కాంగ్రెస్‌కు వైఎస్ జగన్ రాజీనామా |
ఒంటరిని చేసే కుట్రపన్నారు... |

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి,
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖను రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్.రాజశేఖరరెడ్డిగారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాంనబీ ఆజాద్ సూచనలతోనే చిన్నాన్న ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను.

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్ర ధర్మమనీ ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబర్లోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీ మీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

కానీ క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్ ప్రతిబింబాన్ని తుడిచివేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్లు నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్ఠానం ఆశీస్సులే ఉన్నట్లు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్మెంట్ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శనకు అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా, చిరంజీవికి అయినా ఒక్కరోజులో అపాయింట్మెంట్ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్మెంట్ అడిగితే నెలరోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమి బాధపడలేదు.

ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు.కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు.దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు.
ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్ జ్ఞాపకాలను తుడిచివేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదస్పదమవుతోంది.ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు. అన్నిటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి.
ఆ అనుమానాలకు సీబీఐ, నిపుణుల నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేకపోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. దాని గురించి మాట్లాడటమే మహాపాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మహానేత హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించి అనేక సందేహాలను నివృతి చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయినా దాని మీద ఏం మాట్లాడిన ఎలాంటి పెడర్థాలు తీస్తారోనన్న అనుమానంతో క్రమశిక్షణ గల కార్యకర్తగా మౌనంగా భరిస్తూ వచ్చాను. అంతే కాదు ఓ రష్యన్ వెబ్సైట్ వెలువరించిన కథనం ఆధారంగా కొన్ని ఛానళ్లతో పాటు సాక్షి కూడా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది మహాపరాధమైనట్లు సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు.
నన్ను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్ ఒక విశ్లేషాణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలంశాలను చర్చించింది.
ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి. అలాగే బీహార్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్లతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్ గానీ కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్య్ర మీడియా సంస్థలుగా నిష్పక్షపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్, వీరప్ప మొయిలీ, ఆనంద్ శర్మ వంటి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
అప్పుడూ ఏ ఒక్కరు నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ఛానల్లో కాంగ్రెస్ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిలీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీనుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?
వీటికి తోడు ప్రతి రోజు నాపైన గాలి వార్తల ప్రచారం, నా మీద వేటుకు రంగం సిద్దమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్ళే ఏ చిన్న పిల్లాడిని అడిగినా నేడో రేపో జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారు. అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విషప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్ఠానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లిగారు, పార్లమెంట్ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు.ఒంటరిగా నేనే వెడుతున్నాను. ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను.
నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇకముందూ వ్యవహరించబోను.మళ్లీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 150 మంది శాసనసభ్యులు నా ముఖ్యమంత్రిత్వాన్ని బలపర్చిన నాడు మీ అభీష్టాన్ని మన్నించానే తప్ప చంద్రబాబు లాగా వైశ్రాయ్ తరహా క్యాంపులు నడిపి గద్దెనెక్కి కూర్చోలేదు. విలువలకు కట్టుబడిన వాడిని కనుకనే అలా చేయలేదు.
మీరు రోశయ్య గారిని ముఖ్యమంత్రిని చేయాలని తలవగానే సీఎల్పీలో ఆయన పేరును నేనే ప్రతిపాదించాను. ఉన్నత విలువల కోసమే ఆ పని చేశాను.ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేయడానికి జరిగిన సీఎల్పీ సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేందుకు సహకరించిందీ ఉన్నత ప్రజాస్వామ్య విలువల కోసమే. నేను స్థాపించిన సాక్షి మీడియా సంస్థ కూడా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకున్నది కూడా ఆ విలువల కోసమే. అలా వ్యవహరించబట్టే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ప్రజాదరణ పొందాయి.
విశ్వసనీయతను ఊపిరిగా భావించినందువల్లే స్థాపించిన రెండేళ్ళలోనే 14 లక్షల పైచిలుకు సర్క్యులేషన్ సాధించి సాక్షి దినపత్రిక రికార్డును సృష్టించింది, నేను పాటించిన ఉన్నత విలువలకు అదే సాక్షి. అందుకే చెపుతున్నాను... నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను.. గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను.. నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా త్రండి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.
యుద్ధ శంఖారావం !
కడప ఎంపీ జగన్ యుద్ధం ప్రకటించారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పైనే సమర శంఖారావం పూరించారు. ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించారు. అయిదు పేజీల లేఖతో ఆమె వ్యవహార శైలిని అడుగడుగునా తప్పుబట్టారు. అది సోనియా గాంథీ మీద రాజకీయ దాడి. తనకు జరిగిన అన్యాయానికి ఆమెను అడుగడుగునా నిలదీశారు. సోనియానుద్దేశించి రాసిన లేఖే అయినా, ప్రజలను, వారి మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని పదజాలాన్ని వాడారు. విశ్వసనీయత గురించి ఆయన పదే పదే ప్రస్తావించడం ద్వారా తాను ప్రజల మనిషిగా ఉంటానని, వారికే విశ్వసనీయుడినని చెప్పక చెప్పారు.
ఆక్రోశం, ఆవేదన, వ్యధ కలగలిపి తయారు చేసిన ఆ సుదీర్ఘ లేఖ రాష్ట్రంలో రాజకీయ సంద్రాన్ని అతలాకుతలం చేసింది. అదే సమయంలో ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించింది. తన బాబాయ్ వివేకానంద రెడ్డిని సోనియా గాంధీ పిలిపించడం ద్వారా తమ కుటుంబంలో చీలికలు తెచ్చే కుటిల నీతికి పాల్పడ్డారని, అదే తనను బాధించిందని చెప్పడం ద్వారా తాను పార్టీని వీడి పోవడానికి దారి తీసిన అనేక కారణాల్లో అదే ప్రధాన కారణమని అన్యాపదేశంగా చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు తనను చూసి భయపడుతున్నారని, తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన మీద కక్ష తీర్చుకుంటున్నారని స్వయంగా అందులో ధ్వజమెత్తారు.
తన తండ్రి పేరు ప్రతిష్టలను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆవేదనతో పాటు జన సామాన్యం తన వెంటే ఉందన్న ధీమా ఏక కాలంలో ఈ లేఖలో కనిపించాయి.నిజానికి ఈ లేఖ సోనియా గాంధీకి ఉద్దేశించిందే అయినా, అది కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరికొత్త సవాళ్లను తెచ్చి పెట్టింది. ఆయన నియామకం జరిగి పట్టుమని నాలుగైదు రోజులైనా గడవక ముందే..కేబినెట్‌కు సంపూర్ణ రూపం ఇవ్వక మునుపే జగన్ తన అమ్ముల పొదిలోని రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అది సోనియా మీద కలిగించే ప్రభావం ఒక రకమైనదైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మీద కలిగించే ప్రభావం మరో రకమైనది.
బుధవారం ఆయన జరప తలపెట్టిన కేబినెట్ ప్రమాణ స్వీకారం ఆయనకే అగ్ని పరీక్షగా మార నున్నది. మంత్రి పదవుల మీద ధీమాగా ఉన్న ఆశావహులంతా ప్రస్తుతానికి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నా, రేపు మంత్రి మండలిలో చోటు దొరకలేదని రూఢి అయ్యాక ఎవరి దారెటో కనుక్కుని ముందుగానే కాయకల్ప చికిత్స చేయడం కొత్త ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహానికి పరీక్షగా నిలిచింది.పదవులకు అతీతంగా పార్టీ శ్రేణులనందరినీ ఏకతాటి మీద నిలపడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. కేబినెట్ ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రభుత్వ రోజు వారీ నిర్వహణలో తల మునకలు కావాల్సిన సీఎం హఠాత్తుగా ఈ కొత్త రాజకీయ సవాలును ఎదుర్కోవాల్సివచ్చింది.
|