య వచ్చిన ముప్పావుగంట తర్వాత గీతారెడ్డి హాజరుకావడం తెలిసిందే. వైఎస్‌ జీవించి ఉండగా ఈవిధంగా ఎప్పుడూ జరిగేది కాదని, మంత్రులు ఇలాంటి క్రమశిక్షణారాహి త్యానికి పాల్పడేందుకు సాహసించేవారుకాదంటున్నారు.

తాజాగా డిఎస్సీ, బీఎడ్‌ టీచర్ల పోరాటంతో సదరు శాఖ మంత్రి తీరుతో ముఖ్యమంత్రికి మరింత అసహనం కలిగించింది. గత ఏడాదిగా వివిధ అంశాలపై మంత్రుల వ్యవహారశైలి, వారు స్పందిస్తున్న తీరుపై సీఎం మంత్రి వర్గ సమావేశంలోనే వారికి ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకుంటున్నారు. సొంత శాఖలపైనా పట్టు సాధించకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా వాటిని కూడా తనపైకే నెట్టివేయటంపై రోశయ్య బాహాటంగానే తన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు, పార్టీ రాజకీయ భవిష్యత్తు తదితర అంశా లపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, ప్రభుత్వం-పార్టీ పనితీరుపై తన అసంతృప్తిని రోశయ్య ముందే వ్యక్తం చేయగా.. అదే విషయాన్ని ఆయన ఢిల్లీ పర్యటన అనంతరం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ మంత్రులకు ప్రత్యేకంగా హితబోధ చేసి నట్లు తెలిసింది.

చివరకు... ప్రతిష్ఠాత్మకంగా జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో సైతం మంత్రులు బాధ్యతారాహిత్యంగా, టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తమ కు తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందన్న ధోరణి ప్రదర్శించడం పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలి సిందే. మం త్రులు సైతం రెండు ప్రాంతాలుగా విడిపోవడం, ఒక ప్రాంతానికి చెందిన మంత్రులు మరో ప్రాంతానికి వెళ్లకపోవడం, అంతర్గత కలహాలు, నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలు రోశయ్య ప్రభుత్వానికి అప్రతిష్ఠగా పరిణమించాయి.

ప్రధానంగా.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశా లపై జగన్‌కు చెందిన పత్రికలో వస్తున్న వార్తా కథనాలు రోశయ్య ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకంగా మారాయన్న వ్యాఖ్యలు మంత్రుల్లో వినిపిస్తున్నాయి. జగన్‌కు సన్నిహితుడయిన మంత్రి సహకారం లేకపోతే ఈ వార్తలు రావన్న అభిప్రాయం సీఎం సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మార్‌ కుంభకోణంలో తెరవెనుక సూత్రధారి అయిన పెద్దగద్ద సలహాదారును రక్షిం చేందుకు.. ఆ సంస్థపై విచారణకు మంత్రులే మోకాలడ్డిన వైనం విమర్శలకు గురయింది.

Tuesday, October 26, 2010

విడిపోవలసివస్తే, స్నేహితుల్లా విడిపోదాం, బహిష్కరణ పిలుపుతో జటిలం చేయవద్దు, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ అవతరించిననాటినుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, అందువల్ల బహి ష్కరించే ఆలోచనను పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణావాదులకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనడం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయం అని స్పష్టం చేస్తూ.. గతంలో కూడా ఎన్నోసార్లు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోవలసి వస్తే స్నేహితులుగానే విడిపోవాలి, ప్రతి విషయాన్ని జటిలం చేయవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి సమైక్యంగా ఉన్నాం కాబట్టి ఉత్సవం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్రీ జోన్ విషయమై కె.సి.ఆర్. తమ ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని ప్రస్తావిస్తూ కె.సి.ఆర్. తమ ఇంటికి వస్తే మంచిమర్యాద చేస్తామని చెప్పారు. ఫ్రీ జోన్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, అందువల్ల ఒక పార్లమెంటు సభ్యునిగా కె.సి.ఆర్. వచ్చే నెల 9న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు తమ వంతు కృషి చేయాలని రోశయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పని చేస్తానని ఆయన చెప్పారు.

మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మీకున్నంత పరిజ్ఞానం నాకు ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదో పొరపాటునో, గ్రహపాటునో ముఖ్యమంత్రిని అయ్యాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
గ్రహపాటో.. పొరబాటునో.. ముఖ్యమంత్రినయ్యా...
Rosaiah1
ఆంధ్రప్రదేశ్‌ అవతరించి ననాటి నుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, సంయుక్త రాష్ట్రాంగా ఉన్నంత వరకు అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని, దీన్ని బహిష్కరించడం సరియైనది కాదని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఈ దినోత్సవాన్ని బహిష్క రణ ఆలోచనను పునరాలోచించుకోవాలని తెలంగాణ వాదులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో ని సీఎం కార్యాలయం ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనటం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయమని ఆయన స్పష్టంచేస్తూ గతంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ ఉత్స వాల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసీఆర్‌ పాల్గొన్నారన్నారు. అయితే రాష్ట్రం విడిపోవలసివస్తే స్నేహితులుగానే విడిపో వాలన్నారు. ప్రతివిషయాన్ని సమస్యగా మలచి జటిలం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంతకాలం అవతరణ వేడుకలను నిర్వహిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఫ్రీజోన్‌ విషయమై కెసీఆర్‌ తన ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని సీఎం ప్రస్తావిస్తూ కేసీఆర్‌ తన ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వా నించి మర్యాదచేస్తానని చెప్పారు.

ఫ్రీ జోన్‌ విషయమై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, దీనిపై పార్ల మెంట్‌ సభ్యుడిగా కేసీఆర్‌ వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశంపై అందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ ఆర్థ రహితమని ముఖ్యమంత్రి ఆన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పనిచేస్తానని ఆయన చెప్పారు.

మీడియాపై రుసరుసలు...
డీఎస్సీ-2008 నియామకాలపై అడిగిన ప్రశ్నకు అందుకు సంబంధించిన ఫైలుపై 5 నిముషాల్లో సంతకం చేసి సంబంధిత మంత్రికి పంపామన్నారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఆందోళనలపై మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని అడగగా అన్నీ విషయాలు నాకెలా తెలుస్తాయి, అన్నింటికీ నెనెందుకు సమాధానం చెప్పాలని ఒకింత అసహనం వ్యక్తంచేశారు. అంతేకాకుండా మీకున్నంత పరిజ్ఙాతం నాకు ఉండదని, ఏదో పొరబాటునో, గ్రహబాటునో ముఖ్యమంత్రిని ఆయ్యానంటూ ఫింగర్‌ప్రింట్స్‌పై అన్ని విషయాలుంటాయా? అని ముఖ్యమంత్రి రోశయ్య అసహనం వ్యక్తం చేశారు.

నేనూ సామాన్య భక్తుడినే..
కాగా పాలకొల్లు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నా ఫోటోను కలియుగ దైవం వెంకటేశ్వరునిగా చిత్రీకరించి, బ్యానర్లు పెట్టడంపై ముఖ్యమంత్రి స్పందించారు. వెంకటే శ్వరస్వామి ఆభరణాల మధ్య తన బొమ్మను పెట్టడం మంచిదికాదని, ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యే ఉషా రాణి ఈ విధంగా చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నైనా నేనూ ఆ దేవ దేవునికి సామాన్య భక్తుడినేనని, దేశం లో, రాష్ట్రంలోగాని ఎక్కడైనా తన అభిమానులు భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయవద్దని రోశయ్య విజ్ఞప్తి చేశారు.

Monday, October 25, 2010

మంత్రులపై 'రోష'య్య ! * స్వీయ నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా?

సిఫార్సు చేయకుండా నాపై తోసేయడం సబబేనా?
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయరా?
పలువురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం

 కొంతమంది మంత్రులు తమ తమ శాఖలనే పట్టించుకోవడం లేదు. మరికొందరు విధాన నిర్ణయాల విషయంలో చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరిస్తుంటే.. మరికొందరు స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా భారం మొత్తం సీఎంపైనే వేసేస్తున్నారు.

కానీ, సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా తనపైనే బాధ్యతలను నెట్టేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

శాఖాపరంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రులు సమష్టిగా స్పందించడం లేదని మంత్రివర్గ సమావేశాల్లో తరచూ ఆయన ఆగ్రహిస్తున్నారు కూడా. అధిష్ఠానం అంటే తనకు తెలియదని, తనకు తెలిసిన అధిష్ఠానం వైఎస్సేనని ప్రకటించి తూర్పు గోదావరి జిల్లాలో కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తితో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయినా.. తాను బంధుత్వానికే విలువ ఇస్తానంటూ ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆయన వ్యవహారంపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, ఎరువుల సరఫరా విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో మంత్రి రఘువీరారెడ్డి స్పందించిన తీరు పట్ల సీఎం సంతృప్తి చెందలేదు.

ఈ విషయమై మంత్రి బొత్సతోపాటు పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో రఘువీరాతో వాగ్వాదానికి దిగినా ఏమీ మాట్లాడకుండా సీఎం మౌనం దాల్చడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు, మహిళా స్వయం సహాయక బృందాలకు పరపతి లభించడంపై కడప ఎంపీ జగన్‌కు చెందిన దినపత్రికలో కథనాలు రావడం పట్ల సంబంధిత మంత్రి వట్టి వసంతకుమార్‌పై కూడా మంత్రివర్గ సమావేశంలో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం ఉంది.

'సాయంత్రం నువ్వు జగన్‌ను కలుస్తావు. మర్నాడు ఆయన పత్రికలో కథనాలు వస్తాయి' అని వ్యాఖ్యానించారని సమాచారం. అలాగే, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో 42 శాతం వాటా అమలయ్యేలా కృషి చేస్తామంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి గీతారెడ్డిని సీఎం ప్రశ్నించారని తెలిసింది.

డీఎస్సీ-08 నియామకాల విషయంలో శాఖాపరంగా సిఫార్సు చేయకుండా సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించిన మాణిక్యవరప్రసాద్‌పైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటాపై ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

గత మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. దానిపై దృష్టిసారించాలని గీతారెడ్డికి సూచించారు. ఇచ్చిన బాధ్యతలను వెంటనే పూర్తి చేయాలని మంత్రుల ఉప సంఘానికి హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, తనను కలిసిన గీతారెడ్డితో సీఎం రోశయ్య ఆ అంశాన్ని ప్రస్తావించారు.

'తెలంగాణ న్యాయవాదుల సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆచరణకు నోచుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వచ్చేస్తోంది. ఆ సమయానికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం బాగుంటుంది? దీనిపై వారు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారు?' అని కాస్త ఆగ్రహంతో ప్రశ్నించారు.

సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నా వీలు చిక్కడం లేదని, రెండు రోజుల్లో దానిపై ఓ సిఫార్సు చేస్తామని గీతారెడ్డి జవాబిచ్చారు. 'తెలంగాణ న్యాయవాదులతో సమావేశం జరిపిన రోజే సమయం లేదని చెబితే.. ఆ బాధ్యతను మరొకరికి అప్పగించేవాళ్లం కదా' అని సీఎం ప్రశ్నించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, తనను కలవడానికి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చిన సందర్భంలో.. "ఏమిటీ మీరొక్కరే వచ్చారు? డీఎస్సీ-08 ఫైలు ఏదీ!? అధికారులు రాలేదా?'' అని రోశయ్య నిలదీశారు. న్యాయపరమైన అంశాలు మిళితమై ఉన్న ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ తనపై వదిలేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో "ఇది చాలా కీలకమైన అంశమైనందున ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను' అని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, అధికారులతో కలిసి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలో సూచించాలని రోశయ్య చెప్పారు. దీంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, వివిధ సందర్భాల్లో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతారా!? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది.

చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో!

లక్కీ సీఎం
cm-laguh
కాడి కట్టలేదు... మేడి పట్టలేదు... రిజర్వాయర్ల నిండుగా నీళ్ళు, భాం డాగారాల-నిండా ధాన్యరాశులు ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కావాలి? అం దుకే అయన్ను అందరూ లక్కీ సీఎం అంటున్నారు. గతంలో రాష్ట్రానికి ముఖ్య మంత్రులుగా పనిచేసినా వారంతా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమత మైనవారే. రాష్ట్ర ప్రజలు కూడా అటు కరువులో ఇటు వరదలతోనోగుడ్లు తేలేసే వారు. ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధ్దం. మంత్రి వర్గాల్లో పనిచేసిన అనుభవతం తప్ప మరేమీ లేని రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి అయాచితంగా కలిసివచ్చినట్టుగానే వాతావరణ పరిస్థితులు కూడా అం తకు మించి అనుకూలిస్తున్నాయి. చిన్నా చితకా సమస్యలు ఇక ముఖ్య మం త్రులు ఎవరన్న దానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే అంటున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న రాష్ట్రంలో ఈసారి సకాలంలో సాధారణ స్థాయికి మించి 30శాతం అధికంగానే వర్షాలు కురుస్తూ వచ్చాయి. జూన్‌ ప్రారంభం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి సాధారణ వర్షపాతం 617.7 మిల్లీమీటర్లు కాగా, 803.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా అన్ని జిల్లాల్లో అదను పదునుకు తగ్గట్టు కువరటంతో ఏరువాక మంచి జోరు మీద సాగింది. కరువు అన్న పదం ఈసారి రాస్ట్రంలో ఏ జిల్లాలోనూ విని పించకుండా పోయింది. ఖరీఫ్‌ పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి మించి రికార్డు స్థాయిలో అయింది.

73.83 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన పం టలు సాధారణస్థాయికి మించి 83.27లక్షల హెక్టార్లలో సాగు కావటం రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డుగా వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. వరి నాట్ల ప్రారంభ దశలో యూరియా కొరత ఎదురైనా, ప్రభుత్వ ప్రమేయం అంతగా లేకుండానే సమస్య సర్దుకుంది. మరో వారం పది రోజుల్లో ఖరీఫ్‌ పంట కోత లు ప్రారంభం కానున్నాయి. పంట దిగుబడి కూడా రికార్డు స్థాయిలోనే ఉండ బోతోందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

28 లక్షల హెక్టార్లలో సాగ యిన వరి సాగు ద్వారానే 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం లోనే అంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా తన స్థాయిని పదిలం చేసుకోనుందంటు న్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తులపై ప్రభుత్వ కృషిని ప్రశంశించటం గమనార్హం. ధాన్యం నిల్వలు దాచేందుకు గిడ్డంగుల సమస్య కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించగలిగేంతగా ఉందంటే ముఖ్యమంత్రి రోశ య్య హయాంలో రాష్ట్ర వ్యవసాయరంగం అభివృద్ధిని చెప్పకనే చెబు తోందంటున్నారు.

ధీమాగా రబీ సాగు: రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ వరదనీటితో తొణ ికిసలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీటి అవసరం తీరిపోవటంతో ఇక రబీ పంటల సాగుకు ఢోకా ఉండదని జలాశయాల్లో నిలువ ఉన్న నీరు భరోసా ఇస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల, శ్రీరాంసాగర్‌ తదితర ప్రధాన జలాశయాల్లోకి ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో వరద ప్రవాహం వస్తూనే ఉంది.ఎన్నడూ నిండని శ్రీరాంసాగర్‌ సైతం గేట్లెత్తుకుని ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులు, కుంటల్లో జలకళ తగ్గలేదు. భూగర్భ జలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.

చీకూ చింతా లేని పాలన:చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో! రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా విపక్షాలు ముప్పుతిప్పలు పెట్టేదాకా వదిలేవి కావు. అయితే అనుకోని పరిస్థితుల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి విపక్షాలే పరోక్షంగా బాసటగా నిలుస్తూ రావ టం ఒకరకంగా రోశయ్యను ఆధికార స్థానంలో బలపడేలా చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సొంత పార్టీ నుంచే వారికి అస మ్మతి సెగల బుగబుగలు తప్పేవి కావంటున్నారు.

ఈ అంశంలో రాజకీయంగా వైఎస్‌ రాజశేఖరెడ్డికి కూడా మినహాయింపు లేకపోయింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్యకు అటువంటి ఇబ్బందులేవీ లేవంటున్నారు. కడప ఎంపీ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై కోరికే తప్ప రోశయ్య మీద వ్యక్తి గత ద్వేషమేదీ లేదంటున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా రోశయ్య విషయంలో ఉన్నంత సాప్ట్‌కార్నర్‌ ఇదివరకటి వారిపై ఉండేది కాదంటున్నారు. తాత్విక ధోరణి కనబరిచే రోశయ్య అంతటి అదృష్టపు సీఎం ఇంతవరకూ ఎవరూ లేరనే కాంగ్రెస్‌ సీనియర్లు సైతం నొక్కి చెబుతున్నారు.

Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య


Tuesday, October 19, 2010

నిండుగా నిర్లక్ష్యం * ‘గోడౌన్ల సమస్య’ సాకుతో పర్మిట్లు ఇచ్చే యోచన

అసలు రోగం ఒకటైతే... చికిత్స మరొకటి
గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలతోనే అసలు సమస్య... అడిగేవారు లేక గోదాముల్లో ఉన్న మనకు పనికిరాని నిల్వలను పట్టించుకోని కేంద్ర మంత్రిత్వ శాఖలు
అవకాశాన్ని వాడుకుని సన్నబియ్యం పర్మిట్లకై మిల్లర్ల ఎత్తుగడలు
ఇప్పటికే పూర్తిగా నిండిన గోదాములు... మార్కెట్లోకి రానున్న ఖరీఫ్ ధాన్యం
గోదాముల పరిస్థితి చూసి పట్టు బిగిస్తున్న మిల్లర్లు...
వారికి తలొగ్గి పర్మిట్ల జారీకి సిద్ధమవుతున్న సర్కారు...
పర్మిట్లు ఇస్తే గోదాములు ఎలా ఖాళీ అవుతాయన్నది జవాబులేని ప్రశ్న


ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతు పక్షపాతి, దివంగత నేత వైఎస్ హయాంలో అమలు చేసిన విధానానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు రైతులకు సరైన ధర, మరోవైపు వినియోగదారుల ప్రయోజనాల రక్షణనూ ఆలోచించిన వైఎస్ ప్రభుత్వం అప్పట్లో సన్నబియ్యం ఎగుమతులపై పలు ఆంక్షలు అమలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల బెదిరింపులకు భయపడి ఆ ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. ఎలాగైనా బియ్యం ఎగుమతికి పర్మిట్లు పొంది భారీగా గడించాలనే వ్యూహంతో, ముమ్మరంగా యార్డులకు ధాన్యం రాబోతున్న కీలక తరుణంలో కొనుగోళ్లు ఆపేస్తామంటూ మిల్లర్లు హెచ్చరికలకు దిగారు. కొన్ని రాజకీయపక్షాలు కూడా వారికి వంత పాడాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. మొన్నటికిమొన్న నెల్లూరు సన్నాల విషయంలో రోజుకోరకం జీవోలు విడుదల చేసి రైతును నిండా ముంచేసిన తీరు ఇంకా మరవకముందే ఆంక్షల ఎత్తివేతకు సిద్ధమవుతోంది. అదేమిటంటే గోదాముల సమస్యను సాకుగా చూపుతోంది. పర్మిట్లు ఇచ్చినా గోదాములు ఖాళీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే మూలుగుతున్న గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోకుండా పర్మిట్లు ఇచ్చినంతమాత్రాన సమస్య ఎలా పరిష్కారమవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

ఎక్కడెక్కడి నిల్వలూ రాష్ట్రంలోనే!

రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, వివిధ విభాగాలకు చెందిన గోడౌన్ల నిల్వ సామర్థ్యం 36 లక్షల టన్నుల వరకు ఉంది. ఇందులో ఇప్పటికే 33 లక్షల టన్నుల ధాన్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో రాష్ర్టంలో ఉపయోగించని, ఇక్కడ పండని గోధుమలు 2-3 టన్నులు కాగా, ఉప్పుడు బియ్యం ఏకంగా 21 లక్షల టన్నులు మూలుగుతున్నాయి. ఇవి మన అవసరాలకు ఉపయోగపడవు. అలాగని వీటిని తరలించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. వివిధ ఆపదల సమయాల్లో ఇతర దేశాలకు చేసే సహాయం కింద ఆహారధాన్యాల నిల్వలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తరలించిందే తప్ప... మన రాష్ట్రంలో నిల్వ చేసిన ఉప్పుడు బియ్యాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ర్ట ప్రభుత్వం గట్టిగా కోరితే ఉప్పుడు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ విషయంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో గోదాములనిండా ఉప్పుడు బియ్యమే మూలుగుతోంది.

ఈసారి ఖరీఫ్, రబీలో అధిక దిగుబడులు వస్తాయని తెలిసినా ఈ నిల్వల తరలింపుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఫలితంగా ఈ బియ్యం ఇక్కడ నిల్వ ఉన్నంత కాలం గోదాముల సమస్య ఇలాగే కొనసాగనుంది. ఆహార ధాన్యాల నిల్వల తరలింపునకు సరిపడా రైల్వే ర్యాకులను తీసుకురావడంలోనూ కొంత వైఫల్యం కనిపిస్తోంది. సరిపడా ర్యాకులను తెప్పించగలిగామని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నా, అంతగా ర్యాకులు వచ్చి ఉంటే ఇప్పటికే సగం నిల్వలు ఖాళీ అయ్యేవని ఎఫ్‌సీఐ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నించగల నేత లేకపోవడంతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచాయి. మన ఉన్నతాధికారులు సైతం సీఎంతో కొన్ని లేఖలు కేంద్రానికి పంపించి, అదే సరిపోతుందనుకుని మిన్నకుండిపోయారు. ఫలితంగా ర్యాకులు రాక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి.

ఇదే అదునుగా మిల్లర్లు..!
గోదాముల్లో ఖాళీ లేకపోవడాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని పర్మిట్లు సాధించేందుకు మిల్లర్లు ఎత్తుగడ వేశారు. గోదాముల్లో ఖాళీ లేదనే సాకు చూపి కొనుగోళ్ల సమ్మె ప్రకటించారు. ముందుగా ధాన్యం వచ్చే తెలంగాణ మిల్లర్లు ఈ ప్రకటన జారీ చేయగా... అనుకూల నిర్ణయం వస్తే తమకూ మంచిదనే భావనతో ఆంధ్రా మిల్లర్లు కూడా ఇదే డిమాండ్‌ను వినిపించడం మొదలుపెట్టారు. నిజానికి ఒక మిల్లర్ 100 లారీలు లెవీ పెడితే, తనకు ఎగుమతి పర్మిట్లు వచ్చేది కేవలం 25 లారీలకే! అందులోనూ మూడో వంతు మాత్రమే పచ్చిబియ్యం ఉండాలని, మిగతాది ఉప్పుడు బియ్యమైతే అభ్యంతరం లేదని గతంలో పూనం మాలకొండయ్య కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆంక్షలు విధించారు. తద్వారా విలువైన సన్నరకాల బియ్యం రాష్ట్రం నుంచి తరలిపోకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రస్తుతం సన్న బియ్యం ధరలు చాలా అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే కిలోకు 21 చొప్పున తాము ఎంత బియ్యమైనా మార్కెట్‌లో అమ్ముతామని చెబుతూ మిల్లర్లు ఒకరిద్దరు రాజకీయ నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. నిజానికి ఉప్పుడు బియ్యం ఎగుమతికి మిల్లర్లకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చినా అది ఎవరికీ నష్టం కలిగించదు. రైళ్లు, ఓడల ద్వారా ఎగుమతికి అవకాశం కల్పించినా మంచిదే. కానీ ఈ ముసుగులో సన్నరకాల బియ్యానికి రోడ్డు మార్గంలో (లారీల్లో...) పర్మిట్లు పొందాలనేది మిల్లర్ల ఎత్తుగడ. గతంలో ఇలా పర్మిట్లు పొంది భారీగా కాండ్లా రేవుకు తరలించి, అక్కడ్నుంచి విదేశాలకు అమ్మారని ప్రభుత్వమే ఒక దశలో నిర్ధారించుకుని భారీగా మిల్లులపై దాడులు చేసి కేసులు పెట్టింది. ఇప్పుడవన్నీ విస్మరించి, మిల్లర్ల హామీలను విశ్వసించి ఆంక్షల సడలింపునకు పూనుకోవడమే విచిత్రం!

నెల్లూరు సన్నాల పేరుతోనూ దోపిడీ!
నల్లమచ్చ పేరిట గత ఏడాది మిల్లర్లు నెల్లూరు సన్నాల ధాన్యాన్ని కొనడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం కూడా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్‌సీఐ ద్వారా కొనిపించాలనే రైతుల డిమాండ్‌ను పక్కనబెట్టి, మచ్చ శాతాన్ని బట్టి ధాన్యం ధరలో కోత పెట్టి మిల్లర్లే కొనుగోలు చేసుకోవచ్చునని జీవో ఇచ్చింది. ఈ వాల్యూకట్ విధానంలో మిల్లర్లు అడ్డగోలు ధరలకు కొన్నాక, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించటానికి అనుకూలంగా మరో జీవో ఇచ్చింది. మిల్లర్లు తమ నిల్వలను ఈ సంస్థలకు అమ్మేసి బాగుపడ్డారు. మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించే ప్రస్తుత ఉన్నతాధికారుల వైఖరికి ఇదే పెద్ద ఉదాహరణ. కేవలం 25 శాతం పర్మిట్ల కోసం ఎగుమతికి అవకాశాలు ఇస్తే... మొత్తం గోదాముల సమస్య ఎలా పరిష్కారమవుతుందో ఆ అధికారులే చెప్పాలి. కొత్త గోదాముల అవసరాన్ని గతంలోనే వైఎస్ గుర్తించారు. 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లను నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికను రూపొందించారు. అందుకోసం ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రొత్సహించడానికి తగు చర్యల్ని తీసుకున్నారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన అకాల మృతికి గురయ్యారు. తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ఏడాది క్రితమే గోడౌన్ల నిర్మాణాలను చేపట్టినట్టయితే... ఈ పాటికి చాలా వరకు అందుబాటులోకి వచ్చేవి. ఎస్‌డబ్ల్యూసీ గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇప్పటికీ అవి ఖరారు కాలేదు. ఇప్పుడు నిర్మాణాలు ఆరంభించినా ఈ సీజన్‌కు ఆ కొత్త గోదాములు ఏమాత్రం ఉపయోగపడవు. ఉప్పుడు బియ్యం, గోధుమల నిల్వల తరలింపే ప్రస్తుత పరిష్కారం. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం మిల్లర్ల పాటకు వంత పాడుతూ సమస్యకు పరిష్కారం చూపని పర్మిట్ల జారీకి సంసిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై అఖిలపక్షం సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ అంతా బాగానే ఉందని, గోదాముల సమస్యతో సహా అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అలాగైతే బియ్యం ఎగుమతులకు పర్మిట్ల మాటేమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం కొసమెరుపు!!
దాన్యం నిల్వలకు ప్రైవేటు గిడ్డంగులు
 సీఎం రోశయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది ధాన్యం ఉత్పతి అధికంగా వచ్చే అవకాశముందని, ధాన్యం నిల్వల కోసం ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దెకు తీసుకోవాలని ఆదేశించామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సోమవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యాల నిల్వకు తగిన వసతికోసం గత రెండు మాసాలుగా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందని తెలిపారు. ఎఫ్‌సీఐ, రైల్వే, పౌరసరఫరాల శాఖ, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలన్నిటితో సమన్వయం చేస్తూనే ఉన్నామని, మరీ ముఖ్యంగా రైల్వే విభాగాన్ని కనీసం 7 రాక్స్ కావాలని అడిగామని చెప్పారు. అదనపు స్పేస్ కోసం అవసరమైతే ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దె (హైర్)కు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం కూడా అత్యధిక సంఖ్యలో నిల్వ ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు బయటకు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి రైతులకు కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు. గోదాముల అద్దె ప్యాకేజీ ఆకర్షించే విధంగా లేదని, ఆ పాలసీని సవరించి, ఆమోదయోగ్య పాలసీని తీసుకురావాలన్న మిల్లర్ల కోరికను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ విషయాలన్నిటినీ మంగళవా రం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని రోశయ్య చెప్పారు.

తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన గిడ్డంగులు: ఖరీఫ్‌తో పాటు రబీలోనూ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుండటంతో రాష్ట్రంలో ధాన్యాల నిల్వలకు గాను తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదిక గిడ్డంగుల ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖామంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి వద్ద సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది 3 నుంచి 4 శాతం అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, రానున్న జనవరి నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక యూనిఫైడ్ కో-ఆపరేటివ్ యాక్ట్
త్వరలోనే సహకార శాఖలో యూనిఫైడ్ యాక్ట్ రానుందని సహకార శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సహకారశాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టంపై ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించి ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 2831 కోట్లు రుణాలిచ్చామని, రబీలోనూ రూ. 1885 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పం రెస్కోలకు ఎన్నికలు జరపాలని సీఎం ఆదేశాలిచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లా తరహాలోనే రాష్ట్రంలో అన్ని సొసైటీ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తామని ఆయన చెప్పారు.

Sunday, October 3, 2010

కలలూ - శిక్ష

తీరని కోర్కెలు కలల రూపంలో వస్తాయంటారు.
కోర్కెలు తీరని వాళ్లు దెయ్యాలై తిరుగుతుంటారంటారు.
ఈ రెండిట్లో మీరు ఏది కావాలనుకుంటున్నారు?

***

ఎసిబి వలలో చిక్కిన అధికారిని చెయ్యి చాపమని చెప్పి అందరూ
చూస్తుండగా చింతబరికెతో ఒక్కటిచ్చింది ఆవిడ.

భూమిని చాప చుట్టి భుజం మీద పెట్టుకుని పారిపోతున్న ఒకాయన్ని నేల
తగలకుండా చెట్టు కొమ్మకు వేళ్లాడగట్టింది.

రాజకీయాటలు ఆడుతున్న వాడ్ని ప్రజాకోట గుమ్మం ముందు నిలబెట్టి
వోటరు కనబడినప్పుడల్లా వందేసి గుంజీలు తీయమంది.

ఎరువులు దాచినవాడిని రచ్చబండ మీదికి పిలిచి చెంప ఛెళ్లుమనిపించింది.
యాసిడ్ బాటిల్ పట్టుకున్నవాడి చేతిని గోడకుర్చీ వేసి కూర్చోపెట్టింది.

కన్నీళ్లు తెప్పించేవాడి ఇంట్లో నీళ్ల కొళాయిని బంద్ చేసింది.
రక్తం కళ్లజూసినవాడి ఒంట్లో హెమోగ్లోబిన్‌ను తగ్గించేసింది.

***

అంటే ఈవిడ మొదటి కోవకు చెందింది. అందుకే కలల్లోనే న్యాయం
వెతుక్కుంటోంది.
రెండో కేటగిరీలో ఇప్పుడు ఎవరికీ చోటు లేదు. అక్కడ ఇప్పటికే కిక్కిరిసి ఉంది.