Sunday, June 24, 2012

ఊపే ఆ చేతుల వెనక...



వాళ్లు ఎందుకు చేతులు ఊపుతున్నారు? ఒలింపిక్స్‌లో గెలిచి దేశానికి మంచి పేరు తెచ్చారనా? ఎవరెస్టును అధిరోహించి గర్వకారణంగా నిలిచారనా? అంతరిక్షంలో మన జెండాను నాటారనా..? ఏమి ఘనకార్యం చేశారని చేతులు ఊపుతున్నారు? చేతులు ఊపుకుంటూ అత్తగారింటికి వెళ్లినట్లు జైలుకు వెళుతున్న దృశ్యాలు ఈ మధ్యనే చాలానే కనిపిస్తున్నాయి. ఇదేదో ఆషామాషీగా వ్యవహారం కాదు. నిందితులు కప్పుకున్న ఈ ముసుగు వెనుక లోతుల్ని కనుక్కునేందుకు సైకాలజిస్టుల్ని సంప్రదిస్తే.. 
వాళ్లు చేసిన విశ్లేషణే ఈ  స్టోరీ..

ఒక జేబుదొంగ పది రూపాయలు కొట్టేసి పోలీసులకు దొరికిపోతే.. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అరచేతుల మధ్యన దాచుకుంటాడు.
రెండొందలో, మూడొందలో లంచం తీసుకున్న క్లర్కు ఏసీబీకి చిక్కితే.. తలదించుకుని కోర్టులోకి అడుగుపెడతాడు.
ఒక సెక్సువర్కరు పడుపు వృత్తి చేస్తూ దొరికితే.. కొంగుతో ముఖం కప్పుకుని ఒక మూల నిలబడుతుంది.

చిన్న తప్పులు చేసినందుకే వీళ్లంతా అపరాధభావంతో కనిపిస్తారు. కాని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నిందితులు అలా కనిపించడం లేదు. ఎన్నడూ లేనివిధంగా జైలుకు-కోర్టుకు తిరుగుతున్నప్పుడు.. చేతులు ఊపుతూనో, చిరునవ్వులు చిందిస్తూనో, నమస్కారాలు పెడుతూనో కనిపిస్తున్నారు. ఈ విచిత్రాలు ఈ మధ్య కాలంలోనే మొదలయ్యాయి.

ఇంతకు మునుపు పోలీసులు ఇంటికొస్తేనో, కేసుల్లో ఇరుక్కుని కోర్టు గుమ్మం తొక్కితేనో పరువంతా పోయిందనుకునే వాళ్లు. వైట్‌కాలర్ నేరాల్లో ఈ పరిస్థితి కనిపించదు. ఎందుకంటే, వైట్ కాలర్ నేరమంటేనే.. ప్రజలకు అర్థంకాని బ్రహ్మపదార్థం. ఒక వ్యక్తిని హత్య చేశాడనో, దాడి చేసి గాయపరిచాడనో తెలిస్తే అతన్ని ఖూనీకోరుగా చూస్తారు. అవినీతి నేరాలు సంఘంలోని వ్యక్తులకు నేరుగా ఇబ్బంది కలిగించవు. ప్రత్యేకించి ఒక వ్యక్తి అంటూ బాధితుడుగా ఉండడు. ప్రభుత్వలొసుగులు, చట్టాలను వాడుకుని.. అవినీతికి పాల్పడటం ఇందులోని ముఖ్య లక్షణం. పాలనలో పాలుపంచుకునే నేతలు, కార్పొరేట్ అధిపతులు, లాబీయింగ్ చేసేవాళ్లు.. ఇలాంటి అవినీతిని చేస్తుంటారు.

"వీరు తప్పు చేసినప్పుడు ప్రజల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత రాదు. ఎందుకంటే, వారికున్న పలుకుబడి, పరపతి అలాంటిది. అందువల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కూడా గిల్టీగా ఫీలవరు. ప్రస్తుతం అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతికి పాల్పడటమన్నది నేతలకు చిన్న విషయమైపోయింది. కోర్టుల్లో శిక్ష పడుతుందన్న నమ్మకం లేదు. విచారణకు చాలా సమయం పడుతుంది..'' అంటున్నారు నిపుణులు. ఇవన్నీ అవినీతి, అక్రమార్జన నేరాలకు పాల్పడిన వారికి బాగా కలిసొస్తున్నాయి. ఒక ఆరోపణ రుజువు కావడం, జైలు శిక్ష పడటం సంగతి అలా ఉంచితే.. ఈ తరహా నిందితుల మనస్తత్వం సాధారణ నేరస్తుల కంటే భిన్నమైనదని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. కొందరు అరెస్టు అవుతారన్న సంగతి ముందే తెలియడంతో మానసికంగా సన్నద్ధం కావడం కూడా ధీమాగా వెళ్లడానికి కారణం కావచ్చు.

జగన్ కేసుతో మొదలు..

జైలుకు, కోర్టుకు చేతులు ఊపుకుంటూ వెళ్లే ట్రెండు ఆడిటర్ విజయసాయిరెడ్డితోనే మొదలైంది. అది జగన్ అరెస్టుతో ఊపందుకుంది. రాష్ట్రం యావత్తూ ఆసక్తిగా తిలకించిన సంఘటన.. జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించడం. టీవీ చానళ్లు మళ్లీ మళ్లీ చూపించడంతో.. ఆ దృశ్యం ఇప్పటికీ అందరి కళ్లల్లో మెదులుతోంది. వ్యాను దిగిన వెంటనే ఆయన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుగా మీడియా ప్రతినిధులు కెమెరాలు పట్టుకుని నిల్చున్నారు. అలాంటి సమయంలో.. పోలీసులు నిందితుల భుజం మీద చేయి వేసి జైలుకు తీసుకెళ్లటం సహజంగా జరుగుతుంటుంది. అలా తీసుకెళితే..! పరువు పోదా? వ్యాన్‌లో కూర్చున్నప్పుడే జగన్‌కు ఆలోచన వచ్చి ఉండవచ్చు. ప్రజలందరూ చూస్తుండగా అలా లోపలికి వెళ్లడం జగన్ మనస్తత్వానికి ఇష్టముండదని మానసికవేత్తలు విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం- వ్యాన్ దిగిన తర్వాత తను జైలు ద్వారం వరకు ఎలా నడవాలో ఆయన ముందుగానే నిశ్చయించుకుని ఉంటారు. 'నువ్వు ఉండవయ్యా'', "నువ్వు కూడా ఉండు..'' అన్న భావం వచ్చేలా ఆయన రెండువైపులా ఉన్న పోలీసులను అటొక చేత్తో, ఇటొక చేత్తో సైగ చేసి దూరం పెట్టారు.

ఆ తర్వాత కుడిచేత్తో కాలర్‌ను సర్దుకుని.. రెండు చేతులు జోడించారు. నిజానికి ఆయన ఎదురుగా ప్రజలెవ్వరూ లేరు. ఉన్నది టీవీ ఛానళ్ల రిపోర్టర్లు, కెమెరామెన్లు మాత్రమే. అయినా చిరునవ్వును పులుముకుని.. పదే పదే రెండు చేతులు జోడించి నమస్కారాలు పెట్టడం టీవీల్లో చూసేవాళ్లకు చిత్రంగా అనిపించింది. ఒకనాటి ముఖ్యమంతి పుత్రున్ని జైల్లో పెడుతున్నారన్న ఆసక్తితో టీవీలు చూస్తున్న జనాన్ని ఆ దృశ్యం ఆశ్చర్యపరిచింది. "జైలు దగ్గర జగన్ అన్నిసార్లు ఎందుకు నమస్కారాలు పెట్టాడు?'' అని చాలామంది ప్రజలు అనుకున్నారు. పోలీసు వ్యాను దగ్గరి నుంచి జైలు గేటు వరకు ఉన్న ఇరవై అడుగుల దూరంలోనే ఆయన కనీసం పది నుంచి పదిహేనుసార్లు దండాలు పెట్టాడు.

వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జైలుకు వెళుతున్న జగన్.. "నేనేమీ తప్పు చేయలేదు. నా మీద రాజకీయకక్ష తీర్చుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఇదంతా చేస్తున్నది అని జనానికి తెలియజేసేందుకు తల ఎత్తుకుని ధైర్యంగా లోపలికి వెళ్లారు'' అంటున్నారు సైకాలజిస్టులు. "అలాంటి సమయంలోనే వ్యక్తి నిగ్రహం, సహనం తెలుస్తుంది. జగన్ వ్యూహాత్మకంగా నమస్కారాల్ని ఎంచుకున్నాడు. కొన్నాళ్లకు ఎన్నికలు కూడా రానున్నాయి. ప్రజలు తన పట్ల సానుభూతి చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఆ పద్ధతిని ఎంచుకున్నాడు. టీవీ విలేకర్లకు నమస్కరించలేదు. టీవీలు చూసే ప్రజలకి నమస్కారాలు చేశారు. అందుకే, ఆ దృశ్యానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది'' అని పేర్కొన్నారు విశ్లేషకులు. ఒక పార్టీ నాయకునిగా.. "నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దేన్నయినా ఎదుర్కొనే ధీమాతోనే ఉన్నాను. ఏదో ఒక రోజు మళ్లీ బయటికి వస్తాను'' అన్న అంతరార్థం ధ్వనించేలా జగన్ తన హావభావాల్ని ప్రదర్శించినట్లు వారు చెబుతున్నారు.
తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అవసరమైతే ప్రజల నుంచి సానుభూతి పొందడానికి, విచారణ అధికారుల్ని తప్పుదోవ పట్టించడానికి.. సాధారణంగా నిందితులు కొన్ని వ్యూహాల్ని ఎంచుకుంటారు. వాటినే క్రిమినల్ సైకాలజీలో 'సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం' అంటారు.

రివర్స్‌గేర్..

సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ప్రధానంగా మూడు లక్షణాల్ని ప్రదర్శిస్తారు నిందితులు. అందులో ఒకటి 'ప్రొజెక్షన్'. తను చేసింది తప్పు అని తెలిసినా, పూర్తి రివర్స్‌గేర్‌లో ప్రవర్తిస్తారు. అందుకు అనుగుణంగా శరీరభాషను, ముఖకవళికల్ని మారుస్తారు. మంచి వ్యక్తిగా నటించడం. "అన్ని పార్టీలు, నాయకులు నన్ను ఒంటరివాడ్ని చేసి దాడి చేస్తున్నారు'' అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అవినీతి నేరాలకు పాల్పడిన రాజకీయనేతలు సింపతీ అస్త్రాన్ని వాడుకున్నంతగా దేన్నీ వాడుకోరు. రెండోది-'రేషనలైజేషన్'.

ఒక పిల్లవాడిలో ఇలాంటి లక్షణం ఉందనుకోండి. అతను పరీక్షలో ఫెయిలైనప్పుడు 'ఏంట్రా బాగా చదువుకోలేదా' అని తల్లి అడిగితే.. తను చదవలేదన్న నిజాన్ని అంత ఈజీగా ఒప్పుకోడు. 'నేనైతే పరీక్ష బాగా రాశానమ్మా. పేపరు దిద్దిన వాడే నన్ను ఫెయిల్ చేశాడు. నా తప్పు ఏమీలేదు..'' అని ఎదుటివాళ్ల మీదికి తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తాడు. డిఫెన్స్ మెకానిజంలో 'ఎస్కేపిజం' కిందికి వస్తుంది ఈ తరహా ప్రవర్తన. వైట్‌కాలర్ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు రాజకీయ నేతలైతే.. ఇదే అస్త్రాన్ని బయటికి తీస్తారు. "నువ్వు చేసింది తప్పు'' అని అవతలి పార్టీ విమర్శిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. "మంత్రులే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మా నేతకు ఏమీ సంబంధం లేదు'' అని ఎదురుదాడికి దిగడం చూస్తున్నాం.

వైట్‌కాలర్ నేరాల్లో ఇరుక్కున్న నిందితులు.. విచారణలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే, వీరికి చట్టాల్ని ఎలా వాడుకోవాలి? వాటి నుం చి రక్షణ ఎలా పొందా లి? దొడ్డి దారులు ఎక్కడుంటాయి? బాగా తెలుసు. అందుకే, దర్యా ప్తులో కూడా అంత సులువుగా సహకరించరు. ఈ మధ్య జగన్ తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు కూడా విన్నవించింది. నార్కోటిక్ పరీక్షలకు కూడా అనుమతించాలని పేర్కొంది. ఇక, డిఫెన్స్‌మెకానిజంలో మూడో లక్షణం-'రియాక్షన్ ఫార్మేషన్'. తప్పు చేసినప్పటికీ.. "నేను దేనికీ భయపడను..'' అని ఎదుటివాళ్లను నమ్మించే ప్రయత్నం చేయడం. వైట్‌కాలర్ నేరస్తులు నేరం రుజువయ్యే వరకు.. తనను తాను నిత్యం ప్రోత్సహించుకోవడం దీని కిందికే వస్తుంది.

పాపభీతి శూన్యం..

చాలామంది అవినీతి నేరస్తుల్లో పాపభీతి ఏ కోశాన ఉండదు. తాము తప్పు చేశామన్న పశ్చాత్తాపభావం కాని, తప్పును సరిదిద్దుకోవాలన్న ప్రయత్నం కాని చేయరు అంటున్నారు క్రిమినల్ సైకాలజీ అధ్యయనం చేసిన డాక్టర్ నీలిమ. వీరికి డబ్బుపట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది.ఈ మితిమీరిన వ్యామోహం వెనుక మానసిక దౌర్బల్యం ఉంటుంది. పుట్టి పెరిగిన కుటుంబం, పెరిగిన వాతావరణం, జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యం.. ఇవన్నీ ఒక మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడతాయి. ఈ మధ్య అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న కొందరు నిందితుల మనస్తత్వాలను విశ్లేషించిన సైకాలజిస్టులు.. ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్థాంతం ప్రకారం ఇలా చెప్పారు- "ఒక మనిషిలో ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే మూడు లక్షణాలు ఉంటాయి. మొదటి దాంట్లో భౌతిక లక్షణాలు, రెండో దానిలో మానసిక లక్షణాలు, మూడోదానిలో నైతికత ఉంటాయి.

ఇందులో మళ్లీ కాన్షన్స్, ఇగో ఐడియల్స్ ఉన్నాయని చెప్పారు ఫ్రాయిడ్. వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేందుకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్‌ను సృష్టిస్తాయి ఇగో ఐడియల్స్. ఇవి బలహీనంగా ఉంటే ఇంపల్సివ్‌గా తయారవుతారు. వ్యామోహ కోలాహలంలో కొట్టుకుపోతారు. ఇలాంటి వ్యక్తుల్లో పాపభీతి అన్నదే ఉండదు. "నాకు డబ్బు కావాలి. దాన్ని ఏ దారిలో సంపాదించినా తప్పు లేదు. ఎవరేమనుకున్నా పట్టింపు లేదు. వ్యవస్థలు ధ్వంసమైనా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా పరవాలేదు. నా లక్ష్యం నాది. నా పంతం నాది. అది నెరవేరాలంతే!'' అనుకునే మనస్తత్వం రాజకీయపరమైన నేరస్తుల్లో పుష్కలంగా ఉంటుంది. వీరు జైలుకు వెళ్లినా, చట్టాలు శిక్షలు వేసినా భయపడరు. పశ్చాత్తాప భావంతో వ్యక్తిత్వాన్ని మార్చుకునే ప్రయత్నమే చేయరంటారు నిపుణులు. అవినీతిపరులు ఎన్ని అడ్డంకులున్నా నేరం చేయడానికి వెనుకాడరు. దీన్ని రుజువు చేయడానికి నేరస్తుల మనస్తత్వం మీద పరిశోధనలు చేసిన హెచ్.జె.ఐజంక్ ఒక ప్రయోగం చేశాడు.

అందుకు ఆయన కొన్ని కుక్కల్ని తీసుకున్నాడు. ఒక చోట చిన్న జాలీ పెట్టి.. దానికి కరెంటు పెట్టాడు. జాలీ అవతల కొన్ని మాంసపు ముక్కల్ని ఉంచాడు. మాంసాన్ని చూస్తూనే కుక్కలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లాయి. దగ్గరకు వెళ్లగానే కరెంటు షాక్ తగిలింది. 'అమ్మో ఇదేదో ప్రాణం మీదికి వచ్చేట్టుంది' అని కొన్ని కుక్కలు వెనక్కి తిరిగాయి. మరికొన్ని కుక్కలు తటపటాయిస్తూ ఆగిపోయాయి. మూడో గ్రూపు షాక్‌ను భరిస్తూనే.. జాలీని దాటుకుని వెళ్లి.. మాంసాన్ని బొక్కేశాయి. మన దగ్గర ఎన్ని కఠినమైన చట్టాలు, బలమైన విచారణ వ్యవస్థలు, పత్రికలు, ప్రజాసంఘాలు ఉన్నా.. అవినీతి నేరస్తుల్లో భయం కనిపించదు అని చెప్పడానికి ఐజంక్ ఈ ప్రయోగాన్ని ఉదహరిస్తారు.. అని ప్రముఖ సైకాలజిస్టు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంత తీవ్రమైన కాంక్ష కేవలం డబ్బు సంపాదించాలన్న కోరిక నుండే పుడుతుంది.. అందుకు ఉపకరించే స్వభావాన్ని 'సైకోపతిక్ ఆటిట్యూడ్' అంటారు.

సైకోపతిక్ ఆటిట్యూడ్..

బాల్యం నుంచి నేరగ్రస్త కుటుంబంలో పెరగడం, భూస్వామ్య మనస్తత్వం అలవడటం, నాకెవరూ ఎదురు చెప్పకూడదనుకునే మనస్తత్వం, చట్టాన్ని గౌరవించకుండా అనైతిక పద్ధతుల్ని ఎంచుకోవడం, తను అనుకున్నది తప్పయినా, ఒప్పయినా మూర్ఖంగా చేయడం.. సైకోపతిక్ ఆటిట్యూడ్ ముఖ్య లక్షణాలు. వైట్‌కాలర్ నేరస్తుల్లోనే కాదు, ఫ్యాక్షన్ నేతల్లో కూడా ఈ లక్షణాలు ఎక్కువ. జైలుకు వెళ్లడమన్నా, శిక్షలు అనుభవించడమన్నా వీరికి గిట్టనే గిట్టదు. తప్పును ఆత్మపరిశీలన చేసుకుని.. మారడమంటే పరమ చికాకు. ప్రభుత్వ నిబంధనలే కాదు, ఏ నిబంధనలూ వారికి అడ్డం రాకూడదు అనుకుంటారు.. అన్నది సైకాలజిస్టుల అభిప్రాయం. పరిమితుల్లేని స్వేచ్ఛను కోరుకుంటారు.

విపరీతమైన స్వార్థం ఉంటుంది.ప్రజాస్వామ్యం జాంతానై. అంతా సొంత స్వామ్యంతోనే నడపాలని చూస్తారు. వీరికి కుటుంబ సంబంధాలూ అంతంతమాత్రమేనని ఈ నేరస్తుల్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరితోనూ ఎక్కువ కాలం స్నేహాన్ని కూడా కొనసాగించలేరు. అక్కరపడ్డప్పుడు దగ్గరవ్వడం, పనికిరారనుకుంటే పక్కన పెట్టడం వీరికి వెన్నతోపెట్టిన విద్య. అక్రమమార్గంలో పని చేయించుకోవడానికి అస్త్రాలన్నీ ప్రయోగిస్తారు. బుజ్జగిస్తారు. ఎరవేస్తారు. అవేవీ ఫలించకుంటే.. దండం ఎలాగూ ఉంది అంటున్నారు నిపుణులు. మొత్తానికి తాము అనుకున్న పని పూర్తి చేయడం ఈ నేరస్తుల లక్షణం. వీరి పాపానికి ఆఫీసర్లు జైలు పాలైనా 'అయ్యో పాపం' అనడం కూడా ఉండదు. తమ మేధో సామర్థ్యాన్ని, జ్ఞానసంపదను, సాంకేతిక వ్యవస్థను అంతా సొంతానికి వాడుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే - ఈ లక్షణాలున్న వారి ముందు "నేను'' తప్ప మిగిలినవన్నీ బలాదూర్.. అంటున్నారు మానసిక నిపుణులు.

సైకోపతిక్ ఆటిట్యూడ్ రాను రాను 'యాంటీ- సోషల్ పర్సనాలిటీ డిజార్డర్'గా మారిపోతుంది. దీని లక్షణాలు చాలా తీవ్రమైనవి. "నా అంతటివాడు మరొకడు ఉండకూడదు. నేనే అందరికంటే ఎక్కువ. నేను చెప్పిందే శాసనం..'' అనేలా ప్రవర్తిస్తారు. మానసిక దౌర్బల్యంలో ఇదొక జాడ్యం. దీన్ని 'నార్‌సిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్స్' అంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు. రోబోల్లాగే అనిపిస్తారు. ఎక్కడా గిల్టీగా కనిపించకుండా జాగ్రత్త పడతారు. "నేను అవినీతి చేయలేదు. కావాలనే ఇరికించారు. నా మీద ఎవరో కక్షగట్టారు...'' అని బయటికి చెప్పడమే కాదు, మనసులోనూ బలంగా విశ్వసిస్తారంటున్నారు నిపుణులు. ఇందుకు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే సహించే స్వభావం వీరికి ఉండదు. సీబీఐలాంటి ఉన్నత దర్యాప్తు సంస్థలు కూడా ఈ తరహా నిందితులతో తలనొప్పులు పడాల్సి వస్తున్నది.

తలదించుకునే వాళ్లు..

అవినీతి నేరాల్లో జైలుకు వెళుతున్న నేతలు గిల్టీగా ఫీలవ్వడం లేదు కాని.. అధికార్లు, కార్పొరేట్ సంస్థల అధిపతులు మాత్రం తలవంచుకునే వెళుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి అధికారుల్లో "ఇలా చేసి ఉండాల్సింది కాదు..'' అన్న భావం వ్యక్తమవుతున్నట్లు వాళ్ల ముఖకవళికల్ని బట్టి చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు.ఉన్నతస్థాయి అధికారులు ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సివిల్‌సర్వీసులాంటి ఉన్నత ఉద్యోగాల్ని చేపట్టేందుకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలి. చదువు, క్రమశిక్షణ వాళ్లకు తెలియకుండానే ఒక మంచి వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఉద్యోగం ఒత్తిళ్లతోనో, డబ్బు ఆశతోనో తప్పు చేసి దొరికిపోతే.. అలాంటి వాళ్లలో అపరాధభావం చుట్టుముడుతుంది.. అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. స్వయంకృతాపరాధమే అయినా సత్యం కుంభకోణంలో అరెస్టయిన రామలింగరాజులో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉన్నతహోదాలో జీవించిన ఆయన అనూహ్యంగా అరెస్టయ్యారు.

ఒక తప్పు చేయడం వల్ల తన కీర్తిప్రతిష్టలు ఎలా మంటగలిసిపోయాయో తెలిసినందువల్లే కోర్టుకు వస్తున్నప్పుడు, జైలుకు వెళుతున్నప్పుడు. ఈ మధ్య బెయిలుపై బయటికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడా చేతులు ఊపడంగాని, నవ్వడం గాని చేయలేదు. ఆయన చేసింది ఆర్థిక నేరమైనా.. రాజకీయనేతల స్వభావానికి భిన్నంగా ఉండిపోయారు. జగన్ కేసులో అరెస్టయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి మాత్రం రామలింగరాజుకంటే భిన్నంగా ప్రవర్తించారు. "ఆయన ఆడిటర్ అనడం కంటే.. ఒక నేతకు ప్రధాన అనుచరుడు అనడం మంచిది. తన మేధోసంపత్తిని ఎందు కోసం వాడుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే, జైలుకు వస్తూపోతున్నప్పుడు ఒక రాజకీయనేత స్వభావాన్నే ప్రదర్శించారు..'' అన్నారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అధికారంలో ఉన్న నేతల ఒత్తిళ్లు, డబ్బు మీదున్న ఆశవల్ల మాత్రమే తప్పు చేసిన వాళ్లు.. తిరిగి మారేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు బాల్యం నుంచి అనైతికత స్వభావంతో పెరగలేదు.

పాలనాధికారం చేతిలోకి వచ్చాకే.. ఏ అధికారైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అదే రాజకీయ నేతలైతే... అనేక వక్రమార్గాల్లో నడిచి ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్' అనేది అధికారుల్లో కంటే నేతల్లోనే ఎక్కువని చెప్పారు మనస్తత్వశాస్త్ర నిపుణులు. ప్రముఖ ఆధ్యాత్మికవాది నిత్యానందస్వామిలో కూడా సైకోపతిక్ లక్షణాలున్నట్లు మానసిక నిపుణుల అభిప్రాయం. తాను అశ్లీల కార్యకలాపాలకు పాల్పడిన సంగతి ప్రజలకు తెలిసాక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అరెస్టయినప్పుడల్లా.. తెచ్చిపెట్టుకున్న ధీమాతో కనిపించే ప్రయత్నం చేశాడాయన. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి రాజా, కనిమొళి, గాలి జనార్దన్ రెడ్డిలాంటి వాళ్లు కూడా ప్రజలకు అభివాదం చేస్తూనో, చిరునవ్వులు చిందిస్తూనో టీవీల్లో కనిపించారు. అలా కనిపించినంత మాత్రాన ఏది నీతో, ఏది అవినీతో ప్రజలకు తెలియకుండా ఉండదు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు.

రెడ్ కాలర్ క్రైమ్

అధికారాన్ని, పలుకుబడిని, మేధోసామర్థ్యాన్ని వాడుకుని.. చట్టం కళ్లు గప్పి అక్రమంగా సంపాదిస్తే వైట్‌కాలర్ క్రైమ్ అవుతుంది. ఈ పదాన్ని మొదటిసారి 1939లో ఎడ్విన్ సదర్‌లాండ్ తొలిసారిగా అమెరికన్ సోషియలాజికల్ సొసైటీ సమావేశంలో ప్రకటించారు. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ తరహా నేరస్తులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని వైట్‌కాలర్ క్రైమే కుదిపేస్తున్నది. వైట్ కాలర్ క్రిమినల్స్ డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు. మానవ విలువలు, ప్రజాసంక్షేమం అనేవి పైకి కప్పుకున్న ముసుగులు మాత్రమే. నిజస్వరూపం మరోలా ఉంటుంది. తమ వైట్ కాలర్ నేరాలు బయటపడితే, అవి తన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయనుకుంటే.. హింసకు సైతం తెగిస్తారు ఈ నేరస్తులు. అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ చేసిన హింసనే 'రెడ్ కాలర్ క్రైమ్' అంటున్నారు. ఈ ధోరణి ఈ మధ్యనే మన దేశంలో వ్యాపిస్తోంది. వైట్ కాలర్ నేరస్తులు హింసకు పాల్పడే పరిస్థితులు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది.
- డా. నీలిమ ఓలేటి,
క్రిమినల్ జస్టిస్‌లో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తి, హైదరాబాద్

1 comment:

Suresh Babu Boddu said...

idhe prasna valla abhimanulni adigithe asalu thanu thappe cheyaledhu adhi prove ainappudu kadha dhoshi anali ippudu thanu just nindhithudu ani vadisthunnaru .... thanu ye thappu cheyakapothe jail ki endhuku velthadu idhi endhuku janalaki artham kavatledhu entha sepaina inka prove kaledhu kadha kaledhu kadha antunnaru