Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.