Monday, October 25, 2010

మంత్రులపై 'రోష'య్య ! * స్వీయ నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా?

సిఫార్సు చేయకుండా నాపై తోసేయడం సబబేనా?
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయరా?
పలువురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం

 కొంతమంది మంత్రులు తమ తమ శాఖలనే పట్టించుకోవడం లేదు. మరికొందరు విధాన నిర్ణయాల విషయంలో చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరిస్తుంటే.. మరికొందరు స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా భారం మొత్తం సీఎంపైనే వేసేస్తున్నారు.

కానీ, సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా తనపైనే బాధ్యతలను నెట్టేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

శాఖాపరంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రులు సమష్టిగా స్పందించడం లేదని మంత్రివర్గ సమావేశాల్లో తరచూ ఆయన ఆగ్రహిస్తున్నారు కూడా. అధిష్ఠానం అంటే తనకు తెలియదని, తనకు తెలిసిన అధిష్ఠానం వైఎస్సేనని ప్రకటించి తూర్పు గోదావరి జిల్లాలో కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తితో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయినా.. తాను బంధుత్వానికే విలువ ఇస్తానంటూ ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆయన వ్యవహారంపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, ఎరువుల సరఫరా విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో మంత్రి రఘువీరారెడ్డి స్పందించిన తీరు పట్ల సీఎం సంతృప్తి చెందలేదు.

ఈ విషయమై మంత్రి బొత్సతోపాటు పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో రఘువీరాతో వాగ్వాదానికి దిగినా ఏమీ మాట్లాడకుండా సీఎం మౌనం దాల్చడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు, మహిళా స్వయం సహాయక బృందాలకు పరపతి లభించడంపై కడప ఎంపీ జగన్‌కు చెందిన దినపత్రికలో కథనాలు రావడం పట్ల సంబంధిత మంత్రి వట్టి వసంతకుమార్‌పై కూడా మంత్రివర్గ సమావేశంలో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం ఉంది.

'సాయంత్రం నువ్వు జగన్‌ను కలుస్తావు. మర్నాడు ఆయన పత్రికలో కథనాలు వస్తాయి' అని వ్యాఖ్యానించారని సమాచారం. అలాగే, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో 42 శాతం వాటా అమలయ్యేలా కృషి చేస్తామంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి గీతారెడ్డిని సీఎం ప్రశ్నించారని తెలిసింది.

డీఎస్సీ-08 నియామకాల విషయంలో శాఖాపరంగా సిఫార్సు చేయకుండా సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించిన మాణిక్యవరప్రసాద్‌పైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటాపై ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

గత మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. దానిపై దృష్టిసారించాలని గీతారెడ్డికి సూచించారు. ఇచ్చిన బాధ్యతలను వెంటనే పూర్తి చేయాలని మంత్రుల ఉప సంఘానికి హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, తనను కలిసిన గీతారెడ్డితో సీఎం రోశయ్య ఆ అంశాన్ని ప్రస్తావించారు.

'తెలంగాణ న్యాయవాదుల సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆచరణకు నోచుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వచ్చేస్తోంది. ఆ సమయానికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం బాగుంటుంది? దీనిపై వారు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారు?' అని కాస్త ఆగ్రహంతో ప్రశ్నించారు.

సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నా వీలు చిక్కడం లేదని, రెండు రోజుల్లో దానిపై ఓ సిఫార్సు చేస్తామని గీతారెడ్డి జవాబిచ్చారు. 'తెలంగాణ న్యాయవాదులతో సమావేశం జరిపిన రోజే సమయం లేదని చెబితే.. ఆ బాధ్యతను మరొకరికి అప్పగించేవాళ్లం కదా' అని సీఎం ప్రశ్నించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, తనను కలవడానికి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చిన సందర్భంలో.. "ఏమిటీ మీరొక్కరే వచ్చారు? డీఎస్సీ-08 ఫైలు ఏదీ!? అధికారులు రాలేదా?'' అని రోశయ్య నిలదీశారు. న్యాయపరమైన అంశాలు మిళితమై ఉన్న ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ తనపై వదిలేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో "ఇది చాలా కీలకమైన అంశమైనందున ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను' అని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, అధికారులతో కలిసి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలో సూచించాలని రోశయ్య చెప్పారు. దీంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, వివిధ సందర్భాల్లో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతారా!? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది.

చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో!

లక్కీ సీఎం
cm-laguh
కాడి కట్టలేదు... మేడి పట్టలేదు... రిజర్వాయర్ల నిండుగా నీళ్ళు, భాం డాగారాల-నిండా ధాన్యరాశులు ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కావాలి? అం దుకే అయన్ను అందరూ లక్కీ సీఎం అంటున్నారు. గతంలో రాష్ట్రానికి ముఖ్య మంత్రులుగా పనిచేసినా వారంతా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమత మైనవారే. రాష్ట్ర ప్రజలు కూడా అటు కరువులో ఇటు వరదలతోనోగుడ్లు తేలేసే వారు. ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధ్దం. మంత్రి వర్గాల్లో పనిచేసిన అనుభవతం తప్ప మరేమీ లేని రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి అయాచితంగా కలిసివచ్చినట్టుగానే వాతావరణ పరిస్థితులు కూడా అం తకు మించి అనుకూలిస్తున్నాయి. చిన్నా చితకా సమస్యలు ఇక ముఖ్య మం త్రులు ఎవరన్న దానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే అంటున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న రాష్ట్రంలో ఈసారి సకాలంలో సాధారణ స్థాయికి మించి 30శాతం అధికంగానే వర్షాలు కురుస్తూ వచ్చాయి. జూన్‌ ప్రారంభం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి సాధారణ వర్షపాతం 617.7 మిల్లీమీటర్లు కాగా, 803.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా అన్ని జిల్లాల్లో అదను పదునుకు తగ్గట్టు కువరటంతో ఏరువాక మంచి జోరు మీద సాగింది. కరువు అన్న పదం ఈసారి రాస్ట్రంలో ఏ జిల్లాలోనూ విని పించకుండా పోయింది. ఖరీఫ్‌ పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి మించి రికార్డు స్థాయిలో అయింది.

73.83 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన పం టలు సాధారణస్థాయికి మించి 83.27లక్షల హెక్టార్లలో సాగు కావటం రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డుగా వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. వరి నాట్ల ప్రారంభ దశలో యూరియా కొరత ఎదురైనా, ప్రభుత్వ ప్రమేయం అంతగా లేకుండానే సమస్య సర్దుకుంది. మరో వారం పది రోజుల్లో ఖరీఫ్‌ పంట కోత లు ప్రారంభం కానున్నాయి. పంట దిగుబడి కూడా రికార్డు స్థాయిలోనే ఉండ బోతోందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

28 లక్షల హెక్టార్లలో సాగ యిన వరి సాగు ద్వారానే 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం లోనే అంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా తన స్థాయిని పదిలం చేసుకోనుందంటు న్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తులపై ప్రభుత్వ కృషిని ప్రశంశించటం గమనార్హం. ధాన్యం నిల్వలు దాచేందుకు గిడ్డంగుల సమస్య కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించగలిగేంతగా ఉందంటే ముఖ్యమంత్రి రోశ య్య హయాంలో రాష్ట్ర వ్యవసాయరంగం అభివృద్ధిని చెప్పకనే చెబు తోందంటున్నారు.

ధీమాగా రబీ సాగు: రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ వరదనీటితో తొణ ికిసలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీటి అవసరం తీరిపోవటంతో ఇక రబీ పంటల సాగుకు ఢోకా ఉండదని జలాశయాల్లో నిలువ ఉన్న నీరు భరోసా ఇస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల, శ్రీరాంసాగర్‌ తదితర ప్రధాన జలాశయాల్లోకి ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో వరద ప్రవాహం వస్తూనే ఉంది.ఎన్నడూ నిండని శ్రీరాంసాగర్‌ సైతం గేట్లెత్తుకుని ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులు, కుంటల్లో జలకళ తగ్గలేదు. భూగర్భ జలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.

చీకూ చింతా లేని పాలన:చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో! రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా విపక్షాలు ముప్పుతిప్పలు పెట్టేదాకా వదిలేవి కావు. అయితే అనుకోని పరిస్థితుల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి విపక్షాలే పరోక్షంగా బాసటగా నిలుస్తూ రావ టం ఒకరకంగా రోశయ్యను ఆధికార స్థానంలో బలపడేలా చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సొంత పార్టీ నుంచే వారికి అస మ్మతి సెగల బుగబుగలు తప్పేవి కావంటున్నారు.

ఈ అంశంలో రాజకీయంగా వైఎస్‌ రాజశేఖరెడ్డికి కూడా మినహాయింపు లేకపోయింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్యకు అటువంటి ఇబ్బందులేవీ లేవంటున్నారు. కడప ఎంపీ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై కోరికే తప్ప రోశయ్య మీద వ్యక్తి గత ద్వేషమేదీ లేదంటున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా రోశయ్య విషయంలో ఉన్నంత సాప్ట్‌కార్నర్‌ ఇదివరకటి వారిపై ఉండేది కాదంటున్నారు. తాత్విక ధోరణి కనబరిచే రోశయ్య అంతటి అదృష్టపు సీఎం ఇంతవరకూ ఎవరూ లేరనే కాంగ్రెస్‌ సీనియర్లు సైతం నొక్కి చెబుతున్నారు.

Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య


Tuesday, October 19, 2010

నిండుగా నిర్లక్ష్యం * ‘గోడౌన్ల సమస్య’ సాకుతో పర్మిట్లు ఇచ్చే యోచన

అసలు రోగం ఒకటైతే... చికిత్స మరొకటి
గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలతోనే అసలు సమస్య... అడిగేవారు లేక గోదాముల్లో ఉన్న మనకు పనికిరాని నిల్వలను పట్టించుకోని కేంద్ర మంత్రిత్వ శాఖలు
అవకాశాన్ని వాడుకుని సన్నబియ్యం పర్మిట్లకై మిల్లర్ల ఎత్తుగడలు
ఇప్పటికే పూర్తిగా నిండిన గోదాములు... మార్కెట్లోకి రానున్న ఖరీఫ్ ధాన్యం
గోదాముల పరిస్థితి చూసి పట్టు బిగిస్తున్న మిల్లర్లు...
వారికి తలొగ్గి పర్మిట్ల జారీకి సిద్ధమవుతున్న సర్కారు...
పర్మిట్లు ఇస్తే గోదాములు ఎలా ఖాళీ అవుతాయన్నది జవాబులేని ప్రశ్న


ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతు పక్షపాతి, దివంగత నేత వైఎస్ హయాంలో అమలు చేసిన విధానానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు రైతులకు సరైన ధర, మరోవైపు వినియోగదారుల ప్రయోజనాల రక్షణనూ ఆలోచించిన వైఎస్ ప్రభుత్వం అప్పట్లో సన్నబియ్యం ఎగుమతులపై పలు ఆంక్షలు అమలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల బెదిరింపులకు భయపడి ఆ ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. ఎలాగైనా బియ్యం ఎగుమతికి పర్మిట్లు పొంది భారీగా గడించాలనే వ్యూహంతో, ముమ్మరంగా యార్డులకు ధాన్యం రాబోతున్న కీలక తరుణంలో కొనుగోళ్లు ఆపేస్తామంటూ మిల్లర్లు హెచ్చరికలకు దిగారు. కొన్ని రాజకీయపక్షాలు కూడా వారికి వంత పాడాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. మొన్నటికిమొన్న నెల్లూరు సన్నాల విషయంలో రోజుకోరకం జీవోలు విడుదల చేసి రైతును నిండా ముంచేసిన తీరు ఇంకా మరవకముందే ఆంక్షల ఎత్తివేతకు సిద్ధమవుతోంది. అదేమిటంటే గోదాముల సమస్యను సాకుగా చూపుతోంది. పర్మిట్లు ఇచ్చినా గోదాములు ఖాళీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే మూలుగుతున్న గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోకుండా పర్మిట్లు ఇచ్చినంతమాత్రాన సమస్య ఎలా పరిష్కారమవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

ఎక్కడెక్కడి నిల్వలూ రాష్ట్రంలోనే!

రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, వివిధ విభాగాలకు చెందిన గోడౌన్ల నిల్వ సామర్థ్యం 36 లక్షల టన్నుల వరకు ఉంది. ఇందులో ఇప్పటికే 33 లక్షల టన్నుల ధాన్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో రాష్ర్టంలో ఉపయోగించని, ఇక్కడ పండని గోధుమలు 2-3 టన్నులు కాగా, ఉప్పుడు బియ్యం ఏకంగా 21 లక్షల టన్నులు మూలుగుతున్నాయి. ఇవి మన అవసరాలకు ఉపయోగపడవు. అలాగని వీటిని తరలించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. వివిధ ఆపదల సమయాల్లో ఇతర దేశాలకు చేసే సహాయం కింద ఆహారధాన్యాల నిల్వలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తరలించిందే తప్ప... మన రాష్ట్రంలో నిల్వ చేసిన ఉప్పుడు బియ్యాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ర్ట ప్రభుత్వం గట్టిగా కోరితే ఉప్పుడు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ విషయంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో గోదాములనిండా ఉప్పుడు బియ్యమే మూలుగుతోంది.

ఈసారి ఖరీఫ్, రబీలో అధిక దిగుబడులు వస్తాయని తెలిసినా ఈ నిల్వల తరలింపుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఫలితంగా ఈ బియ్యం ఇక్కడ నిల్వ ఉన్నంత కాలం గోదాముల సమస్య ఇలాగే కొనసాగనుంది. ఆహార ధాన్యాల నిల్వల తరలింపునకు సరిపడా రైల్వే ర్యాకులను తీసుకురావడంలోనూ కొంత వైఫల్యం కనిపిస్తోంది. సరిపడా ర్యాకులను తెప్పించగలిగామని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నా, అంతగా ర్యాకులు వచ్చి ఉంటే ఇప్పటికే సగం నిల్వలు ఖాళీ అయ్యేవని ఎఫ్‌సీఐ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నించగల నేత లేకపోవడంతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచాయి. మన ఉన్నతాధికారులు సైతం సీఎంతో కొన్ని లేఖలు కేంద్రానికి పంపించి, అదే సరిపోతుందనుకుని మిన్నకుండిపోయారు. ఫలితంగా ర్యాకులు రాక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి.

ఇదే అదునుగా మిల్లర్లు..!
గోదాముల్లో ఖాళీ లేకపోవడాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని పర్మిట్లు సాధించేందుకు మిల్లర్లు ఎత్తుగడ వేశారు. గోదాముల్లో ఖాళీ లేదనే సాకు చూపి కొనుగోళ్ల సమ్మె ప్రకటించారు. ముందుగా ధాన్యం వచ్చే తెలంగాణ మిల్లర్లు ఈ ప్రకటన జారీ చేయగా... అనుకూల నిర్ణయం వస్తే తమకూ మంచిదనే భావనతో ఆంధ్రా మిల్లర్లు కూడా ఇదే డిమాండ్‌ను వినిపించడం మొదలుపెట్టారు. నిజానికి ఒక మిల్లర్ 100 లారీలు లెవీ పెడితే, తనకు ఎగుమతి పర్మిట్లు వచ్చేది కేవలం 25 లారీలకే! అందులోనూ మూడో వంతు మాత్రమే పచ్చిబియ్యం ఉండాలని, మిగతాది ఉప్పుడు బియ్యమైతే అభ్యంతరం లేదని గతంలో పూనం మాలకొండయ్య కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆంక్షలు విధించారు. తద్వారా విలువైన సన్నరకాల బియ్యం రాష్ట్రం నుంచి తరలిపోకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రస్తుతం సన్న బియ్యం ధరలు చాలా అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే కిలోకు 21 చొప్పున తాము ఎంత బియ్యమైనా మార్కెట్‌లో అమ్ముతామని చెబుతూ మిల్లర్లు ఒకరిద్దరు రాజకీయ నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. నిజానికి ఉప్పుడు బియ్యం ఎగుమతికి మిల్లర్లకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చినా అది ఎవరికీ నష్టం కలిగించదు. రైళ్లు, ఓడల ద్వారా ఎగుమతికి అవకాశం కల్పించినా మంచిదే. కానీ ఈ ముసుగులో సన్నరకాల బియ్యానికి రోడ్డు మార్గంలో (లారీల్లో...) పర్మిట్లు పొందాలనేది మిల్లర్ల ఎత్తుగడ. గతంలో ఇలా పర్మిట్లు పొంది భారీగా కాండ్లా రేవుకు తరలించి, అక్కడ్నుంచి విదేశాలకు అమ్మారని ప్రభుత్వమే ఒక దశలో నిర్ధారించుకుని భారీగా మిల్లులపై దాడులు చేసి కేసులు పెట్టింది. ఇప్పుడవన్నీ విస్మరించి, మిల్లర్ల హామీలను విశ్వసించి ఆంక్షల సడలింపునకు పూనుకోవడమే విచిత్రం!

నెల్లూరు సన్నాల పేరుతోనూ దోపిడీ!
నల్లమచ్చ పేరిట గత ఏడాది మిల్లర్లు నెల్లూరు సన్నాల ధాన్యాన్ని కొనడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం కూడా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్‌సీఐ ద్వారా కొనిపించాలనే రైతుల డిమాండ్‌ను పక్కనబెట్టి, మచ్చ శాతాన్ని బట్టి ధాన్యం ధరలో కోత పెట్టి మిల్లర్లే కొనుగోలు చేసుకోవచ్చునని జీవో ఇచ్చింది. ఈ వాల్యూకట్ విధానంలో మిల్లర్లు అడ్డగోలు ధరలకు కొన్నాక, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించటానికి అనుకూలంగా మరో జీవో ఇచ్చింది. మిల్లర్లు తమ నిల్వలను ఈ సంస్థలకు అమ్మేసి బాగుపడ్డారు. మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించే ప్రస్తుత ఉన్నతాధికారుల వైఖరికి ఇదే పెద్ద ఉదాహరణ. కేవలం 25 శాతం పర్మిట్ల కోసం ఎగుమతికి అవకాశాలు ఇస్తే... మొత్తం గోదాముల సమస్య ఎలా పరిష్కారమవుతుందో ఆ అధికారులే చెప్పాలి. కొత్త గోదాముల అవసరాన్ని గతంలోనే వైఎస్ గుర్తించారు. 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లను నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికను రూపొందించారు. అందుకోసం ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రొత్సహించడానికి తగు చర్యల్ని తీసుకున్నారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన అకాల మృతికి గురయ్యారు. తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ఏడాది క్రితమే గోడౌన్ల నిర్మాణాలను చేపట్టినట్టయితే... ఈ పాటికి చాలా వరకు అందుబాటులోకి వచ్చేవి. ఎస్‌డబ్ల్యూసీ గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇప్పటికీ అవి ఖరారు కాలేదు. ఇప్పుడు నిర్మాణాలు ఆరంభించినా ఈ సీజన్‌కు ఆ కొత్త గోదాములు ఏమాత్రం ఉపయోగపడవు. ఉప్పుడు బియ్యం, గోధుమల నిల్వల తరలింపే ప్రస్తుత పరిష్కారం. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం మిల్లర్ల పాటకు వంత పాడుతూ సమస్యకు పరిష్కారం చూపని పర్మిట్ల జారీకి సంసిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై అఖిలపక్షం సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ అంతా బాగానే ఉందని, గోదాముల సమస్యతో సహా అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అలాగైతే బియ్యం ఎగుమతులకు పర్మిట్ల మాటేమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం కొసమెరుపు!!
దాన్యం నిల్వలకు ప్రైవేటు గిడ్డంగులు
 సీఎం రోశయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది ధాన్యం ఉత్పతి అధికంగా వచ్చే అవకాశముందని, ధాన్యం నిల్వల కోసం ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దెకు తీసుకోవాలని ఆదేశించామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సోమవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యాల నిల్వకు తగిన వసతికోసం గత రెండు మాసాలుగా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందని తెలిపారు. ఎఫ్‌సీఐ, రైల్వే, పౌరసరఫరాల శాఖ, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలన్నిటితో సమన్వయం చేస్తూనే ఉన్నామని, మరీ ముఖ్యంగా రైల్వే విభాగాన్ని కనీసం 7 రాక్స్ కావాలని అడిగామని చెప్పారు. అదనపు స్పేస్ కోసం అవసరమైతే ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దె (హైర్)కు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం కూడా అత్యధిక సంఖ్యలో నిల్వ ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు బయటకు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి రైతులకు కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు. గోదాముల అద్దె ప్యాకేజీ ఆకర్షించే విధంగా లేదని, ఆ పాలసీని సవరించి, ఆమోదయోగ్య పాలసీని తీసుకురావాలన్న మిల్లర్ల కోరికను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ విషయాలన్నిటినీ మంగళవా రం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని రోశయ్య చెప్పారు.

తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన గిడ్డంగులు: ఖరీఫ్‌తో పాటు రబీలోనూ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుండటంతో రాష్ట్రంలో ధాన్యాల నిల్వలకు గాను తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదిక గిడ్డంగుల ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖామంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి వద్ద సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది 3 నుంచి 4 శాతం అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, రానున్న జనవరి నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక యూనిఫైడ్ కో-ఆపరేటివ్ యాక్ట్
త్వరలోనే సహకార శాఖలో యూనిఫైడ్ యాక్ట్ రానుందని సహకార శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సహకారశాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టంపై ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించి ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 2831 కోట్లు రుణాలిచ్చామని, రబీలోనూ రూ. 1885 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పం రెస్కోలకు ఎన్నికలు జరపాలని సీఎం ఆదేశాలిచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లా తరహాలోనే రాష్ట్రంలో అన్ని సొసైటీ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తామని ఆయన చెప్పారు.

Sunday, October 3, 2010

కలలూ - శిక్ష

తీరని కోర్కెలు కలల రూపంలో వస్తాయంటారు.
కోర్కెలు తీరని వాళ్లు దెయ్యాలై తిరుగుతుంటారంటారు.
ఈ రెండిట్లో మీరు ఏది కావాలనుకుంటున్నారు?

***

ఎసిబి వలలో చిక్కిన అధికారిని చెయ్యి చాపమని చెప్పి అందరూ
చూస్తుండగా చింతబరికెతో ఒక్కటిచ్చింది ఆవిడ.

భూమిని చాప చుట్టి భుజం మీద పెట్టుకుని పారిపోతున్న ఒకాయన్ని నేల
తగలకుండా చెట్టు కొమ్మకు వేళ్లాడగట్టింది.

రాజకీయాటలు ఆడుతున్న వాడ్ని ప్రజాకోట గుమ్మం ముందు నిలబెట్టి
వోటరు కనబడినప్పుడల్లా వందేసి గుంజీలు తీయమంది.

ఎరువులు దాచినవాడిని రచ్చబండ మీదికి పిలిచి చెంప ఛెళ్లుమనిపించింది.
యాసిడ్ బాటిల్ పట్టుకున్నవాడి చేతిని గోడకుర్చీ వేసి కూర్చోపెట్టింది.

కన్నీళ్లు తెప్పించేవాడి ఇంట్లో నీళ్ల కొళాయిని బంద్ చేసింది.
రక్తం కళ్లజూసినవాడి ఒంట్లో హెమోగ్లోబిన్‌ను తగ్గించేసింది.

***

అంటే ఈవిడ మొదటి కోవకు చెందింది. అందుకే కలల్లోనే న్యాయం
వెతుక్కుంటోంది.
రెండో కేటగిరీలో ఇప్పుడు ఎవరికీ చోటు లేదు. అక్కడ ఇప్పటికే కిక్కిరిసి ఉంది.