Showing posts with label leaders. Show all posts
Showing posts with label leaders. Show all posts

Sunday, June 24, 2012

ఊపే ఆ చేతుల వెనక...



వాళ్లు ఎందుకు చేతులు ఊపుతున్నారు? ఒలింపిక్స్‌లో గెలిచి దేశానికి మంచి పేరు తెచ్చారనా? ఎవరెస్టును అధిరోహించి గర్వకారణంగా నిలిచారనా? అంతరిక్షంలో మన జెండాను నాటారనా..? ఏమి ఘనకార్యం చేశారని చేతులు ఊపుతున్నారు? చేతులు ఊపుకుంటూ అత్తగారింటికి వెళ్లినట్లు జైలుకు వెళుతున్న దృశ్యాలు ఈ మధ్యనే చాలానే కనిపిస్తున్నాయి. ఇదేదో ఆషామాషీగా వ్యవహారం కాదు. నిందితులు కప్పుకున్న ఈ ముసుగు వెనుక లోతుల్ని కనుక్కునేందుకు సైకాలజిస్టుల్ని సంప్రదిస్తే.. 
వాళ్లు చేసిన విశ్లేషణే ఈ  స్టోరీ..

ఒక జేబుదొంగ పది రూపాయలు కొట్టేసి పోలీసులకు దొరికిపోతే.. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అరచేతుల మధ్యన దాచుకుంటాడు.
రెండొందలో, మూడొందలో లంచం తీసుకున్న క్లర్కు ఏసీబీకి చిక్కితే.. తలదించుకుని కోర్టులోకి అడుగుపెడతాడు.
ఒక సెక్సువర్కరు పడుపు వృత్తి చేస్తూ దొరికితే.. కొంగుతో ముఖం కప్పుకుని ఒక మూల నిలబడుతుంది.

చిన్న తప్పులు చేసినందుకే వీళ్లంతా అపరాధభావంతో కనిపిస్తారు. కాని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నిందితులు అలా కనిపించడం లేదు. ఎన్నడూ లేనివిధంగా జైలుకు-కోర్టుకు తిరుగుతున్నప్పుడు.. చేతులు ఊపుతూనో, చిరునవ్వులు చిందిస్తూనో, నమస్కారాలు పెడుతూనో కనిపిస్తున్నారు. ఈ విచిత్రాలు ఈ మధ్య కాలంలోనే మొదలయ్యాయి.

ఇంతకు మునుపు పోలీసులు ఇంటికొస్తేనో, కేసుల్లో ఇరుక్కుని కోర్టు గుమ్మం తొక్కితేనో పరువంతా పోయిందనుకునే వాళ్లు. వైట్‌కాలర్ నేరాల్లో ఈ పరిస్థితి కనిపించదు. ఎందుకంటే, వైట్ కాలర్ నేరమంటేనే.. ప్రజలకు అర్థంకాని బ్రహ్మపదార్థం. ఒక వ్యక్తిని హత్య చేశాడనో, దాడి చేసి గాయపరిచాడనో తెలిస్తే అతన్ని ఖూనీకోరుగా చూస్తారు. అవినీతి నేరాలు సంఘంలోని వ్యక్తులకు నేరుగా ఇబ్బంది కలిగించవు. ప్రత్యేకించి ఒక వ్యక్తి అంటూ బాధితుడుగా ఉండడు. ప్రభుత్వలొసుగులు, చట్టాలను వాడుకుని.. అవినీతికి పాల్పడటం ఇందులోని ముఖ్య లక్షణం. పాలనలో పాలుపంచుకునే నేతలు, కార్పొరేట్ అధిపతులు, లాబీయింగ్ చేసేవాళ్లు.. ఇలాంటి అవినీతిని చేస్తుంటారు.

"వీరు తప్పు చేసినప్పుడు ప్రజల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత రాదు. ఎందుకంటే, వారికున్న పలుకుబడి, పరపతి అలాంటిది. అందువల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కూడా గిల్టీగా ఫీలవరు. ప్రస్తుతం అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతికి పాల్పడటమన్నది నేతలకు చిన్న విషయమైపోయింది. కోర్టుల్లో శిక్ష పడుతుందన్న నమ్మకం లేదు. విచారణకు చాలా సమయం పడుతుంది..'' అంటున్నారు నిపుణులు. ఇవన్నీ అవినీతి, అక్రమార్జన నేరాలకు పాల్పడిన వారికి బాగా కలిసొస్తున్నాయి. ఒక ఆరోపణ రుజువు కావడం, జైలు శిక్ష పడటం సంగతి అలా ఉంచితే.. ఈ తరహా నిందితుల మనస్తత్వం సాధారణ నేరస్తుల కంటే భిన్నమైనదని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. కొందరు అరెస్టు అవుతారన్న సంగతి ముందే తెలియడంతో మానసికంగా సన్నద్ధం కావడం కూడా ధీమాగా వెళ్లడానికి కారణం కావచ్చు.

జగన్ కేసుతో మొదలు..

జైలుకు, కోర్టుకు చేతులు ఊపుకుంటూ వెళ్లే ట్రెండు ఆడిటర్ విజయసాయిరెడ్డితోనే మొదలైంది. అది జగన్ అరెస్టుతో ఊపందుకుంది. రాష్ట్రం యావత్తూ ఆసక్తిగా తిలకించిన సంఘటన.. జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించడం. టీవీ చానళ్లు మళ్లీ మళ్లీ చూపించడంతో.. ఆ దృశ్యం ఇప్పటికీ అందరి కళ్లల్లో మెదులుతోంది. వ్యాను దిగిన వెంటనే ఆయన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుగా మీడియా ప్రతినిధులు కెమెరాలు పట్టుకుని నిల్చున్నారు. అలాంటి సమయంలో.. పోలీసులు నిందితుల భుజం మీద చేయి వేసి జైలుకు తీసుకెళ్లటం సహజంగా జరుగుతుంటుంది. అలా తీసుకెళితే..! పరువు పోదా? వ్యాన్‌లో కూర్చున్నప్పుడే జగన్‌కు ఆలోచన వచ్చి ఉండవచ్చు. ప్రజలందరూ చూస్తుండగా అలా లోపలికి వెళ్లడం జగన్ మనస్తత్వానికి ఇష్టముండదని మానసికవేత్తలు విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం- వ్యాన్ దిగిన తర్వాత తను జైలు ద్వారం వరకు ఎలా నడవాలో ఆయన ముందుగానే నిశ్చయించుకుని ఉంటారు. 'నువ్వు ఉండవయ్యా'', "నువ్వు కూడా ఉండు..'' అన్న భావం వచ్చేలా ఆయన రెండువైపులా ఉన్న పోలీసులను అటొక చేత్తో, ఇటొక చేత్తో సైగ చేసి దూరం పెట్టారు.

ఆ తర్వాత కుడిచేత్తో కాలర్‌ను సర్దుకుని.. రెండు చేతులు జోడించారు. నిజానికి ఆయన ఎదురుగా ప్రజలెవ్వరూ లేరు. ఉన్నది టీవీ ఛానళ్ల రిపోర్టర్లు, కెమెరామెన్లు మాత్రమే. అయినా చిరునవ్వును పులుముకుని.. పదే పదే రెండు చేతులు జోడించి నమస్కారాలు పెట్టడం టీవీల్లో చూసేవాళ్లకు చిత్రంగా అనిపించింది. ఒకనాటి ముఖ్యమంతి పుత్రున్ని జైల్లో పెడుతున్నారన్న ఆసక్తితో టీవీలు చూస్తున్న జనాన్ని ఆ దృశ్యం ఆశ్చర్యపరిచింది. "జైలు దగ్గర జగన్ అన్నిసార్లు ఎందుకు నమస్కారాలు పెట్టాడు?'' అని చాలామంది ప్రజలు అనుకున్నారు. పోలీసు వ్యాను దగ్గరి నుంచి జైలు గేటు వరకు ఉన్న ఇరవై అడుగుల దూరంలోనే ఆయన కనీసం పది నుంచి పదిహేనుసార్లు దండాలు పెట్టాడు.

వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జైలుకు వెళుతున్న జగన్.. "నేనేమీ తప్పు చేయలేదు. నా మీద రాజకీయకక్ష తీర్చుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఇదంతా చేస్తున్నది అని జనానికి తెలియజేసేందుకు తల ఎత్తుకుని ధైర్యంగా లోపలికి వెళ్లారు'' అంటున్నారు సైకాలజిస్టులు. "అలాంటి సమయంలోనే వ్యక్తి నిగ్రహం, సహనం తెలుస్తుంది. జగన్ వ్యూహాత్మకంగా నమస్కారాల్ని ఎంచుకున్నాడు. కొన్నాళ్లకు ఎన్నికలు కూడా రానున్నాయి. ప్రజలు తన పట్ల సానుభూతి చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఆ పద్ధతిని ఎంచుకున్నాడు. టీవీ విలేకర్లకు నమస్కరించలేదు. టీవీలు చూసే ప్రజలకి నమస్కారాలు చేశారు. అందుకే, ఆ దృశ్యానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది'' అని పేర్కొన్నారు విశ్లేషకులు. ఒక పార్టీ నాయకునిగా.. "నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దేన్నయినా ఎదుర్కొనే ధీమాతోనే ఉన్నాను. ఏదో ఒక రోజు మళ్లీ బయటికి వస్తాను'' అన్న అంతరార్థం ధ్వనించేలా జగన్ తన హావభావాల్ని ప్రదర్శించినట్లు వారు చెబుతున్నారు.
తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అవసరమైతే ప్రజల నుంచి సానుభూతి పొందడానికి, విచారణ అధికారుల్ని తప్పుదోవ పట్టించడానికి.. సాధారణంగా నిందితులు కొన్ని వ్యూహాల్ని ఎంచుకుంటారు. వాటినే క్రిమినల్ సైకాలజీలో 'సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం' అంటారు.

రివర్స్‌గేర్..

సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ప్రధానంగా మూడు లక్షణాల్ని ప్రదర్శిస్తారు నిందితులు. అందులో ఒకటి 'ప్రొజెక్షన్'. తను చేసింది తప్పు అని తెలిసినా, పూర్తి రివర్స్‌గేర్‌లో ప్రవర్తిస్తారు. అందుకు అనుగుణంగా శరీరభాషను, ముఖకవళికల్ని మారుస్తారు. మంచి వ్యక్తిగా నటించడం. "అన్ని పార్టీలు, నాయకులు నన్ను ఒంటరివాడ్ని చేసి దాడి చేస్తున్నారు'' అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అవినీతి నేరాలకు పాల్పడిన రాజకీయనేతలు సింపతీ అస్త్రాన్ని వాడుకున్నంతగా దేన్నీ వాడుకోరు. రెండోది-'రేషనలైజేషన్'.

ఒక పిల్లవాడిలో ఇలాంటి లక్షణం ఉందనుకోండి. అతను పరీక్షలో ఫెయిలైనప్పుడు 'ఏంట్రా బాగా చదువుకోలేదా' అని తల్లి అడిగితే.. తను చదవలేదన్న నిజాన్ని అంత ఈజీగా ఒప్పుకోడు. 'నేనైతే పరీక్ష బాగా రాశానమ్మా. పేపరు దిద్దిన వాడే నన్ను ఫెయిల్ చేశాడు. నా తప్పు ఏమీలేదు..'' అని ఎదుటివాళ్ల మీదికి తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తాడు. డిఫెన్స్ మెకానిజంలో 'ఎస్కేపిజం' కిందికి వస్తుంది ఈ తరహా ప్రవర్తన. వైట్‌కాలర్ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు రాజకీయ నేతలైతే.. ఇదే అస్త్రాన్ని బయటికి తీస్తారు. "నువ్వు చేసింది తప్పు'' అని అవతలి పార్టీ విమర్శిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. "మంత్రులే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మా నేతకు ఏమీ సంబంధం లేదు'' అని ఎదురుదాడికి దిగడం చూస్తున్నాం.

వైట్‌కాలర్ నేరాల్లో ఇరుక్కున్న నిందితులు.. విచారణలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే, వీరికి చట్టాల్ని ఎలా వాడుకోవాలి? వాటి నుం చి రక్షణ ఎలా పొందా లి? దొడ్డి దారులు ఎక్కడుంటాయి? బాగా తెలుసు. అందుకే, దర్యా ప్తులో కూడా అంత సులువుగా సహకరించరు. ఈ మధ్య జగన్ తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు కూడా విన్నవించింది. నార్కోటిక్ పరీక్షలకు కూడా అనుమతించాలని పేర్కొంది. ఇక, డిఫెన్స్‌మెకానిజంలో మూడో లక్షణం-'రియాక్షన్ ఫార్మేషన్'. తప్పు చేసినప్పటికీ.. "నేను దేనికీ భయపడను..'' అని ఎదుటివాళ్లను నమ్మించే ప్రయత్నం చేయడం. వైట్‌కాలర్ నేరస్తులు నేరం రుజువయ్యే వరకు.. తనను తాను నిత్యం ప్రోత్సహించుకోవడం దీని కిందికే వస్తుంది.

పాపభీతి శూన్యం..

చాలామంది అవినీతి నేరస్తుల్లో పాపభీతి ఏ కోశాన ఉండదు. తాము తప్పు చేశామన్న పశ్చాత్తాపభావం కాని, తప్పును సరిదిద్దుకోవాలన్న ప్రయత్నం కాని చేయరు అంటున్నారు క్రిమినల్ సైకాలజీ అధ్యయనం చేసిన డాక్టర్ నీలిమ. వీరికి డబ్బుపట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది.ఈ మితిమీరిన వ్యామోహం వెనుక మానసిక దౌర్బల్యం ఉంటుంది. పుట్టి పెరిగిన కుటుంబం, పెరిగిన వాతావరణం, జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యం.. ఇవన్నీ ఒక మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడతాయి. ఈ మధ్య అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న కొందరు నిందితుల మనస్తత్వాలను విశ్లేషించిన సైకాలజిస్టులు.. ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్థాంతం ప్రకారం ఇలా చెప్పారు- "ఒక మనిషిలో ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే మూడు లక్షణాలు ఉంటాయి. మొదటి దాంట్లో భౌతిక లక్షణాలు, రెండో దానిలో మానసిక లక్షణాలు, మూడోదానిలో నైతికత ఉంటాయి.

ఇందులో మళ్లీ కాన్షన్స్, ఇగో ఐడియల్స్ ఉన్నాయని చెప్పారు ఫ్రాయిడ్. వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేందుకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్‌ను సృష్టిస్తాయి ఇగో ఐడియల్స్. ఇవి బలహీనంగా ఉంటే ఇంపల్సివ్‌గా తయారవుతారు. వ్యామోహ కోలాహలంలో కొట్టుకుపోతారు. ఇలాంటి వ్యక్తుల్లో పాపభీతి అన్నదే ఉండదు. "నాకు డబ్బు కావాలి. దాన్ని ఏ దారిలో సంపాదించినా తప్పు లేదు. ఎవరేమనుకున్నా పట్టింపు లేదు. వ్యవస్థలు ధ్వంసమైనా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా పరవాలేదు. నా లక్ష్యం నాది. నా పంతం నాది. అది నెరవేరాలంతే!'' అనుకునే మనస్తత్వం రాజకీయపరమైన నేరస్తుల్లో పుష్కలంగా ఉంటుంది. వీరు జైలుకు వెళ్లినా, చట్టాలు శిక్షలు వేసినా భయపడరు. పశ్చాత్తాప భావంతో వ్యక్తిత్వాన్ని మార్చుకునే ప్రయత్నమే చేయరంటారు నిపుణులు. అవినీతిపరులు ఎన్ని అడ్డంకులున్నా నేరం చేయడానికి వెనుకాడరు. దీన్ని రుజువు చేయడానికి నేరస్తుల మనస్తత్వం మీద పరిశోధనలు చేసిన హెచ్.జె.ఐజంక్ ఒక ప్రయోగం చేశాడు.

అందుకు ఆయన కొన్ని కుక్కల్ని తీసుకున్నాడు. ఒక చోట చిన్న జాలీ పెట్టి.. దానికి కరెంటు పెట్టాడు. జాలీ అవతల కొన్ని మాంసపు ముక్కల్ని ఉంచాడు. మాంసాన్ని చూస్తూనే కుక్కలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లాయి. దగ్గరకు వెళ్లగానే కరెంటు షాక్ తగిలింది. 'అమ్మో ఇదేదో ప్రాణం మీదికి వచ్చేట్టుంది' అని కొన్ని కుక్కలు వెనక్కి తిరిగాయి. మరికొన్ని కుక్కలు తటపటాయిస్తూ ఆగిపోయాయి. మూడో గ్రూపు షాక్‌ను భరిస్తూనే.. జాలీని దాటుకుని వెళ్లి.. మాంసాన్ని బొక్కేశాయి. మన దగ్గర ఎన్ని కఠినమైన చట్టాలు, బలమైన విచారణ వ్యవస్థలు, పత్రికలు, ప్రజాసంఘాలు ఉన్నా.. అవినీతి నేరస్తుల్లో భయం కనిపించదు అని చెప్పడానికి ఐజంక్ ఈ ప్రయోగాన్ని ఉదహరిస్తారు.. అని ప్రముఖ సైకాలజిస్టు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంత తీవ్రమైన కాంక్ష కేవలం డబ్బు సంపాదించాలన్న కోరిక నుండే పుడుతుంది.. అందుకు ఉపకరించే స్వభావాన్ని 'సైకోపతిక్ ఆటిట్యూడ్' అంటారు.

సైకోపతిక్ ఆటిట్యూడ్..

బాల్యం నుంచి నేరగ్రస్త కుటుంబంలో పెరగడం, భూస్వామ్య మనస్తత్వం అలవడటం, నాకెవరూ ఎదురు చెప్పకూడదనుకునే మనస్తత్వం, చట్టాన్ని గౌరవించకుండా అనైతిక పద్ధతుల్ని ఎంచుకోవడం, తను అనుకున్నది తప్పయినా, ఒప్పయినా మూర్ఖంగా చేయడం.. సైకోపతిక్ ఆటిట్యూడ్ ముఖ్య లక్షణాలు. వైట్‌కాలర్ నేరస్తుల్లోనే కాదు, ఫ్యాక్షన్ నేతల్లో కూడా ఈ లక్షణాలు ఎక్కువ. జైలుకు వెళ్లడమన్నా, శిక్షలు అనుభవించడమన్నా వీరికి గిట్టనే గిట్టదు. తప్పును ఆత్మపరిశీలన చేసుకుని.. మారడమంటే పరమ చికాకు. ప్రభుత్వ నిబంధనలే కాదు, ఏ నిబంధనలూ వారికి అడ్డం రాకూడదు అనుకుంటారు.. అన్నది సైకాలజిస్టుల అభిప్రాయం. పరిమితుల్లేని స్వేచ్ఛను కోరుకుంటారు.

విపరీతమైన స్వార్థం ఉంటుంది.ప్రజాస్వామ్యం జాంతానై. అంతా సొంత స్వామ్యంతోనే నడపాలని చూస్తారు. వీరికి కుటుంబ సంబంధాలూ అంతంతమాత్రమేనని ఈ నేరస్తుల్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరితోనూ ఎక్కువ కాలం స్నేహాన్ని కూడా కొనసాగించలేరు. అక్కరపడ్డప్పుడు దగ్గరవ్వడం, పనికిరారనుకుంటే పక్కన పెట్టడం వీరికి వెన్నతోపెట్టిన విద్య. అక్రమమార్గంలో పని చేయించుకోవడానికి అస్త్రాలన్నీ ప్రయోగిస్తారు. బుజ్జగిస్తారు. ఎరవేస్తారు. అవేవీ ఫలించకుంటే.. దండం ఎలాగూ ఉంది అంటున్నారు నిపుణులు. మొత్తానికి తాము అనుకున్న పని పూర్తి చేయడం ఈ నేరస్తుల లక్షణం. వీరి పాపానికి ఆఫీసర్లు జైలు పాలైనా 'అయ్యో పాపం' అనడం కూడా ఉండదు. తమ మేధో సామర్థ్యాన్ని, జ్ఞానసంపదను, సాంకేతిక వ్యవస్థను అంతా సొంతానికి వాడుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే - ఈ లక్షణాలున్న వారి ముందు "నేను'' తప్ప మిగిలినవన్నీ బలాదూర్.. అంటున్నారు మానసిక నిపుణులు.

సైకోపతిక్ ఆటిట్యూడ్ రాను రాను 'యాంటీ- సోషల్ పర్సనాలిటీ డిజార్డర్'గా మారిపోతుంది. దీని లక్షణాలు చాలా తీవ్రమైనవి. "నా అంతటివాడు మరొకడు ఉండకూడదు. నేనే అందరికంటే ఎక్కువ. నేను చెప్పిందే శాసనం..'' అనేలా ప్రవర్తిస్తారు. మానసిక దౌర్బల్యంలో ఇదొక జాడ్యం. దీన్ని 'నార్‌సిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్స్' అంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు. రోబోల్లాగే అనిపిస్తారు. ఎక్కడా గిల్టీగా కనిపించకుండా జాగ్రత్త పడతారు. "నేను అవినీతి చేయలేదు. కావాలనే ఇరికించారు. నా మీద ఎవరో కక్షగట్టారు...'' అని బయటికి చెప్పడమే కాదు, మనసులోనూ బలంగా విశ్వసిస్తారంటున్నారు నిపుణులు. ఇందుకు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే సహించే స్వభావం వీరికి ఉండదు. సీబీఐలాంటి ఉన్నత దర్యాప్తు సంస్థలు కూడా ఈ తరహా నిందితులతో తలనొప్పులు పడాల్సి వస్తున్నది.

తలదించుకునే వాళ్లు..

అవినీతి నేరాల్లో జైలుకు వెళుతున్న నేతలు గిల్టీగా ఫీలవ్వడం లేదు కాని.. అధికార్లు, కార్పొరేట్ సంస్థల అధిపతులు మాత్రం తలవంచుకునే వెళుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి అధికారుల్లో "ఇలా చేసి ఉండాల్సింది కాదు..'' అన్న భావం వ్యక్తమవుతున్నట్లు వాళ్ల ముఖకవళికల్ని బట్టి చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు.ఉన్నతస్థాయి అధికారులు ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సివిల్‌సర్వీసులాంటి ఉన్నత ఉద్యోగాల్ని చేపట్టేందుకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలి. చదువు, క్రమశిక్షణ వాళ్లకు తెలియకుండానే ఒక మంచి వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఉద్యోగం ఒత్తిళ్లతోనో, డబ్బు ఆశతోనో తప్పు చేసి దొరికిపోతే.. అలాంటి వాళ్లలో అపరాధభావం చుట్టుముడుతుంది.. అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. స్వయంకృతాపరాధమే అయినా సత్యం కుంభకోణంలో అరెస్టయిన రామలింగరాజులో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉన్నతహోదాలో జీవించిన ఆయన అనూహ్యంగా అరెస్టయ్యారు.

ఒక తప్పు చేయడం వల్ల తన కీర్తిప్రతిష్టలు ఎలా మంటగలిసిపోయాయో తెలిసినందువల్లే కోర్టుకు వస్తున్నప్పుడు, జైలుకు వెళుతున్నప్పుడు. ఈ మధ్య బెయిలుపై బయటికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడా చేతులు ఊపడంగాని, నవ్వడం గాని చేయలేదు. ఆయన చేసింది ఆర్థిక నేరమైనా.. రాజకీయనేతల స్వభావానికి భిన్నంగా ఉండిపోయారు. జగన్ కేసులో అరెస్టయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి మాత్రం రామలింగరాజుకంటే భిన్నంగా ప్రవర్తించారు. "ఆయన ఆడిటర్ అనడం కంటే.. ఒక నేతకు ప్రధాన అనుచరుడు అనడం మంచిది. తన మేధోసంపత్తిని ఎందు కోసం వాడుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే, జైలుకు వస్తూపోతున్నప్పుడు ఒక రాజకీయనేత స్వభావాన్నే ప్రదర్శించారు..'' అన్నారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అధికారంలో ఉన్న నేతల ఒత్తిళ్లు, డబ్బు మీదున్న ఆశవల్ల మాత్రమే తప్పు చేసిన వాళ్లు.. తిరిగి మారేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు బాల్యం నుంచి అనైతికత స్వభావంతో పెరగలేదు.

పాలనాధికారం చేతిలోకి వచ్చాకే.. ఏ అధికారైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అదే రాజకీయ నేతలైతే... అనేక వక్రమార్గాల్లో నడిచి ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్' అనేది అధికారుల్లో కంటే నేతల్లోనే ఎక్కువని చెప్పారు మనస్తత్వశాస్త్ర నిపుణులు. ప్రముఖ ఆధ్యాత్మికవాది నిత్యానందస్వామిలో కూడా సైకోపతిక్ లక్షణాలున్నట్లు మానసిక నిపుణుల అభిప్రాయం. తాను అశ్లీల కార్యకలాపాలకు పాల్పడిన సంగతి ప్రజలకు తెలిసాక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అరెస్టయినప్పుడల్లా.. తెచ్చిపెట్టుకున్న ధీమాతో కనిపించే ప్రయత్నం చేశాడాయన. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి రాజా, కనిమొళి, గాలి జనార్దన్ రెడ్డిలాంటి వాళ్లు కూడా ప్రజలకు అభివాదం చేస్తూనో, చిరునవ్వులు చిందిస్తూనో టీవీల్లో కనిపించారు. అలా కనిపించినంత మాత్రాన ఏది నీతో, ఏది అవినీతో ప్రజలకు తెలియకుండా ఉండదు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు.

రెడ్ కాలర్ క్రైమ్

అధికారాన్ని, పలుకుబడిని, మేధోసామర్థ్యాన్ని వాడుకుని.. చట్టం కళ్లు గప్పి అక్రమంగా సంపాదిస్తే వైట్‌కాలర్ క్రైమ్ అవుతుంది. ఈ పదాన్ని మొదటిసారి 1939లో ఎడ్విన్ సదర్‌లాండ్ తొలిసారిగా అమెరికన్ సోషియలాజికల్ సొసైటీ సమావేశంలో ప్రకటించారు. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ తరహా నేరస్తులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని వైట్‌కాలర్ క్రైమే కుదిపేస్తున్నది. వైట్ కాలర్ క్రిమినల్స్ డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు. మానవ విలువలు, ప్రజాసంక్షేమం అనేవి పైకి కప్పుకున్న ముసుగులు మాత్రమే. నిజస్వరూపం మరోలా ఉంటుంది. తమ వైట్ కాలర్ నేరాలు బయటపడితే, అవి తన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయనుకుంటే.. హింసకు సైతం తెగిస్తారు ఈ నేరస్తులు. అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ చేసిన హింసనే 'రెడ్ కాలర్ క్రైమ్' అంటున్నారు. ఈ ధోరణి ఈ మధ్యనే మన దేశంలో వ్యాపిస్తోంది. వైట్ కాలర్ నేరస్తులు హింసకు పాల్పడే పరిస్థితులు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది.
- డా. నీలిమ ఓలేటి,
క్రిమినల్ జస్టిస్‌లో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తి, హైదరాబాద్

Friday, June 1, 2012

నాయకుడా.. నేరగాడా? - కొత్త పలుకు by RK

రాష్ట్రంలో మూడేళ్ల క్రితం జరిగిన దానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. ఇకపై ప్రజలే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా బెయిల్ పొందడానికి కోట్ల రూపాయలు వెదజల్లగలిగే వారి పట్ల ఇటు పౌర సమాజం, అటు వ్యవస్థలు కఠినంగా వ్యవహరించకపోతే దేవుడు కూడా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడలేడు!

మాటలు దొరకడం లేదు. అవినీతి, అక్రమాలను ఉపేక్షిస్తే ఏమి జరుగుతుందని భయపడ్డామో అదే జరిగింది. అవినీతి భూతం ఈ దేశం వెన్నెముకను విరిచేస్తోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసి 24 గంటలు గడవక ముందే, ఖనిజ సంపదను అడ్డంగా దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కోట్ల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై సి.బి.ఐ. కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్లు ఏ వ్యవస్థనూ కళంకితం చేయకుండా మిగల్చరని ఈ ఉదంతంతో రుజువైంది.

న్యాయ వ్యవస్థలోకి కూడా అవినీతి జొరబడిందని వార్తలు వస్తున్నప్పటికీ, ఈ స్థాయిలో ఒక న్యాయమూర్తి లంచం తీసుకుని దొరికిపోవడం దేశంలో ఇదే ప్రథమం! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ. విచారణ చేస్తున్న కేసులో కూడా కిందిస్థాయి న్యాయమూర్తి ప్రలోభాలకు లోనయ్యారంటే, అవినీతి మనల్ని ఎంతగా దిగజార్చుతున్నదో స్పష్టం అవుతోంది. వ్యవస్థల పతనం ప్రారంభం అయ్యాక అది మధ్యలో ఆగదు. అవినీతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే అది అన్ని వ్యవస్థలను కమ్మేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన గాలి జనార్దన్ రెడ్డి కేసు కావొచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసు కావొచ్చు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి పెడ ధోరణులు చోటుచేసుకున్న తర్వాత ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?

బెయిల్ పొందడం కోసం గాలి జనార్దన్ రెడ్డి కోట్లలో లంచం ఇచ్చారంటే... ఆయన ఎంత భారీ స్థాయిలో దోపిడీ చేశారో స్పష్టం అవుతుంది. అలాంటి వ్యక్తిపై నేర నిరూపణకు ఇంకా విచారణ అవసరమా? అన్నదే ఇప్పుడు ప్రశ్న! సి.బి.ఐ. వ్యవస్థపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ప్రలోభాలకు తలొగ్గకపోవడమే కాదు- ప్రాణాలకు తెగించి మరీ లక్ష్మీనారాయణ బృందం దర్యాప్తు చేస్తున్నది. తాము ఎంతో శ్రమకోర్చి, ఎంతో రిస్క్ తీసుకుని ఛేదించిన కేసులలో నిందితులను శిక్షించవలసిన న్యాయమూర్తులే లంచాలు తీసుకుంటే, నిజాయితీతో వ్యవహరిస్తున్న అధికారుల ఆత్మ స్థైర్యం ఏమి కావాలి? పట్టాభి రామారావు తరహాలో సి.బి.ఐ. అధికారులు కూడా లాలూచీ వ్యవహారాలకు తలొగ్గి గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిర్దోషులని దర్యాప్తు నివేదికలో పేర్కొనడానికి అంగీకరిస్తే వందల కోట్ల రూపాయలు లంచం రూపంలో వారు పొందలేరా? న్యాయ వ్యవస్థలో ఇంకా నిబద్ధత మిగిలే ఉంది కనుకే సి.బి.ఐ. అధికారులు కోరిన వెంటనే తదుపరి దర్యాప్తునకు హైకోర్టు అనుమతి ఇవ్వడమే కాకుండా, దోషిగా నిర్ధారణ అయిన న్యాయమూర్తిని సస్పెండ్ చేసింది.

ఇవే కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ.ఎ.ఎస్. అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి సి.బి.ఐ. కోరినా, కార్యనిర్వాహక వ్యవస్థ నెలల తరబడి నాన్చుతోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇందుకు భిన్నంగా సి.బి.ఐ. నివేదిక అందిన మరుక్షణమే స్పందించి పట్టాభి రామారావును సస్పెండ్ చేసింది. దొరికిన దొంగలు సరే- దొరకని దొంగల సంగతి ఏమిటి? డబ్బుతో ఎవరినైనా కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే పరిస్థితి కొనసాగితే భావి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహిస్తేనే భయం వేయడం లేదా! గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయమే తీసుకుందాం! ప్రజల సంపదను ఎడాపెడా దోచుకున్న గాలి న్యాయాన్ని కొనగలిగారు.

కానీ, ఇదే కేసులో కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటి వాళ్లు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి కూడా బెయిల్ లభించవచ్చు. బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచితే రోజు రోజుకీ ఆయన ఇమేజ్ పెరగడం లేదా? అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంలో అర్థం ఏమిటి? ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుల విషయంలో న్యాయవ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించాలేగానీ పర్యవసానాల గురించి ఆలోచించ వచ్చునా? ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని భావిస్తే, ఇకపై ఏ నేరస్థుడినీ శిక్షించలేం! ప్రజలు అమాయకత్వంతో కొంత మంది నేరస్థుల పట్ల సానుభూతితో ఉన్నా, ఆరాధనాభావంతో ఉన్నా, ప్రజలకు మార్గ నిర్దేశం చేయవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుంది.

సోదరుడి హత్యా నేరానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు లంచం ఇవ్వజూపి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కె.ఎ.పాల్‌కు కూడా బెయిల్ లభించింది. ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనందున, తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకోవడానికి వీలుగా తాత్కాలిక బెయిల్ ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా అయితే ప్రతి నేరస్థుడు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని కోర్టుల నుంచి రక్షణ పొందరన్న గ్యారెంటీ ఏముంది? జగన్మోహన్ రెడ్డి తరఫున బెయిల్ పిటిషన్లపై వాదిస్తున్న న్యాయవాదులు కూడా తమ క్లయింట్‌పై పద్దెనిమిది మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకున్నారు. జగన్ కూడా ఇదే విషయం కింది కోర్టులో స్వయంగా చెప్పుకున్నారు. నిజానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అక్రమాస్తుల కేసులో సి.బి.ఐ. ఆయనను ఎ-1గా పేర్కొంది.

అంటే, జగన్‌ను ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారని ఆయన పార్టీ అభ్యర్థులకు తెలియదా? తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన అక్రమాలకు ఏదో ఒక రోజు బోను ఎక్కక తప్పదని జగన్‌కు తెలియదా? అయినా, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కనుక, ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వీలుగా బెయిల్ ఇవ్వవలసిన అవసరం ఉందా? ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా పరిగణించాలన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న! ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో చట్టాలు, న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలి? సమాజంలో వారి పట్ల ఎటువంటి దృక్పథం ఉండాలి? అనే మౌలిక ప్రశ్నలు ఈ కేసుల సందర్భంగా తలెత్తుతున్నాయి. ఉప ఎన్నికలు ముందు పెట్టుకుని జగన్‌ను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అని కొందరంటారు. ఈ చర్య వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని మరి కొందరు విశ్లేషిస్తుంటారు.

ఇంత కాలం అరెస్ట్ చేయకుండా సి.బి.ఐ. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసిందని మరికొందరు ప్రశ్నిస్తారు. ఇవన్నీ నిజ మే! జగన్‌ను అరెస్ట్ చేయడంలో సి.బి. ఐ. జాప్యం చేసి ఉండవచ్చు. ఆ విషయం ప్రశ్నించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. లోపం జరిగి ఉంటే సంజాయిషీ ఇవ్వవలసిన బాధ్యత సి.బి.ఐ. పైన ఉంటుంది. అంతేగానీ, జగన్‌పై చర్యల వల్ల తలెత్తే పరిణామాల గురించి ఆలోచించవలసిన అవసరం చట్టాలు, వ్యవస్థలకు ముఖ్యంగా న్యాయస్థానాలకు లేదు. జగన్‌కు సంబంధించి ఒక విషయంలో సమాజానికి, వ్యవస్థలకు స్పష్టత రావలసిన అవసరం ఉంది. అది ఏమిటంటే ఆయనను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చూడాలా? లేక ఆర్థిక నేరస్థుడిగా మాత్రమే చూడాలా? ఈ విషయం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్లు రాజకీయ పార్టీలు పెట్టుకున్నంత మాత్రాన, లేదా ప్రజల్లో వారికి ఆదరణ ఉన్నంత మాత్రాన చట్టాల నుంచి రక్షణ ఏమీ ఉండ దు.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యాపారవేత్తలపై చర్య లు తీసుకోవడం లేదా? అటువంటి సందర్భాలలో వారి ఆధీనంలోని పరిశ్రమలు, సంస్థలు దెబ్బతిం టే అందుకు ప్రభుత్వాలు, సమాజం ఎందుకు బాధ్యత వహించాలి? జగన్ విషయంలో కూడా ఇంతే! అవినీతికి పాల్పడిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేయడం వల్ల ఆయన పార్టీ లాభపడినా, నష్టపోయినా వ్యవస్థలు, సమాజం ఎందుకు ఆందోళన చెందాలి? జగన్‌ను ఆర్థిక నేరస్థుడిగానే చూడాలిగానీ, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా పరిగణించాలని ఏ చట్టంలోనూ లేదు. ఆర్థిక నేరస్థుల పట్ల ఇటు సమాజం, అటు వ్యవస్థలు ఉదారంగా వ్యవహరిస్తే అది మనకు మనం చేటు కొనితెచ్చుకోవడమే అవుతుంది.

ఉదాసీనత వల్ల ఏమి జరుగుతుందో న్యాయమూర్తి పట్టాభి రామారావు రూపంలో చూశాం! గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తులు తమ వద్ద ఉన్న అక్రమ సంపదతో ఎవరినైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అదే జరిగితే ఈ దేశ న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఏమి విశ్వాసం ఉంటుంది? వారికి దిక్కు ఎవరు? ఎమ్మార్ కేసు విషయమే తీసుకుందాం! ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు గరిష్ఠంగా వంద కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సి.బి.ఐ. తన చార్జిషీటులో పేర్కొంది. ఇది చిన్న మొత్తం కాకపోయినా గాలి, జగన్ కేసులతో పోల్చితే ఇది బహు స్వల్పం. అయినా ఎమార్ కేసులో కోనేరు ప్రసాద్, ఐ.ఎ.ఎస్. అధికారి బి.పి.ఆచార్య వంటి వాళ్లు కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి వలె కోట్లు విరజిమ్మగలిగి ఉంటే వారికి కూడా బెయిల్ వచ్చి ఉండేదని ప్రజలు భావిస్తే తప్పు పట్టవలసింది ఏమీ లేదు! ఓబుళాపురం మైనింగ్ కేసులోగానీ, అక్రమాస్తుల కేసులోగానీ ప్రధానంగా లాభపడింది గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలే! వీరికి సహకరించిన నేరానికి పలువురు జైలు పాలయ్యారు. భారీగా ప్రయోజనం పొందిన వారి పట్ల ఉదారంగా వ్యవహరించి, వారికి సహకరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని న్యాయవ్యవస్థ మాత్రం ఎలా సమర్థించుకోగలదు! అవినీతి విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు అత్యం త క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది కనుక, పనిలో పనిగా న్యాయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయడానికి పూనుకుంటే ఈ దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. లేనిపక్షంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారు జైలులో మగ్గుతూ ఉంటే, గాలి, జగన్ వంటి వాళ్లు స్వేచ్ఛగా విహరించే ప్రమాదం ఉండనే ఉంది. లంచం తీసుకుని గాలికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి పట్టాభి రామారావు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సి.బి.ఐ.ని అభినందించకుండా ఉండలేం!

ఈ విషయం అలా ఉంచితే, అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన పక్షం నుంచి, ప్రత్యర్థి పక్షం నుంచి రకరకాల వాదనలు వస్తున్నాయి. జగన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తల్లి శ్రీమతి విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నా రు. ఆమె కల త చెందడాన్ని అర్థం చేసుకోవచ్చు. కన్న కొడుకు ఎం తటి దుర్మార్గుడైనా శిక్షించబడినప్పుడు ఏ తల్లి అయినా రక్తం పంచి జన్మనిచ్చినందుకు బాధపడుతుంది. విజయలక్ష్మి విషయానికి వస్తే, ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె చేస్తున్న ఆరోపణలతో మొత్తం వ్యవహారం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగుతున్నదని స్పష్టం అవుతున్నది. నిజానికి ఉప ఎన్నికలకు ముందే జగన్ అరెస్ట్ అయి తే సానుభూతి పవనాలు వీచి తమ గెలుపు సునాయాసం అవుతుందని యువజన, శ్రామిక, రైతు పార్టీ నేతలు లోలోపల కోరుకున్నారు. తనను అరెస్ట్ చేయబోతున్నారని జగనే స్వయంగా ప్రకటించుకున్నారు.

తాను అరెస్ట్ అయితే పార్టీ తరఫున తన తల్లి ప్రచారం చేస్తారని కూడా జగన్ ఎప్పటినుం చో చెప్పుకుంటున్నారు. అంటే, ఈ అరెస్ట్ ఊహించని పరిణామం ఏమీ కాదు. అయితే.. దివంగత రాజశేఖర్‌రెడ్డి సతీమణి గా, ఒక సాధారణ గృహిణిగా శ్రీమతి విజయలక్ష్మి పట్ల ఇప్పటివరకు అందరికీ గౌరవం ఉండేది. కానీ, తన భర్త మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర ఉందని ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ఆరోపణలతో ఆమె కూడా సాదాసీదా రాజకీయవేత్తగా, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని స్పష్టం అవుతోంది. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని చెప్పడం పనికి వస్తుందేమోగానీ, ఇందులో హేతుబద్ధత కనిపించడం లేదు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి అత్యంత విధేయుడిగానే వ్యవహరించారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉభయుల మధ్య పొరపొచ్చాలు తలెత్తిన దాఖలాలు ఏమీ లేవు. అయినా, కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రకు పాల్పడి, తన భర్తను చంపించిందని శ్రీమతి విజయలక్ష్మి ఆరోపిస్తే నమ్మడం ఎలా? ఇక్కడ ఒక విషయం ఆమె స్పష్టం చేయాలి. తన భర్త మరణం వెనుక కుట్ర ఉందని ఆమెకు ఎప్పుడు అనుమానం కలిగింది? తన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకునే వరకు ఆమెకు అనుమానం ఎందుకు రాలేదు? ముందునుంచి ఈ అనుమానం ఉండి ఉంటే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, ఆయన నియోజకవర్గమైన పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై కొంత కాలంపాటు ఆ పార్టీ సభ్యురాలిగా ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత శ్రీమతి విజయలక్ష్మిపై ఉంది.

శ్రీమతి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనని కాసేపు అనుకుందాం! అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా చలామణి అవుతున్న రాజశేఖర్ రెడ్డినే చంపించగలిగిన వారికి తమ అధికారానికే సవాల్‌గా మారిన జగన్‌కు హాని చేయడం కష్టం ఎందుకవుతుంది? విజయలక్ష్మిగానీ, మరొకరుగానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధ ఆరోపణలు చేసుకుంటూపోతే ప్రజల మనస్సులు కూడా కలుషితం అవుతాయి. అదే జరిగితే, భవిష్యత్‌లో తాము నిజాలు చెప్పినా జనం నమ్మని పరిస్థితి వస్తుంది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే ఎంతగా పతనం అవ్వాలో అంతగా పతనం అయ్యాయి.

ఇకపై మరింతగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లే ప్రమాదం పొంచి ఉంది. సి.బి. ఐ. కాంగ్రెస్ చేతిలో పావుగా మారి జగన్‌ను వేధిస్తున్నదని తల్లీ కూతుళ్లు శ్రీమతి విజయలక్ష్మి, షర్మిల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇది కూడా నిజమేనని అనుకుందాం! అలాంటప్పుడు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సి.బి.ఐ. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనీ, దాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరనీ సర్టిఫికెట్ ఇవ్వడంపై వీరు ఏమి సమాధానం చెబుతారు? రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపక్షాల ఆరోపణలపై చాలా ఉదారంగా సి.బి.ఐ. విచారణకు ఆదేశించేవారు. అందులో భాగంగానే పరిటాల రవి హత్యపై కూడా సి.బి.ఐ.తో విచారణ జరిపించారు.

ఆనాటి విచారణలో జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని తేల్చారు. విజయలక్ష్మి ఆరోపణల ప్రకారమైతే, ఆనాడూ సి.బి.ఐ.ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రభావితం చేయించి జగన్‌కు క్లీన్ చిట్ పొందారని భావించవలసి ఉంటుంది. తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినంత కాలం మంచిదైన సి.బి.ఐ. ఇప్పుడు వారికి చేదుగా మారడం సహజం. కేంద్ర ప్రభుత్వం ఆడించినట్టుగా సి.బి.ఐ. ఆడుతుందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. బహుశా ఆ ఉద్దేశంతోనే కాబోలు, పలు సందర్భాలలో రాజశేఖర్ రెడ్డి సి.బి.ఐ. విచారణకు ఆదేశించి క్లీన్‌చిట్ పొందారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఒక తప్పు చేసింది.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మాయా వ్యాపార సామ్రాజ్యంపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఈ ఆరోపణలపై సి.బి.ఐ. విచారణకు ఆదేశించి ఉంటే తాము కోరుకున్న విధంగా నివేదిక ఇచ్చి ఉండేవారేమో? ఈ విషయం వారికి ఎందుకు తట్టలేదో? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెట్టడం వల్ల రాజకీయంగా ప్రయోజనం లభించవచ్చునేమోగానీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చట్టాల నుంచి తప్పించుకోలేరు.

ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తన కుమారుడు అక్రమ సంపాదనతో రాజసౌధాలు నిర్మించుకోవడంతో పాటు, వేల కోట్ల రూపాయల మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్న విషయం శ్రీమతి విజయలక్ష్మికి తెలియదా? తోటకూర దొంగలించిననాడే మందలించి ఉంటే అన్నట్టుగా ఆదిలోనే జగన్‌ను నివారించి ఉంటే ఇప్పుడు తన కొడుకు జైలు పాలయ్యాడని ఆవేదన చెందే పరిస్థితి ఆమెకు ఉండేది కాదుకదా! ఒక రాజకీయ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా కూడా ఉన్న శ్రీమతి విజయలక్ష్మి ఆ బాధ్యతను విస్మరించి కేవలం పుత్ర వ్యామోహానికే పరిమితం అవుతున్నారు.

జగన్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్న వారందరూ అంతకుముందు జరిగిన అరెస్ట్‌లపై నోరు మెదపకపోవడం శోచనీయం. వాన్‌పిక్ వ్యవహారంలో లబ్ధిపొందారో లేదో తెలియదుగానీ, బలహీనవర్గాలకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కూడా జైలు పాలయ్యారు. జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ జైలు జీవితం గడుపుతున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే ఎందరో ఉన్నారు. మరికొంత మంది తోడు కావొచ్చు. అక్కడిదాక ఎందుకు, వల్లమాలిన విధేయతతో జగన్‌కు సహకరిస్తూ వచ్చిన విజయ సాయిరెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు శ్రీమతి విజయలక్ష్మి ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న ఉండనే ఉంది.

కుమారుడిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నా, దీక్ష చేసిన శ్రీమతి విజయలక్ష్మి అండ్ కో ప్రస్తుత కేసులలో ఎంతోమంది అరెస్ట్ అయినా ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఎమార్ కేసుగానీ, ఓబుళాపురం మైనింగ్ కేసుగానీ, అక్రమాస్తుల కేసుగానీ ప్రధానంగా లాభపడింది ఎవరు? ఏ ఒత్తిళ్లు లేకుండానే అధికారులుగానీ, మరొకరుగానీ తప్పుడు పనులు చేశారా? వాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నప్పుడు జాలి పడనివాళ్లు జగన్ విషయంలోనే ఎందుకు జాలి పడాలి? ఐ.ఎ.ఎస్. అధికారులు శ్రీలక్ష్మి, బి.పి.ఆచార్యకు కూడా కుటుంబాలు ఉన్నాయి.

కాకపోతే వారు రాజకీయాల్లో లేరు కనుక వారి కుటుంబ సభ్యులు వీధి నాటకాలు ప్రదర్శించ లేదు. తెలిసో తెలియకో, కాసులకు కక్కుర్తిపడో, ఒత్తిళ్లకు తలొగ్గో తప్పు చేసిన ఎందరో శిక్ష అనుభవిస్తున్నప్పుడు... రాష్ట్ర సంపదను లూటీ చేసి గరిష్ఠంగా లాభపడిన గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి వారికి మరింత పెద్ద శిక్ష అవసరం లేదా? న్యాయమూర్తి పట్టాభి రామారావు ఉదంతంతో ఈ ఇరువురు 'న్యాయాన్ని' కూడా కొనుక్కోగలరని తేట తెల్లమైంది కనుక, ఇటువంటి వారి విషయంలో సమాజమే అప్రమత్తంగా ఉండాలి. తాత్కాలిక భావోద్వేగాలకు లోనైతే మన భవిష్యత్తుకు మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది. ధర్మోరక్షతి రక్షితః అన్నట్టు వ్యవస్థలను నీవు కాపాడితే వ్యవస్థలు నిన్ను కాపాడతాయి. ఇందుకు భిన్నంగా వ్యవస్థలను ధ్వంసం చేసేవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

అదే సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి గాలి, జగన్‌లను దోషులుగా రుజువు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న సి.బి.ఐ. అధికారులకు నైతిక బలం ఇవ్వడానికై వారికి అండగా నిలబడాలి. నిజాయితీపరులను గుర్తించి గౌరవించకపోతే ఇకపై అలాంటి వాళ్లు మిగలరు. రాష్ట్రంలో మూడేళ్ల క్రితం జరిగిన దానికి ప్రస్తుతం కాంగ్రె స్ పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. ఇకపై ప్రజలే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా బెయిల్ పొందడానికి కోట్ల రూపాయలు వెదజల్లగలిగే వారి పట్ల ఇటు పౌర సమాజం, అటు వ్యవస్థలు కఠినంగా వ్యవహరించకపోతే దేవుడు కూడా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడలేడు!
- ఆర్కే

Saturday, January 14, 2012

పందెం పోరులో రాజకీయ పుంజులు

 

కొక్కొరొ... కొ.. అంటే కొట్లాట
పందెం పోరులో రాజకీయ పుంజులు
ఓట్లు బెట్ కాస్తూ జనం ముందుకు
పొలిటి'కోళ్లు' 

ప్రత్యర్థులపై విచ్చు కత్తులు
తమలో తామే 'కూల్చే ఎత్తులు'
కాంగ్రెస్ బరిలో అనేక కోళ్లు
టీడీపీ, టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ఫైట్
ఎన్నికలు రాక ముందే బరిలోకి
కళ్లలో కసి... కదలికలో వ్యూహం... కత్తిగట్టిన కాలిదెబ్బ... అబ్బో! బరిలో దిగిన పందెం కోళ్ల పౌరుషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. సంక్రాంతి అంటేనే కొ... క్కొ...క్కొరోకో... కోళ్ల పందేలు! ఇది ఏడాదికో పండగ! కానీ... రాజకీయ పందెం కోళ్లకు నిత్యం సంక్రాంతే! చాన్స్ చిక్కిందంటే... కొట్టుకోవడమే! ఈకలు పీక్కోవడమే! ఈ పొలిటికల్ కోళ్లు ప్రత్యర్థి కోళ్లపై విరుచుకుపడుతుంటాయి. మైకులు పట్టుకు నమిలేస్తుంటాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పందెం కోళ్లు ఒకదానిపై ఒకటి మీదపడి రక్కేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ కోళ్లు కూడా కాలి వేళ్లకు కత్తులు కట్టుకుని ఎగురుతుంటాయి. ఇలా పార్టీల మధ్య జరిగే పందేలు ఒకవైపు... ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం కొట్టుకునే కోళ్లు మరో వైపు! మొదటిరకం పందేలు అందరికీ తెలిసినవే. రెండో రకం కోళ్ల పందేలు మాత్రం తెరవెనుక జరుగుతుంటాయి. ఈ కోళ్లు అదను చూసుకుని 'కత్తి గోరు' విసిరేందుకు వేచి చూస్తుంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా... అన్ని పార్టీల్లోనూ ఈ కుమ్ములాటల కోళ్లు ఉన్నాయి. ఇక చూసుకోండి వాటి రక్కిసలాట...

కాంగ్రెస్‌లో ఎన్నెన్ని కోళ్లో..
ఎక్కడైనా, ఏ బరిలోనైనా ఒక బరిలో, ఒకే సమయంలో రెండు కోళ్లే కొట్టుకుంటాయి. కానీ... కాంగ్రెస్ బరి తరీఖానే వేరు. ఒకేసారి ఆరేడు కోళ్లు బరిలోకి దిగి కీచులాడుకుంటాయి. ఒకే కోడి మీదికి నాలుగైదు కోళ్లు కాలు దువ్వుతాయి. అలాగని ఆ నాలుగైదు కోళ్లు కలిసి మెలిసి ఉంటాయా అంటే అదీ లేదు. ప్రధాన పోటీ మాత్రం... సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సల మధ్యే ఉంటుంది. బరిని విచ్చలవిడిగా ఏలుదామని వచ్చిన కిరణ్‌కు బొత్స పెను సవాల్‌గా మారారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దలను కదలడం, కిరణ్‌ను ఇరుకున పెట్టేలా గుడిసెపైకి ఎక్కి 'కొక్కొరొకో' అనడం బొత్సకు షరా మామూలే.
vestrana

అయితే... మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులతో బొత్సను డిఫెన్స్‌లో పడేయడంలో కిరణ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక 'కోడి' కొంత దారిన వచ్చిందని అనుకునేలోపే... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరింత పెద్ద కత్తులు కట్టుకుని దిగారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎంను 'అంశాల' వారీగా నిలదీసినట్లు కనిపించినప్పటికీ... పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిరూపించుకోవడమే రాజనర్సింహ అసలు లక్ష్యం.
అత్యంత ముఖ్యమైన తెలంగాణ అంశంపైనా పార్టీ వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రకటించడం, తరచూ ఢిల్లీకి వెళ్లి తన 'ప్రయత్నాలు' సాగించడం ద్వారా రాజనర్సింహ బరిలోని 'పెద్ద కోడి'కి చికాకు తెప్పిస్తున్నారు. బరిని ఏలేందుకు చేతిలో కర్చీఫ్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక చిరంజీవి, నాదెండ్ల మనోహర్ కూడా బరిలో ఉన్నప్పటికీ... కిరణ్‌తో హోరాహోరీగా మాత్రం పోరాడటంలేదు. 'టైమ్ వస్తే దూకుదాం' అని వేచి చూసే రకం! మంత్రి శంకర్రావు వంటి 'చిలిపి కోళ్లు' ఉండనే ఉన్నాయి. అయితే... కాంగ్రెస్ బరిలో ఎప్పుడు, ఏయే కోళ్లు కీచులాడుకుంటాయనేది ఎప్పుడూ ఆసక్తికరమే!
'దేశం' పుంజుల కోలాహలం
తెలుగుదేశం బరిలో రకరకాల కోళ్లు కొట్టుకుంటున్నాయి. టీడీపీ తెలంగాణ ఫోరం బరిలో ఒకవైపు ఎర్రబెల్లి దయాకర రావు, మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు! పైకి గాయాలు కనిపించకుండా కొట్టుకోవడమే వీరి 'ఫైట్' ప్రత్యేకత. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌గా తనకే గుర్తింపు రావాలన్నది ఎర్రబెల్లి ఆరాటం. కేసీఆర్‌పై గొంతు చించుకుని, మేడెక్కి అరిచేది తాను కాబట్టి, తనకే 'పెద్ద కోడి'గా పట్టం కట్టాలనేది మోత్కుపల్లి పోరాటం! అయితే... ఈ రెండు కోళ్లకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మోత్కుపల్లిలా గట్టిగా అరవలేకపోవడం ఎర్రబెల్లి బలహీనత. ఎర్రబెల్లి స్థాయిలో సమన్వయ నైపుణ్యం లేకపోవడం మోత్కుపల్లి వీక్‌నెస్.

తెలుగుదేశం 'ఫ్యామిలీ' బరిలోనూ కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. 'పెద్దకోడి' చంద్రబాబుకు తెలుగుదేశం బరిని మరో పదేళ్లపాటు ఏలగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ... 'నెక్ట్స్ ఎవరు?' అనే అంశంపై తేల్చుకునేందుకే పోరు సాగుతోంది. అయితే... ఈ పోరు ఇతర ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంతా అంతర్గతమే. ఈ పోరు బరిలో ఉన్నది ఎవరో కాదు! అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణలే! భవిష్యత్ రాజకీయాలపై వీరిమధ్య అపార్థాలునెలకొన్నాయి. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం బరిని సిద్ధం చేయాలని హరికృష్ణ ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.

ఇందుకు బాలకృష్ణ అడ్డొస్తాడన్నది ఆయన భయం. బాలయ్య తన అల్లుడైన నారా లోకేశ్‌నే ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే, ఇటీవల బాలయ్య 'కూత' ఈమధ్య జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ మధ్య హరికృష్ణ, బాలకృష్ణ పరస్పరం మాట్లాడుకోవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు చూడటమే మానేశారు.

టీఆర్ఎస్‌లో మామా అల్లుళ్ల సవాల్
టీఆర్ఎస్‌లోనూ తెలుగుదేశం తరహా కోళ్ల పందెమే జరుగుతోంది. అటు తెలంగాణ బరిలో, ఇటు టీఆర్ఎస్ పార్టీ బరిలో ఇప్పుడు కేసీఆర్ మాటకు ఎదురే లేదు. ఆయనే నెంబర్ వన్! 'నెంబర్ 2' కోడి ఎవరో తేల్చుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్య పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో హరీశ్‌వర్గం, కేటీఆర్ వర్గం అనే విభజన వచ్చింది.
http://images.blogs.hindustantimes.com/dabs-and-jabs/post/KCR.jpg
కేటీఆర్‌తో పోల్చితే... పార్టీని నడపడం, వ్యూహ రచనలు, సమన్వయ సాధనలో హరీశ్‌రావుకే ఎక్కువ మార్కులు పడతాయి. కానీ... పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అవకాశం ఎక్కువ సందర్భాల్లో కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్‌కే దక్కుతోంది. దీనిపై హరీశ్‌లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోకున్నప్పటికీ... గ్రూపులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య పార్టీలోని 'చిన్న కోళ్లు' నలిగిపోతుండటం మాత్రం నిజం.

'దేశం'పై జగన్ గురి

ఇదో చిత్రమైన బరి! ఈ పార్టీలో పెద్ద కోడి జగన్. అయితే... రాష్ట్ర రాజకీయ పోరు మాత్రం జగన్ పార్టీ చుట్టూనే తిరుగుతోంది. 2014లోపు జగన్‌ను బలహీనం చేస్తే తనకు ఎదురేలేదని చంద్రబాబు... బాబును దెబ్బతీస్తే అధికారం తనదేనని జగన్ భావిస్తున్నారు. అత్యంత చిత్రంగా... ఈ పోరులో అధికార కాంగ్రెస్ బరి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇరుప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడిందని జగన్, చంద్రబాబు భావిస్తుండటమే దీనికి కారణం. టీడీపీలోని ప్రధాన పందెం కోళ్లన్నీ జగన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాయి.

డేగ కళ్లు, వాడి కాళ్లు వేసుకుని... చిన్న అవకాశం దొరికినా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. జగన్ కూడా అంతే! తాను కేసుల్లో ఇరుక్కోవడంతో చంద్రబాబుపైనా తన తల్లితో కేసులు వేయించారు. విషయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లారు. తనపైనా, తన తండ్రిపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా, దాని మూలాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి... అధికార పార్టీ అస్త్ర సన్యాసం చేయగా, రెండు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

బహు బరులు... బడా కోళ్లు
కిరణ్ - జగన్, కిరణ్ - చంద్రబాబు, చంద్రబాబు - కేసీఆర్... ఇలా బడా కోళ్ల మధ్య భారీ పోరాటమే జరుగుతోంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో... ఇక తనకు తలుపులు మూసేసినట్లేనని జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేశారు. ఆ క్షణం నుంచి కిరణ్‌ను బలహీనం చేయడంపై దృష్టి సారించారు. పథకాలు మూలనపడ్డాయని ప్రతి సభలో తిట్టిపోయడం ఇందులో భాగమే. అవిశ్వాసం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావించినప్పటికీ... ఈ విషయంలో కిరణ్‌దే పైచేయి అయ్యింది. సామాజిక వర్గం, ప్రాంతం, ఎమ్మెల్యేల మధ్య తమ పట్టు నిలుపుకొనేందుకు కిరణ్, జగన్ మధ్య పోరు జరుగుతూనే ఉంది.

ఇక, తెలంగాణలో చంద్రబాబును బలహీన పరచాలని కేసీఆర్... టీఆర్ఎస్‌ను ఎంతోకొంత నిలువరించాలని చంద్రబాబు పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. టీడీపీని దెబ్బతీస్తే తెలంగాణలో 80 శాతం సీట్లు స్వీప్ చేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. ఆ చాన్స్ ఇవ్వకుండా... తెలంగాణలో కొన్ని, సీమాంధ్రలో భారీగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే... టీఆర్ఎస్, టీడీపీ కోళ్ల మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. 'నువ్వొకటంటే నేను నాలుగంటా' అన్నట్లుగా పోటా పోటీ ప్రెస్ మీట్లు, విమర్శలు! రాజకీయ బరిలో ఇదో రసవత్తర పోరు!

ఈ కోళ్లూ ఉన్నాయ్...

రాజకీయ కోళ్ల పందెంలో సీపీఎం, సీపీఐ బాగా వెనుకబడ్డాయి. 2004-09 మధ్య కాళ్లకు కత్తులు కట్టుకుని వీరోచితంగా పోరు సాగించిన సీపీఎం ఈ మధ్య కాలంలో అస్త్ర సన్యాసం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌లతో వెళ్లలేక... జగన్‌తో జట్టుకట్టే విషయంపై తేల్చుకోలేక... అత్యంత అయోమయంలో పడింది. సీపీఎంతో పోల్చితే సీపీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 'పుంజు కోడి' నారాయణ నోరే ఈ పార్టీకి కొండంత బలం. వారూ వీరని కాకుండా, ఎవ్వరిపైనైనా ఇంతేసి నోరు వేసుకుని పడటం, ఏదో ఒకస్థాయి పోరాటాలతో ఆయన పార్టీ ఉనికిని కాపాడటంలో విజయవంతం అయ్యారు. టీడీపీతో దోస్తీ సాగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక... బీజేపీ పరిస్థితి కూడా అయోమయంలోనే ఉంది. 'తెలంగాణ' నినాదాన్ని టీఆర్ఎస్ తర్వాత అత్యంత స్పష్టంగా భుజానికెత్తుకున్న ఈ పార్టీ సీమాంధ్రలో అడుగుపెట్టలేక పోతోంది. అలాగని... తెలంగాణలో దూసుకుపోతోందా.. అంటే అదీ లేదు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా టీఆర్ఎస్ నీడ నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే యాత్రల ద్వారా సొంత వ్యూహం రచిస్తోంది.

కొసమెరుపు: పార్టీల పందెం కోళ్లు ఎంతగా కొట్టుకుంటున్నా... ఎవరి బలం ఎంతో తేలేందుకు 2014 దాకా ఆగాల్సిందే. కానీ, బరి సిద్ధకాకముందే, పోటీని వీక్షించే ప్రజలు గుమికూడక ముందే కోళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మరో రెండేళ్లకు ఎవరి కత్తులు మొద్దు బారిపోతాయో, ఎవరివి వాడిగా ఉంటాయో వేచి చూడాలి మరి! 
http://www.thehindu.com/multimedia/dynamic/00503/16_P1_CARTOON_503599e.jpg

Sunday, April 24, 2011

కడపలో పంచతంత్రం

ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.

ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.

అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jagans 


       సానుకూలత
  • వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
  • గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
  • కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
  • అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
  • నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.

    ప్రతికూలత
  • గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
  • తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
  • ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
  • గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.

    డీఎల్‌ రవీంద్రరెడ్డి
  • సానుకూలతravin.(Maidukuru)
  • వివాదరహిత ముద్ర.
  • గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
  • ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
  • ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
  • అందుబాటులో ఉంటారన్న సానుకూలత.

    ప్రతికూలత

  • ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
  • సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
  • ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
  • బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
  • పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.

    మైసూరారెడ్డి
    mysooraeddyసానుకూలత
  • కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
  • వివాద రహిత ముద్ర.
  • హంగు, ఆర్భాటాలకు దూరం.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.

    ప్రతికూలత
  • కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
  • రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
  • సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
  • జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
  • పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.

    వైఎస్‌ విజయలక్ష్మి

    vijyasmaసానుకూలత
  • వైఎస్‌ భార్యగా సానుభూతి.
  • ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
  • భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
  • ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
  • వివాదరహిత మనస్తత్వం.

    ప్రతికూలత

  • ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
  • రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
  • స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
  • ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.

    వైఎస్‌ వివేకానందరెడ్డి
    YS-Vivekanadareddyసానుకూలత

  • అందరికీ అందుబాటులో ఉండే నైజం.
  • మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
  • సమస్యలపై పూర్తి అవగాహన.
  • ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
  • అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.

    ప్రతికూలత

  • వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
  • వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
  • ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
  • కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
  • ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.

    బీటెక్‌ రవి
    prsonసానుకూలత
  • రాజకీయాలకు కొత్త.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • యువకుడు కావడం.
  • నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
  • ధనబలం ఉండటం.

    ప్రతికూలత
  • సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
  • బలమైన వర్గం లేకపోవడం.
  • పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం.
  • కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

Saturday, January 1, 2011

2011 నే ‘తల’ రాతలు * సవాళ్ల మధ్య సబలలు

రాజైనా.. .పేదైనా.. .పండితుడైనా ...పామరుడైనా...కార్మికుడైనా ...కర్షకుడైనా ...ఏరంగం వారికైనా గడిచిన సంవత్సరం...రాబోయే సంవత్సరం సాధించిన మంచి చెడులను విశ్లేషించుకునేది ఈ రోజే...అనుకున్నవి జరగక రాబోయేది మంచి కాలమని ఆశావహులు భావిస్తే.... తమకెంతో మేలు జరిగిన ఈ సంవత్సరాన్ని ఎన్నటికీ మరువలేని తీపిగుర్తుగా తమ హృదయడైరీలలో భద్రంగా రాసుకునే వారు మరికొందరు...రాజకీయరంగంలో మహిళలు తక్కువమందే ఉన్నా మన రాష్ట్రానికి సంబంధించి మహిళా ప్రజాప్రతినిధులలో కొందరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండగా మరికొందరు రాష్ట్ర రాజకీయాలలో మంత్రులుగా కీలక బాధ్యతలను నెరవేరుస్తున్నారు. వారి వారి రాశులు, నక్షత్రాలు ఆధారంగా రాబోయే కొత్త సంవత్సరంలో వారి జాతకఫలాలు ఎలా ఉన్నాయో విశ్లేషిస్తూ...మంత్రులుగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ మహిళా మంత్రులకు ధీర కొత్త ఏడాది శుభాకాంక్షలు...అందిస్తోంది...

కలిసి సాగాలి
సబితా ఇంద్రారెడ్డి, జననం: 5 మే 1963
కన్యారాశి, హస్త నక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు
PSabita
వ్యక్తిత్వంలో కన్పించని అపార సహనం, అంకితం, విశ్వాసం ఉంటాయి. ద్వంద్వ వ్యక్తిత్వం. మనస్సులోని భావాలను బయడపడనీయరు. అలా బయటపెడితే, తాము తక్కువ అంచనాకు గురవుతామేమోనని భయపడుతుంటారు. అది మరో రూపంలో లేదా కొంత కాలం తరువాతనైనా బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వారిని అర్థం చేసుకునేందుకు మరెంతో సహనం అవసరం. వీరు ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చి పని చేయడం ఆరంభిస్తారు. నిర్ణయ శక్తి బలహీనం. తమ అభిప్రాయాలను సమర్థించు కుంటూ ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఒత్తిళ్ళలో కన్నా క్లిష్టపరి స్థితుల్లో వీరికి మరెవరికీ లేనంత పోటీతత్వం, తిరుగుబాటు లక్షణాలు కలిగి వుంటారు. అలాంటప్పుడు దృఢసంకల్పం, దీర్ఘకాలిక పోరాట శక్తి కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు ఆలోచనళ్లో సరళత్వాన్ని పెంచుకుంటూ, ముందు గానే అభిప్రాయాలకు కట్టుబడకుండా ఉండాలి.

ఎదుటి వారు చెప్పేది తాను వినడం, తాను చెప్పేది ఎదుటి వారు వినడం అనే తరహాలో కాకుండా ఇంటరా క్టివ్‌ స్వభావాన్ని పెంచుకోవాలి. తద్వారా జాతకులు పబ్లిక్‌ స్పీకర్స్‌ కాగలరు. అంతర్గతంగా ఉండే వివిధ భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. 2011 ఊహించుకున్నంత భయంకరంగా ఏమీ ఉండదు. ఆమె పాత్ర చాలా కీలకం అవుతుందన్న ఆందోళన చెందనక్కర్లేదు. అందువల్ల కాస్తంత ధైర్యంగా ఉండ డం అలవాటు చేసుకుంటే మంచిది.
వైఫల్యాలో వైరాగ్యం
గల్లా అరుణ, జననం: 20సెప్టెంబర్‌ 1943
వృషభ రాశి, రోహిణి నక్షత్రం
g-aruna
ఇతరుల నుంచి తనకు ఏమీ కావాలో ఆమెకు తెలుసు. అందుకు అనుగుణంగానే పని చేస్తుంటారు. వనరులను గుర్తించడం, వాటిని అందరికీ ఉపయోగపడేలా చూడడంలో (స్వామికార్యం, స్వకార్యం) ఎంతో పరిపక్వత ఉంటుంది. పైకి కన్పించకపోయినా, ఆచరణలో మాత్రం తనను నమ్ముకున్న వారికి సహాయం చేసితీరుతారు. ఆ సహాయం పొందిన వారికి అది ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆమె రాజకీయ నేతగా గాకుండా మానవత్వంతో ఆలోచిస్తారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అభిప్రాయాలను మార్పు చేసుకుంటూ వుంటారు. ఇతరులు వంచించేందుకు ప్రయత్నించేప్పుడు ఆ విషయాన్ని గుర్తిస్తూ, వాటినుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తారు. ఇది పోరాట, సాహస లేమికి నిదర్శనమైనప్పటికీ, ఆమెలో ఉండే తెలివితేటలకు ప్రతీక కూడ. భావోద్వేగపరంగా అస్థిరతతో వ్యవహరిస్తారు. చుట్టుపక్కల పరిస్థితులకు తేలిగ్గా లొంగిపోతారు.

తరచూ కోపం, అసహనం ఆమె తీసుకున్న నిర్ణయాల్లో కన్పిస్తుంది. బయటకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, భావోద్వేగాల తీవ్రత అధికం. క్లిష్టపరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఆ సమయంలో జ్యోతిష్యులను లేదా గురువులను ఆశ్రయిస్తారు. వైఫల్యాలు ఎదురైతే, మనం ఏం చేసినా అంతా దైవాధీనం అనే ఆధ్యాత్మిక ధోరణితో ఉంటారు. సేవా భావం అధికం. 2011లో ఈ తరహా భారీ కార్యక్రమాన్ని చేపడితే పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు రాజకీయ భవిష్యత్తుకూ తోడ్పడుతుంది.
అపార్థాలకు తావెక్కువ
డి.కె.అరుణ, జననం:4 మే 1960
కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, బుధుడు ఆధిపత్యం
DK-Aruna
జీవితంలో భావస్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, సౌకర్యాలను కోరుకుంటారు. తన పనిలో మరొకరి జోక్యం, ప్రమేయం, ఒత్తిళ్లు లాంటి వాటిని ‚సహించలేరు. నిర్ణయాలకు కారణాలను ఎదుటివారికి సుదీర్ఘంగా చెప్పేందుకు ఇష్టపడరు. ఓ పనిపై ఆమె అభిప్రాయాల్లో అది ఆమెకు ఇష్టమో, కాదో బయటపడుతుంది. ఓ పని చేయడం ఆమెకు ఇష్టం లేని సమయంలో, ఆ పని చేస్తే బాగుంటుందంటూ మరెవరైనా సుదీర్ఘంగా వివరణలు ఇస్తుంటే, వాటికి ప్రతిగా ఆమె రకరకాల కారణాలు వివరిస్తారు. దీంతో తాను ఇతరులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణి అందులో కన్పిస్తుంది. ఈ కారణంగా ఆమెను అభిమానించే వారి సంఖ్య కన్నా, ఇష్టపడని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆమె జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. అలంకరణలో కన్పించే ఆడంబరం ఆమె జీవనశైలిలో కన్పించదు. తనకు తెలియకుండానే తనలో ఉండే, కొత్తొక వింత, పాత ఒక రోత అనే లక్షణం ఆమె స్నేహి తులు ఆమెను అపార్థం చేసుకునేలా ఉంటుంది.

భావోద్వేగాల పరంగా ఆమె త్వరగా స్పందిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఇతరుల సమస్యలకు పరిష్కారం చెప్పడం లేదా ఆ సమస్యలో తలదూర్చడం చేస్తే స్వీయనియంత్రణ కోల్పోతారు. ఆ ప్రక్రియలో ఎదుటి వారిని శాసిస్తారు. సలహా ఇచ్చి, పాటించడంలో స్వేచ్ఛ అవతలివారికే ఇవ్వాలి. అలాంటప్పుడే అనుచరుల మద్దతు పెంచుకోగలుగుతారు.
ఆత్మన్యూనత ఎక్కువ
సునీతా లకా్ష్మరెడ్డి, జననం: 5 ఏప్రిల్‌ 1968
మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి రాహువు.
sunitha
ఆశయాలు అధికం. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే తపన ఎక్కువ. అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేస్తుంటారు. కఠోర పరిశ్రమ, తెలివితేటలతో మాత్రమే ఆ స్థాయిని చేరుకోవాలని అనుకుంటారు. అలా గాకుండా ఎదుటివారి దయాదాక్షిణ్యాలతో ఆ స్థాయిని చేరుకోవాలని మాత్రం ఆకాంక్షించరు. అలాంటి పరిస్థితి వస్తే అంతర్ముఖం. పోటీతత్వం అధికం. ఒక పని కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అత్యధిక స్థాయిలో అన్వేషిస్తారు. అనుకున్నది సాధించడంలో ఆమెకు ఉన్న తాపత్రయం, అందుకు చేసే ప్రయత్నాలు అవతలి వారి దృష్టిని ఆకర్షిస్తాయి. స్వీయ గుర్తింపు అనేది క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఇది బుద్ధిబలంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. కనిపించని పక్షపాతం ఉంటుంది. వైఫలాల్యను అంగీకరించరు. ఆ పని చేయడాన్నే వదిలేస్తారు. ఆత్మన్యూనత, భయం ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో మిగతా వారి నుంచి భావోద్వేగ మద్దతు లేకుండా సమన్వయం చేసుకోలేరు.

తనను తాను మోటివేట్‌ చేసుకోవాల్సి వస్తే పరిస్థితులకు అనుగుణంగా అని గాకుండా తన అవసరాలను బట్టి చేసుకుంటారు. మొదట్లో కన్పించిన వ్యక్తిత్వం కాలానుగుణంగా సన్నగిల్లుతుంది. కారణం, తనకు పనికొచ్చేలా వనరులను వెదుక్కోవడం, ఆధిపత్యాన్ని కోరు కోవడం. ఎదుటివారి కోణంలో ఆలోచించి పరిష్కరించగల నైపుణ్యం ఉన్నప్పటికీ, వారు తన మాట వినకుంటే మాత్రం అసహనం. పరిస్థితులు, మనుష్యూలు...లాంటివాటిని ఏకపక్షంగా పరిశీలించడంతో వయస్సుకు మించిన అనుభవాన్ని పొందినట్లు అవుతుంది. ఆ అనుభవం ఉన్నప్పటికీ, వ్యవస్థను మేనేజ్‌ చేయలేక, అంత ర్ముఖం అవుతూ ఆధ్యాత్మిక ధోరణిలో పడిపోతారు. 2011లో వీరి మాటకు, ఆలోచనలకు, సామాజిక, రాజకీయ బాధ్యతలకు మంచి గుర్తింపు వస్తుంది. ఆమె అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది.
ఆచరణలో ఆవేశం పూజ్యం
పనబాక లక్ష్మీ, జననం: 6 అక్టోబర్‌ 1958
మిథున రాశి
Panabaka-Lakshmi
బాధ్యతలు స్వీకరించడంలోనూ అపార నిజాయితి. ఒక అంశాన్ని భిన్న కోణాల్లో పరిశీలించడం, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆ పనిపై మానసిక శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించడం ప్రధాన బలాలు. చక్కటి సలహాదారు. ఎదుటి వారు శత్రువా, మిత్రువా అని చూడకుండా సందర్భానికి తగ్గ సలహాలు ఇవ్వగలరు. వారు ఆ సలహాను ఆచరించకపోయినా పట్టించుకోరు. మూడీగా ఉండడం, చొరవ తక్కువ, తీసుకునే నిర్ణయాల్లో ఇతరుల అభిప్రాయాల సేకరణ బలహీనతలుగా చెప్పవచ్చు. ఒక పనిని పూర్తి చేయడంపై మాటల్లో, భావోద్వేగాల్లో ఉన్న ఆవేశం ఆచరణలో అంతగా కన్పించకపోవచ్చు. ఇతరుల సహాయం లభించక పోవడం అందుకు కారణాలుగా చెబుతారు. హైపర్‌ సెన్సిటివ్‌. నలుగురిలో కలివిడి తక్కువే. అందరిలో తేలిగ్గా కలసిపోలేరు. దీనివల్ల ఎదుటివారిని మేనేజ్‌ చేస్తున్నట్లుగా ఉంటారే తప్ప వారితో కలసిపోయినట్లుగా ఉండరు. ఒక వ్యవస్థలో ఉంటూ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తారు. ఆత్మవిశ్వాసం తక్కువ. భావోద్వేగపరంగా డిస్టర్బ్‌ అవుతామేమోనన్న భయం, ఇతరులు మోసగిస్తారే మోనన్న ఆందోళన ఉంటాయి.

ఇలాంటివి ఇప్పటికే జరిగిఉంటే, ఇతరులను చుల కన చేసే అవకాశం ఉంది. ఇది ఆశయసాధనలో ఆమెను ఓ పెద్ద సముద్రంలోకి తీసుకెళ్ళకుండా ఓ చిన్న బావికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఊహించిన అవకాశాలు వచ్చినప్పుడు, ఆ హోదాలో చేరకముందే, అందుకు తగ్గ బలాలను ఇతరుల నుంచి ఆశిస్తుంటారు. అందుకు గాను ఎప్పుడూ ఇతరులను వదులుకోలేరు. తమను తాము నమ్ముకోలేరు. దీనివల్ల వీరిలో పాలనానైపుణ్యాలు తగ్గిపోతాయి. క్లిష్టపరిస్థితుల్లో చొరవ తీసుకునే లక్షణాలు తగ్గుతాయి. ఇతరులకు మద్దతుగా నిలవడం తప్ప మరేమీ చేయలేదు. సొంత వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే రాజకీయాల్లో రాణించగలరు. 2011 వీరికి శ్రమ అధికం. అధిష్ఠానం నుంచి అవకాశాలు వస్తాయి. గతంలో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా కలసివస్తుంది.
ప్రతికూలతలో లౌక్యం
పురంధేశ్వరి, జననం : 22 ఏప్రిల్‌, 1959
కన్యారాశి
D_Purandareswari
చిత్త నక్షత్రం. నక్షత్రాధిపతి కుజుడు. చేసే పనిపట్ల మక్కువ కలిగిఉంటారు. స్వాప్నికురాలు. కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. చేసేపనిలో ముందుచూపు ఉంటుంది. దీంతో ప్రతి విషయాన్ని ముందుగానే ఊహించి దాన్ని నమ్ము తారు తప్ప కళ్ళముందు కన్పించే దాన్ని విశ్వసించరు. జ్యోతిష్కూలకు, మానసిక నిపుణు లకు ఉండే లక్షణం ఇది. ఏం జరుగబోతుందో అన్న విషయమై ముందుగానే సమాచారం సేకరించగలుగుతారు. ఊహించ గలుగుతారు. ఏదైనా విషయంలో మొదట్లో ఆమెను విశ్వసించని వారు సైతం ఆమె చెప్పేవి నిజాలు కావడంతో ఆమెను అనుసరిస్తారు. అనుకున్న దాన్ని సాధించుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ క్రమంలో వీరు తాము అనుకున్నది సాధించుకోవడంలో, అది ఎవరి వల్ల అవుతుందో కచ్చితంగా గుర్తించగలరు. తన ఆలోచనలకు అనుగుణంగా ఎవరిని ఉపయోగించుకోవచ్చో గుర్తిస్తారు. సహాయం చేసిన వారి పట్ల విధేయత, అంకితభావం ప్రదర్శిస్తారు. ఓ పని తలపెట్టినప్పు డు అవతలి వారితో వేగంగా భావోద్వేగాలు పంచుకోవడం, వారి దృష్టికోణంతో ఆలోచించడం చేస్తూ, వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక కొంత అయోమయానికి గురికావడం చోటు చేసు కుంటుంది. వ్యక్తులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఆమె సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తే తప్ప బయట పడరు. అంతర్ముఖం. మనస్సులో మాట అంత తేలిగ్గా బయటపెట్టరు. ఒక విషయాన్ని రకరకాలుగా ఆలోచించి ఎటూ తేల్చుకోలేనటు వంటి సందిగ్ధంలో పడిపోతారు. కార ణం జాప్యాన్ని, వాయిదాను తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి దృష్టిని మళ్ళించుకుంటారు. సహనాన్ని బాగా పరీక్షిస్తే, తన అభిప్రాయాలను, భావాలను మార్చుకునేందుకు వెనుదీయరు. అలాంటప్పుడు గతాన్ని, అవతలి వారితో తనకు గల స్నేహసంబం ధాలను పట్టించుకోరు. 2011లో పార్టీలో ఇతర మహిళా నాయకులకు ఆమె ఆదర్శం కాగలుగుతారు. ఆమె కీలకపాత్ర వహిస్తారు. రాజకీయ పరిపక్వతను చాటుకుంటారు. బాధ్యతల పరంగా ఒత్తిళ్ళు పెరిగే అవకాశం ఉంది.
ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌