Sunday, June 24, 2012

ఊపే ఆ చేతుల వెనక...



వాళ్లు ఎందుకు చేతులు ఊపుతున్నారు? ఒలింపిక్స్‌లో గెలిచి దేశానికి మంచి పేరు తెచ్చారనా? ఎవరెస్టును అధిరోహించి గర్వకారణంగా నిలిచారనా? అంతరిక్షంలో మన జెండాను నాటారనా..? ఏమి ఘనకార్యం చేశారని చేతులు ఊపుతున్నారు? చేతులు ఊపుకుంటూ అత్తగారింటికి వెళ్లినట్లు జైలుకు వెళుతున్న దృశ్యాలు ఈ మధ్యనే చాలానే కనిపిస్తున్నాయి. ఇదేదో ఆషామాషీగా వ్యవహారం కాదు. నిందితులు కప్పుకున్న ఈ ముసుగు వెనుక లోతుల్ని కనుక్కునేందుకు సైకాలజిస్టుల్ని సంప్రదిస్తే.. 
వాళ్లు చేసిన విశ్లేషణే ఈ  స్టోరీ..

ఒక జేబుదొంగ పది రూపాయలు కొట్టేసి పోలీసులకు దొరికిపోతే.. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అరచేతుల మధ్యన దాచుకుంటాడు.
రెండొందలో, మూడొందలో లంచం తీసుకున్న క్లర్కు ఏసీబీకి చిక్కితే.. తలదించుకుని కోర్టులోకి అడుగుపెడతాడు.
ఒక సెక్సువర్కరు పడుపు వృత్తి చేస్తూ దొరికితే.. కొంగుతో ముఖం కప్పుకుని ఒక మూల నిలబడుతుంది.

చిన్న తప్పులు చేసినందుకే వీళ్లంతా అపరాధభావంతో కనిపిస్తారు. కాని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నిందితులు అలా కనిపించడం లేదు. ఎన్నడూ లేనివిధంగా జైలుకు-కోర్టుకు తిరుగుతున్నప్పుడు.. చేతులు ఊపుతూనో, చిరునవ్వులు చిందిస్తూనో, నమస్కారాలు పెడుతూనో కనిపిస్తున్నారు. ఈ విచిత్రాలు ఈ మధ్య కాలంలోనే మొదలయ్యాయి.

ఇంతకు మునుపు పోలీసులు ఇంటికొస్తేనో, కేసుల్లో ఇరుక్కుని కోర్టు గుమ్మం తొక్కితేనో పరువంతా పోయిందనుకునే వాళ్లు. వైట్‌కాలర్ నేరాల్లో ఈ పరిస్థితి కనిపించదు. ఎందుకంటే, వైట్ కాలర్ నేరమంటేనే.. ప్రజలకు అర్థంకాని బ్రహ్మపదార్థం. ఒక వ్యక్తిని హత్య చేశాడనో, దాడి చేసి గాయపరిచాడనో తెలిస్తే అతన్ని ఖూనీకోరుగా చూస్తారు. అవినీతి నేరాలు సంఘంలోని వ్యక్తులకు నేరుగా ఇబ్బంది కలిగించవు. ప్రత్యేకించి ఒక వ్యక్తి అంటూ బాధితుడుగా ఉండడు. ప్రభుత్వలొసుగులు, చట్టాలను వాడుకుని.. అవినీతికి పాల్పడటం ఇందులోని ముఖ్య లక్షణం. పాలనలో పాలుపంచుకునే నేతలు, కార్పొరేట్ అధిపతులు, లాబీయింగ్ చేసేవాళ్లు.. ఇలాంటి అవినీతిని చేస్తుంటారు.

"వీరు తప్పు చేసినప్పుడు ప్రజల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత రాదు. ఎందుకంటే, వారికున్న పలుకుబడి, పరపతి అలాంటిది. అందువల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కూడా గిల్టీగా ఫీలవరు. ప్రస్తుతం అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతికి పాల్పడటమన్నది నేతలకు చిన్న విషయమైపోయింది. కోర్టుల్లో శిక్ష పడుతుందన్న నమ్మకం లేదు. విచారణకు చాలా సమయం పడుతుంది..'' అంటున్నారు నిపుణులు. ఇవన్నీ అవినీతి, అక్రమార్జన నేరాలకు పాల్పడిన వారికి బాగా కలిసొస్తున్నాయి. ఒక ఆరోపణ రుజువు కావడం, జైలు శిక్ష పడటం సంగతి అలా ఉంచితే.. ఈ తరహా నిందితుల మనస్తత్వం సాధారణ నేరస్తుల కంటే భిన్నమైనదని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. కొందరు అరెస్టు అవుతారన్న సంగతి ముందే తెలియడంతో మానసికంగా సన్నద్ధం కావడం కూడా ధీమాగా వెళ్లడానికి కారణం కావచ్చు.

జగన్ కేసుతో మొదలు..

జైలుకు, కోర్టుకు చేతులు ఊపుకుంటూ వెళ్లే ట్రెండు ఆడిటర్ విజయసాయిరెడ్డితోనే మొదలైంది. అది జగన్ అరెస్టుతో ఊపందుకుంది. రాష్ట్రం యావత్తూ ఆసక్తిగా తిలకించిన సంఘటన.. జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించడం. టీవీ చానళ్లు మళ్లీ మళ్లీ చూపించడంతో.. ఆ దృశ్యం ఇప్పటికీ అందరి కళ్లల్లో మెదులుతోంది. వ్యాను దిగిన వెంటనే ఆయన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుగా మీడియా ప్రతినిధులు కెమెరాలు పట్టుకుని నిల్చున్నారు. అలాంటి సమయంలో.. పోలీసులు నిందితుల భుజం మీద చేయి వేసి జైలుకు తీసుకెళ్లటం సహజంగా జరుగుతుంటుంది. అలా తీసుకెళితే..! పరువు పోదా? వ్యాన్‌లో కూర్చున్నప్పుడే జగన్‌కు ఆలోచన వచ్చి ఉండవచ్చు. ప్రజలందరూ చూస్తుండగా అలా లోపలికి వెళ్లడం జగన్ మనస్తత్వానికి ఇష్టముండదని మానసికవేత్తలు విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం- వ్యాన్ దిగిన తర్వాత తను జైలు ద్వారం వరకు ఎలా నడవాలో ఆయన ముందుగానే నిశ్చయించుకుని ఉంటారు. 'నువ్వు ఉండవయ్యా'', "నువ్వు కూడా ఉండు..'' అన్న భావం వచ్చేలా ఆయన రెండువైపులా ఉన్న పోలీసులను అటొక చేత్తో, ఇటొక చేత్తో సైగ చేసి దూరం పెట్టారు.

ఆ తర్వాత కుడిచేత్తో కాలర్‌ను సర్దుకుని.. రెండు చేతులు జోడించారు. నిజానికి ఆయన ఎదురుగా ప్రజలెవ్వరూ లేరు. ఉన్నది టీవీ ఛానళ్ల రిపోర్టర్లు, కెమెరామెన్లు మాత్రమే. అయినా చిరునవ్వును పులుముకుని.. పదే పదే రెండు చేతులు జోడించి నమస్కారాలు పెట్టడం టీవీల్లో చూసేవాళ్లకు చిత్రంగా అనిపించింది. ఒకనాటి ముఖ్యమంతి పుత్రున్ని జైల్లో పెడుతున్నారన్న ఆసక్తితో టీవీలు చూస్తున్న జనాన్ని ఆ దృశ్యం ఆశ్చర్యపరిచింది. "జైలు దగ్గర జగన్ అన్నిసార్లు ఎందుకు నమస్కారాలు పెట్టాడు?'' అని చాలామంది ప్రజలు అనుకున్నారు. పోలీసు వ్యాను దగ్గరి నుంచి జైలు గేటు వరకు ఉన్న ఇరవై అడుగుల దూరంలోనే ఆయన కనీసం పది నుంచి పదిహేనుసార్లు దండాలు పెట్టాడు.

వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జైలుకు వెళుతున్న జగన్.. "నేనేమీ తప్పు చేయలేదు. నా మీద రాజకీయకక్ష తీర్చుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఇదంతా చేస్తున్నది అని జనానికి తెలియజేసేందుకు తల ఎత్తుకుని ధైర్యంగా లోపలికి వెళ్లారు'' అంటున్నారు సైకాలజిస్టులు. "అలాంటి సమయంలోనే వ్యక్తి నిగ్రహం, సహనం తెలుస్తుంది. జగన్ వ్యూహాత్మకంగా నమస్కారాల్ని ఎంచుకున్నాడు. కొన్నాళ్లకు ఎన్నికలు కూడా రానున్నాయి. ప్రజలు తన పట్ల సానుభూతి చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఆ పద్ధతిని ఎంచుకున్నాడు. టీవీ విలేకర్లకు నమస్కరించలేదు. టీవీలు చూసే ప్రజలకి నమస్కారాలు చేశారు. అందుకే, ఆ దృశ్యానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది'' అని పేర్కొన్నారు విశ్లేషకులు. ఒక పార్టీ నాయకునిగా.. "నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దేన్నయినా ఎదుర్కొనే ధీమాతోనే ఉన్నాను. ఏదో ఒక రోజు మళ్లీ బయటికి వస్తాను'' అన్న అంతరార్థం ధ్వనించేలా జగన్ తన హావభావాల్ని ప్రదర్శించినట్లు వారు చెబుతున్నారు.
తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అవసరమైతే ప్రజల నుంచి సానుభూతి పొందడానికి, విచారణ అధికారుల్ని తప్పుదోవ పట్టించడానికి.. సాధారణంగా నిందితులు కొన్ని వ్యూహాల్ని ఎంచుకుంటారు. వాటినే క్రిమినల్ సైకాలజీలో 'సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం' అంటారు.

రివర్స్‌గేర్..

సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ప్రధానంగా మూడు లక్షణాల్ని ప్రదర్శిస్తారు నిందితులు. అందులో ఒకటి 'ప్రొజెక్షన్'. తను చేసింది తప్పు అని తెలిసినా, పూర్తి రివర్స్‌గేర్‌లో ప్రవర్తిస్తారు. అందుకు అనుగుణంగా శరీరభాషను, ముఖకవళికల్ని మారుస్తారు. మంచి వ్యక్తిగా నటించడం. "అన్ని పార్టీలు, నాయకులు నన్ను ఒంటరివాడ్ని చేసి దాడి చేస్తున్నారు'' అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అవినీతి నేరాలకు పాల్పడిన రాజకీయనేతలు సింపతీ అస్త్రాన్ని వాడుకున్నంతగా దేన్నీ వాడుకోరు. రెండోది-'రేషనలైజేషన్'.

ఒక పిల్లవాడిలో ఇలాంటి లక్షణం ఉందనుకోండి. అతను పరీక్షలో ఫెయిలైనప్పుడు 'ఏంట్రా బాగా చదువుకోలేదా' అని తల్లి అడిగితే.. తను చదవలేదన్న నిజాన్ని అంత ఈజీగా ఒప్పుకోడు. 'నేనైతే పరీక్ష బాగా రాశానమ్మా. పేపరు దిద్దిన వాడే నన్ను ఫెయిల్ చేశాడు. నా తప్పు ఏమీలేదు..'' అని ఎదుటివాళ్ల మీదికి తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తాడు. డిఫెన్స్ మెకానిజంలో 'ఎస్కేపిజం' కిందికి వస్తుంది ఈ తరహా ప్రవర్తన. వైట్‌కాలర్ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు రాజకీయ నేతలైతే.. ఇదే అస్త్రాన్ని బయటికి తీస్తారు. "నువ్వు చేసింది తప్పు'' అని అవతలి పార్టీ విమర్శిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. "మంత్రులే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మా నేతకు ఏమీ సంబంధం లేదు'' అని ఎదురుదాడికి దిగడం చూస్తున్నాం.

వైట్‌కాలర్ నేరాల్లో ఇరుక్కున్న నిందితులు.. విచారణలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే, వీరికి చట్టాల్ని ఎలా వాడుకోవాలి? వాటి నుం చి రక్షణ ఎలా పొందా లి? దొడ్డి దారులు ఎక్కడుంటాయి? బాగా తెలుసు. అందుకే, దర్యా ప్తులో కూడా అంత సులువుగా సహకరించరు. ఈ మధ్య జగన్ తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు కూడా విన్నవించింది. నార్కోటిక్ పరీక్షలకు కూడా అనుమతించాలని పేర్కొంది. ఇక, డిఫెన్స్‌మెకానిజంలో మూడో లక్షణం-'రియాక్షన్ ఫార్మేషన్'. తప్పు చేసినప్పటికీ.. "నేను దేనికీ భయపడను..'' అని ఎదుటివాళ్లను నమ్మించే ప్రయత్నం చేయడం. వైట్‌కాలర్ నేరస్తులు నేరం రుజువయ్యే వరకు.. తనను తాను నిత్యం ప్రోత్సహించుకోవడం దీని కిందికే వస్తుంది.

పాపభీతి శూన్యం..

చాలామంది అవినీతి నేరస్తుల్లో పాపభీతి ఏ కోశాన ఉండదు. తాము తప్పు చేశామన్న పశ్చాత్తాపభావం కాని, తప్పును సరిదిద్దుకోవాలన్న ప్రయత్నం కాని చేయరు అంటున్నారు క్రిమినల్ సైకాలజీ అధ్యయనం చేసిన డాక్టర్ నీలిమ. వీరికి డబ్బుపట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది.ఈ మితిమీరిన వ్యామోహం వెనుక మానసిక దౌర్బల్యం ఉంటుంది. పుట్టి పెరిగిన కుటుంబం, పెరిగిన వాతావరణం, జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యం.. ఇవన్నీ ఒక మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడతాయి. ఈ మధ్య అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న కొందరు నిందితుల మనస్తత్వాలను విశ్లేషించిన సైకాలజిస్టులు.. ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్థాంతం ప్రకారం ఇలా చెప్పారు- "ఒక మనిషిలో ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే మూడు లక్షణాలు ఉంటాయి. మొదటి దాంట్లో భౌతిక లక్షణాలు, రెండో దానిలో మానసిక లక్షణాలు, మూడోదానిలో నైతికత ఉంటాయి.

ఇందులో మళ్లీ కాన్షన్స్, ఇగో ఐడియల్స్ ఉన్నాయని చెప్పారు ఫ్రాయిడ్. వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేందుకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్‌ను సృష్టిస్తాయి ఇగో ఐడియల్స్. ఇవి బలహీనంగా ఉంటే ఇంపల్సివ్‌గా తయారవుతారు. వ్యామోహ కోలాహలంలో కొట్టుకుపోతారు. ఇలాంటి వ్యక్తుల్లో పాపభీతి అన్నదే ఉండదు. "నాకు డబ్బు కావాలి. దాన్ని ఏ దారిలో సంపాదించినా తప్పు లేదు. ఎవరేమనుకున్నా పట్టింపు లేదు. వ్యవస్థలు ధ్వంసమైనా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా పరవాలేదు. నా లక్ష్యం నాది. నా పంతం నాది. అది నెరవేరాలంతే!'' అనుకునే మనస్తత్వం రాజకీయపరమైన నేరస్తుల్లో పుష్కలంగా ఉంటుంది. వీరు జైలుకు వెళ్లినా, చట్టాలు శిక్షలు వేసినా భయపడరు. పశ్చాత్తాప భావంతో వ్యక్తిత్వాన్ని మార్చుకునే ప్రయత్నమే చేయరంటారు నిపుణులు. అవినీతిపరులు ఎన్ని అడ్డంకులున్నా నేరం చేయడానికి వెనుకాడరు. దీన్ని రుజువు చేయడానికి నేరస్తుల మనస్తత్వం మీద పరిశోధనలు చేసిన హెచ్.జె.ఐజంక్ ఒక ప్రయోగం చేశాడు.

అందుకు ఆయన కొన్ని కుక్కల్ని తీసుకున్నాడు. ఒక చోట చిన్న జాలీ పెట్టి.. దానికి కరెంటు పెట్టాడు. జాలీ అవతల కొన్ని మాంసపు ముక్కల్ని ఉంచాడు. మాంసాన్ని చూస్తూనే కుక్కలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లాయి. దగ్గరకు వెళ్లగానే కరెంటు షాక్ తగిలింది. 'అమ్మో ఇదేదో ప్రాణం మీదికి వచ్చేట్టుంది' అని కొన్ని కుక్కలు వెనక్కి తిరిగాయి. మరికొన్ని కుక్కలు తటపటాయిస్తూ ఆగిపోయాయి. మూడో గ్రూపు షాక్‌ను భరిస్తూనే.. జాలీని దాటుకుని వెళ్లి.. మాంసాన్ని బొక్కేశాయి. మన దగ్గర ఎన్ని కఠినమైన చట్టాలు, బలమైన విచారణ వ్యవస్థలు, పత్రికలు, ప్రజాసంఘాలు ఉన్నా.. అవినీతి నేరస్తుల్లో భయం కనిపించదు అని చెప్పడానికి ఐజంక్ ఈ ప్రయోగాన్ని ఉదహరిస్తారు.. అని ప్రముఖ సైకాలజిస్టు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంత తీవ్రమైన కాంక్ష కేవలం డబ్బు సంపాదించాలన్న కోరిక నుండే పుడుతుంది.. అందుకు ఉపకరించే స్వభావాన్ని 'సైకోపతిక్ ఆటిట్యూడ్' అంటారు.

సైకోపతిక్ ఆటిట్యూడ్..

బాల్యం నుంచి నేరగ్రస్త కుటుంబంలో పెరగడం, భూస్వామ్య మనస్తత్వం అలవడటం, నాకెవరూ ఎదురు చెప్పకూడదనుకునే మనస్తత్వం, చట్టాన్ని గౌరవించకుండా అనైతిక పద్ధతుల్ని ఎంచుకోవడం, తను అనుకున్నది తప్పయినా, ఒప్పయినా మూర్ఖంగా చేయడం.. సైకోపతిక్ ఆటిట్యూడ్ ముఖ్య లక్షణాలు. వైట్‌కాలర్ నేరస్తుల్లోనే కాదు, ఫ్యాక్షన్ నేతల్లో కూడా ఈ లక్షణాలు ఎక్కువ. జైలుకు వెళ్లడమన్నా, శిక్షలు అనుభవించడమన్నా వీరికి గిట్టనే గిట్టదు. తప్పును ఆత్మపరిశీలన చేసుకుని.. మారడమంటే పరమ చికాకు. ప్రభుత్వ నిబంధనలే కాదు, ఏ నిబంధనలూ వారికి అడ్డం రాకూడదు అనుకుంటారు.. అన్నది సైకాలజిస్టుల అభిప్రాయం. పరిమితుల్లేని స్వేచ్ఛను కోరుకుంటారు.

విపరీతమైన స్వార్థం ఉంటుంది.ప్రజాస్వామ్యం జాంతానై. అంతా సొంత స్వామ్యంతోనే నడపాలని చూస్తారు. వీరికి కుటుంబ సంబంధాలూ అంతంతమాత్రమేనని ఈ నేరస్తుల్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరితోనూ ఎక్కువ కాలం స్నేహాన్ని కూడా కొనసాగించలేరు. అక్కరపడ్డప్పుడు దగ్గరవ్వడం, పనికిరారనుకుంటే పక్కన పెట్టడం వీరికి వెన్నతోపెట్టిన విద్య. అక్రమమార్గంలో పని చేయించుకోవడానికి అస్త్రాలన్నీ ప్రయోగిస్తారు. బుజ్జగిస్తారు. ఎరవేస్తారు. అవేవీ ఫలించకుంటే.. దండం ఎలాగూ ఉంది అంటున్నారు నిపుణులు. మొత్తానికి తాము అనుకున్న పని పూర్తి చేయడం ఈ నేరస్తుల లక్షణం. వీరి పాపానికి ఆఫీసర్లు జైలు పాలైనా 'అయ్యో పాపం' అనడం కూడా ఉండదు. తమ మేధో సామర్థ్యాన్ని, జ్ఞానసంపదను, సాంకేతిక వ్యవస్థను అంతా సొంతానికి వాడుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే - ఈ లక్షణాలున్న వారి ముందు "నేను'' తప్ప మిగిలినవన్నీ బలాదూర్.. అంటున్నారు మానసిక నిపుణులు.

సైకోపతిక్ ఆటిట్యూడ్ రాను రాను 'యాంటీ- సోషల్ పర్సనాలిటీ డిజార్డర్'గా మారిపోతుంది. దీని లక్షణాలు చాలా తీవ్రమైనవి. "నా అంతటివాడు మరొకడు ఉండకూడదు. నేనే అందరికంటే ఎక్కువ. నేను చెప్పిందే శాసనం..'' అనేలా ప్రవర్తిస్తారు. మానసిక దౌర్బల్యంలో ఇదొక జాడ్యం. దీన్ని 'నార్‌సిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్స్' అంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు. రోబోల్లాగే అనిపిస్తారు. ఎక్కడా గిల్టీగా కనిపించకుండా జాగ్రత్త పడతారు. "నేను అవినీతి చేయలేదు. కావాలనే ఇరికించారు. నా మీద ఎవరో కక్షగట్టారు...'' అని బయటికి చెప్పడమే కాదు, మనసులోనూ బలంగా విశ్వసిస్తారంటున్నారు నిపుణులు. ఇందుకు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే సహించే స్వభావం వీరికి ఉండదు. సీబీఐలాంటి ఉన్నత దర్యాప్తు సంస్థలు కూడా ఈ తరహా నిందితులతో తలనొప్పులు పడాల్సి వస్తున్నది.

తలదించుకునే వాళ్లు..

అవినీతి నేరాల్లో జైలుకు వెళుతున్న నేతలు గిల్టీగా ఫీలవ్వడం లేదు కాని.. అధికార్లు, కార్పొరేట్ సంస్థల అధిపతులు మాత్రం తలవంచుకునే వెళుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి అధికారుల్లో "ఇలా చేసి ఉండాల్సింది కాదు..'' అన్న భావం వ్యక్తమవుతున్నట్లు వాళ్ల ముఖకవళికల్ని బట్టి చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు.ఉన్నతస్థాయి అధికారులు ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సివిల్‌సర్వీసులాంటి ఉన్నత ఉద్యోగాల్ని చేపట్టేందుకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలి. చదువు, క్రమశిక్షణ వాళ్లకు తెలియకుండానే ఒక మంచి వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఉద్యోగం ఒత్తిళ్లతోనో, డబ్బు ఆశతోనో తప్పు చేసి దొరికిపోతే.. అలాంటి వాళ్లలో అపరాధభావం చుట్టుముడుతుంది.. అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. స్వయంకృతాపరాధమే అయినా సత్యం కుంభకోణంలో అరెస్టయిన రామలింగరాజులో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉన్నతహోదాలో జీవించిన ఆయన అనూహ్యంగా అరెస్టయ్యారు.

ఒక తప్పు చేయడం వల్ల తన కీర్తిప్రతిష్టలు ఎలా మంటగలిసిపోయాయో తెలిసినందువల్లే కోర్టుకు వస్తున్నప్పుడు, జైలుకు వెళుతున్నప్పుడు. ఈ మధ్య బెయిలుపై బయటికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడా చేతులు ఊపడంగాని, నవ్వడం గాని చేయలేదు. ఆయన చేసింది ఆర్థిక నేరమైనా.. రాజకీయనేతల స్వభావానికి భిన్నంగా ఉండిపోయారు. జగన్ కేసులో అరెస్టయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి మాత్రం రామలింగరాజుకంటే భిన్నంగా ప్రవర్తించారు. "ఆయన ఆడిటర్ అనడం కంటే.. ఒక నేతకు ప్రధాన అనుచరుడు అనడం మంచిది. తన మేధోసంపత్తిని ఎందు కోసం వాడుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే, జైలుకు వస్తూపోతున్నప్పుడు ఒక రాజకీయనేత స్వభావాన్నే ప్రదర్శించారు..'' అన్నారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అధికారంలో ఉన్న నేతల ఒత్తిళ్లు, డబ్బు మీదున్న ఆశవల్ల మాత్రమే తప్పు చేసిన వాళ్లు.. తిరిగి మారేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు బాల్యం నుంచి అనైతికత స్వభావంతో పెరగలేదు.

పాలనాధికారం చేతిలోకి వచ్చాకే.. ఏ అధికారైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అదే రాజకీయ నేతలైతే... అనేక వక్రమార్గాల్లో నడిచి ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్' అనేది అధికారుల్లో కంటే నేతల్లోనే ఎక్కువని చెప్పారు మనస్తత్వశాస్త్ర నిపుణులు. ప్రముఖ ఆధ్యాత్మికవాది నిత్యానందస్వామిలో కూడా సైకోపతిక్ లక్షణాలున్నట్లు మానసిక నిపుణుల అభిప్రాయం. తాను అశ్లీల కార్యకలాపాలకు పాల్పడిన సంగతి ప్రజలకు తెలిసాక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అరెస్టయినప్పుడల్లా.. తెచ్చిపెట్టుకున్న ధీమాతో కనిపించే ప్రయత్నం చేశాడాయన. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి రాజా, కనిమొళి, గాలి జనార్దన్ రెడ్డిలాంటి వాళ్లు కూడా ప్రజలకు అభివాదం చేస్తూనో, చిరునవ్వులు చిందిస్తూనో టీవీల్లో కనిపించారు. అలా కనిపించినంత మాత్రాన ఏది నీతో, ఏది అవినీతో ప్రజలకు తెలియకుండా ఉండదు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు.

రెడ్ కాలర్ క్రైమ్

అధికారాన్ని, పలుకుబడిని, మేధోసామర్థ్యాన్ని వాడుకుని.. చట్టం కళ్లు గప్పి అక్రమంగా సంపాదిస్తే వైట్‌కాలర్ క్రైమ్ అవుతుంది. ఈ పదాన్ని మొదటిసారి 1939లో ఎడ్విన్ సదర్‌లాండ్ తొలిసారిగా అమెరికన్ సోషియలాజికల్ సొసైటీ సమావేశంలో ప్రకటించారు. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ తరహా నేరస్తులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని వైట్‌కాలర్ క్రైమే కుదిపేస్తున్నది. వైట్ కాలర్ క్రిమినల్స్ డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు. మానవ విలువలు, ప్రజాసంక్షేమం అనేవి పైకి కప్పుకున్న ముసుగులు మాత్రమే. నిజస్వరూపం మరోలా ఉంటుంది. తమ వైట్ కాలర్ నేరాలు బయటపడితే, అవి తన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయనుకుంటే.. హింసకు సైతం తెగిస్తారు ఈ నేరస్తులు. అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ చేసిన హింసనే 'రెడ్ కాలర్ క్రైమ్' అంటున్నారు. ఈ ధోరణి ఈ మధ్యనే మన దేశంలో వ్యాపిస్తోంది. వైట్ కాలర్ నేరస్తులు హింసకు పాల్పడే పరిస్థితులు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది.
- డా. నీలిమ ఓలేటి,
క్రిమినల్ జస్టిస్‌లో తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తి, హైదరాబాద్

Friday, June 1, 2012

నాయకుడా.. నేరగాడా? - కొత్త పలుకు by RK

రాష్ట్రంలో మూడేళ్ల క్రితం జరిగిన దానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. ఇకపై ప్రజలే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా బెయిల్ పొందడానికి కోట్ల రూపాయలు వెదజల్లగలిగే వారి పట్ల ఇటు పౌర సమాజం, అటు వ్యవస్థలు కఠినంగా వ్యవహరించకపోతే దేవుడు కూడా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడలేడు!

మాటలు దొరకడం లేదు. అవినీతి, అక్రమాలను ఉపేక్షిస్తే ఏమి జరుగుతుందని భయపడ్డామో అదే జరిగింది. అవినీతి భూతం ఈ దేశం వెన్నెముకను విరిచేస్తోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసి 24 గంటలు గడవక ముందే, ఖనిజ సంపదను అడ్డంగా దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కోట్ల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై సి.బి.ఐ. కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్లు ఏ వ్యవస్థనూ కళంకితం చేయకుండా మిగల్చరని ఈ ఉదంతంతో రుజువైంది.

న్యాయ వ్యవస్థలోకి కూడా అవినీతి జొరబడిందని వార్తలు వస్తున్నప్పటికీ, ఈ స్థాయిలో ఒక న్యాయమూర్తి లంచం తీసుకుని దొరికిపోవడం దేశంలో ఇదే ప్రథమం! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ. విచారణ చేస్తున్న కేసులో కూడా కిందిస్థాయి న్యాయమూర్తి ప్రలోభాలకు లోనయ్యారంటే, అవినీతి మనల్ని ఎంతగా దిగజార్చుతున్నదో స్పష్టం అవుతోంది. వ్యవస్థల పతనం ప్రారంభం అయ్యాక అది మధ్యలో ఆగదు. అవినీతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే అది అన్ని వ్యవస్థలను కమ్మేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన గాలి జనార్దన్ రెడ్డి కేసు కావొచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసు కావొచ్చు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి పెడ ధోరణులు చోటుచేసుకున్న తర్వాత ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?

బెయిల్ పొందడం కోసం గాలి జనార్దన్ రెడ్డి కోట్లలో లంచం ఇచ్చారంటే... ఆయన ఎంత భారీ స్థాయిలో దోపిడీ చేశారో స్పష్టం అవుతుంది. అలాంటి వ్యక్తిపై నేర నిరూపణకు ఇంకా విచారణ అవసరమా? అన్నదే ఇప్పుడు ప్రశ్న! సి.బి.ఐ. వ్యవస్థపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ప్రలోభాలకు తలొగ్గకపోవడమే కాదు- ప్రాణాలకు తెగించి మరీ లక్ష్మీనారాయణ బృందం దర్యాప్తు చేస్తున్నది. తాము ఎంతో శ్రమకోర్చి, ఎంతో రిస్క్ తీసుకుని ఛేదించిన కేసులలో నిందితులను శిక్షించవలసిన న్యాయమూర్తులే లంచాలు తీసుకుంటే, నిజాయితీతో వ్యవహరిస్తున్న అధికారుల ఆత్మ స్థైర్యం ఏమి కావాలి? పట్టాభి రామారావు తరహాలో సి.బి.ఐ. అధికారులు కూడా లాలూచీ వ్యవహారాలకు తలొగ్గి గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిర్దోషులని దర్యాప్తు నివేదికలో పేర్కొనడానికి అంగీకరిస్తే వందల కోట్ల రూపాయలు లంచం రూపంలో వారు పొందలేరా? న్యాయ వ్యవస్థలో ఇంకా నిబద్ధత మిగిలే ఉంది కనుకే సి.బి.ఐ. అధికారులు కోరిన వెంటనే తదుపరి దర్యాప్తునకు హైకోర్టు అనుమతి ఇవ్వడమే కాకుండా, దోషిగా నిర్ధారణ అయిన న్యాయమూర్తిని సస్పెండ్ చేసింది.

ఇవే కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ.ఎ.ఎస్. అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి సి.బి.ఐ. కోరినా, కార్యనిర్వాహక వ్యవస్థ నెలల తరబడి నాన్చుతోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇందుకు భిన్నంగా సి.బి.ఐ. నివేదిక అందిన మరుక్షణమే స్పందించి పట్టాభి రామారావును సస్పెండ్ చేసింది. దొరికిన దొంగలు సరే- దొరకని దొంగల సంగతి ఏమిటి? డబ్బుతో ఎవరినైనా కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే పరిస్థితి కొనసాగితే భావి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహిస్తేనే భయం వేయడం లేదా! గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయమే తీసుకుందాం! ప్రజల సంపదను ఎడాపెడా దోచుకున్న గాలి న్యాయాన్ని కొనగలిగారు.

కానీ, ఇదే కేసులో కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటి వాళ్లు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి కూడా బెయిల్ లభించవచ్చు. బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచితే రోజు రోజుకీ ఆయన ఇమేజ్ పెరగడం లేదా? అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంలో అర్థం ఏమిటి? ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుల విషయంలో న్యాయవ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించాలేగానీ పర్యవసానాల గురించి ఆలోచించ వచ్చునా? ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని భావిస్తే, ఇకపై ఏ నేరస్థుడినీ శిక్షించలేం! ప్రజలు అమాయకత్వంతో కొంత మంది నేరస్థుల పట్ల సానుభూతితో ఉన్నా, ఆరాధనాభావంతో ఉన్నా, ప్రజలకు మార్గ నిర్దేశం చేయవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుంది.

సోదరుడి హత్యా నేరానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు లంచం ఇవ్వజూపి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కె.ఎ.పాల్‌కు కూడా బెయిల్ లభించింది. ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనందున, తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకోవడానికి వీలుగా తాత్కాలిక బెయిల్ ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా అయితే ప్రతి నేరస్థుడు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని కోర్టుల నుంచి రక్షణ పొందరన్న గ్యారెంటీ ఏముంది? జగన్మోహన్ రెడ్డి తరఫున బెయిల్ పిటిషన్లపై వాదిస్తున్న న్యాయవాదులు కూడా తమ క్లయింట్‌పై పద్దెనిమిది మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకున్నారు. జగన్ కూడా ఇదే విషయం కింది కోర్టులో స్వయంగా చెప్పుకున్నారు. నిజానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అక్రమాస్తుల కేసులో సి.బి.ఐ. ఆయనను ఎ-1గా పేర్కొంది.

అంటే, జగన్‌ను ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారని ఆయన పార్టీ అభ్యర్థులకు తెలియదా? తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన అక్రమాలకు ఏదో ఒక రోజు బోను ఎక్కక తప్పదని జగన్‌కు తెలియదా? అయినా, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కనుక, ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వీలుగా బెయిల్ ఇవ్వవలసిన అవసరం ఉందా? ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా పరిగణించాలన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న! ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో చట్టాలు, న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలి? సమాజంలో వారి పట్ల ఎటువంటి దృక్పథం ఉండాలి? అనే మౌలిక ప్రశ్నలు ఈ కేసుల సందర్భంగా తలెత్తుతున్నాయి. ఉప ఎన్నికలు ముందు పెట్టుకుని జగన్‌ను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అని కొందరంటారు. ఈ చర్య వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని మరి కొందరు విశ్లేషిస్తుంటారు.

ఇంత కాలం అరెస్ట్ చేయకుండా సి.బి.ఐ. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసిందని మరికొందరు ప్రశ్నిస్తారు. ఇవన్నీ నిజ మే! జగన్‌ను అరెస్ట్ చేయడంలో సి.బి. ఐ. జాప్యం చేసి ఉండవచ్చు. ఆ విషయం ప్రశ్నించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. లోపం జరిగి ఉంటే సంజాయిషీ ఇవ్వవలసిన బాధ్యత సి.బి.ఐ. పైన ఉంటుంది. అంతేగానీ, జగన్‌పై చర్యల వల్ల తలెత్తే పరిణామాల గురించి ఆలోచించవలసిన అవసరం చట్టాలు, వ్యవస్థలకు ముఖ్యంగా న్యాయస్థానాలకు లేదు. జగన్‌కు సంబంధించి ఒక విషయంలో సమాజానికి, వ్యవస్థలకు స్పష్టత రావలసిన అవసరం ఉంది. అది ఏమిటంటే ఆయనను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చూడాలా? లేక ఆర్థిక నేరస్థుడిగా మాత్రమే చూడాలా? ఈ విషయం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్లు రాజకీయ పార్టీలు పెట్టుకున్నంత మాత్రాన, లేదా ప్రజల్లో వారికి ఆదరణ ఉన్నంత మాత్రాన చట్టాల నుంచి రక్షణ ఏమీ ఉండ దు.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యాపారవేత్తలపై చర్య లు తీసుకోవడం లేదా? అటువంటి సందర్భాలలో వారి ఆధీనంలోని పరిశ్రమలు, సంస్థలు దెబ్బతిం టే అందుకు ప్రభుత్వాలు, సమాజం ఎందుకు బాధ్యత వహించాలి? జగన్ విషయంలో కూడా ఇంతే! అవినీతికి పాల్పడిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేయడం వల్ల ఆయన పార్టీ లాభపడినా, నష్టపోయినా వ్యవస్థలు, సమాజం ఎందుకు ఆందోళన చెందాలి? జగన్‌ను ఆర్థిక నేరస్థుడిగానే చూడాలిగానీ, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా పరిగణించాలని ఏ చట్టంలోనూ లేదు. ఆర్థిక నేరస్థుల పట్ల ఇటు సమాజం, అటు వ్యవస్థలు ఉదారంగా వ్యవహరిస్తే అది మనకు మనం చేటు కొనితెచ్చుకోవడమే అవుతుంది.

ఉదాసీనత వల్ల ఏమి జరుగుతుందో న్యాయమూర్తి పట్టాభి రామారావు రూపంలో చూశాం! గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తులు తమ వద్ద ఉన్న అక్రమ సంపదతో ఎవరినైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అదే జరిగితే ఈ దేశ న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఏమి విశ్వాసం ఉంటుంది? వారికి దిక్కు ఎవరు? ఎమ్మార్ కేసు విషయమే తీసుకుందాం! ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు గరిష్ఠంగా వంద కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సి.బి.ఐ. తన చార్జిషీటులో పేర్కొంది. ఇది చిన్న మొత్తం కాకపోయినా గాలి, జగన్ కేసులతో పోల్చితే ఇది బహు స్వల్పం. అయినా ఎమార్ కేసులో కోనేరు ప్రసాద్, ఐ.ఎ.ఎస్. అధికారి బి.పి.ఆచార్య వంటి వాళ్లు కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి వలె కోట్లు విరజిమ్మగలిగి ఉంటే వారికి కూడా బెయిల్ వచ్చి ఉండేదని ప్రజలు భావిస్తే తప్పు పట్టవలసింది ఏమీ లేదు! ఓబుళాపురం మైనింగ్ కేసులోగానీ, అక్రమాస్తుల కేసులోగానీ ప్రధానంగా లాభపడింది గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలే! వీరికి సహకరించిన నేరానికి పలువురు జైలు పాలయ్యారు. భారీగా ప్రయోజనం పొందిన వారి పట్ల ఉదారంగా వ్యవహరించి, వారికి సహకరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని న్యాయవ్యవస్థ మాత్రం ఎలా సమర్థించుకోగలదు! అవినీతి విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు అత్యం త క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది కనుక, పనిలో పనిగా న్యాయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయడానికి పూనుకుంటే ఈ దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. లేనిపక్షంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారు జైలులో మగ్గుతూ ఉంటే, గాలి, జగన్ వంటి వాళ్లు స్వేచ్ఛగా విహరించే ప్రమాదం ఉండనే ఉంది. లంచం తీసుకుని గాలికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి పట్టాభి రామారావు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సి.బి.ఐ.ని అభినందించకుండా ఉండలేం!

ఈ విషయం అలా ఉంచితే, అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన పక్షం నుంచి, ప్రత్యర్థి పక్షం నుంచి రకరకాల వాదనలు వస్తున్నాయి. జగన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తల్లి శ్రీమతి విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నా రు. ఆమె కల త చెందడాన్ని అర్థం చేసుకోవచ్చు. కన్న కొడుకు ఎం తటి దుర్మార్గుడైనా శిక్షించబడినప్పుడు ఏ తల్లి అయినా రక్తం పంచి జన్మనిచ్చినందుకు బాధపడుతుంది. విజయలక్ష్మి విషయానికి వస్తే, ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె చేస్తున్న ఆరోపణలతో మొత్తం వ్యవహారం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగుతున్నదని స్పష్టం అవుతున్నది. నిజానికి ఉప ఎన్నికలకు ముందే జగన్ అరెస్ట్ అయి తే సానుభూతి పవనాలు వీచి తమ గెలుపు సునాయాసం అవుతుందని యువజన, శ్రామిక, రైతు పార్టీ నేతలు లోలోపల కోరుకున్నారు. తనను అరెస్ట్ చేయబోతున్నారని జగనే స్వయంగా ప్రకటించుకున్నారు.

తాను అరెస్ట్ అయితే పార్టీ తరఫున తన తల్లి ప్రచారం చేస్తారని కూడా జగన్ ఎప్పటినుం చో చెప్పుకుంటున్నారు. అంటే, ఈ అరెస్ట్ ఊహించని పరిణామం ఏమీ కాదు. అయితే.. దివంగత రాజశేఖర్‌రెడ్డి సతీమణి గా, ఒక సాధారణ గృహిణిగా శ్రీమతి విజయలక్ష్మి పట్ల ఇప్పటివరకు అందరికీ గౌరవం ఉండేది. కానీ, తన భర్త మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర ఉందని ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ఆరోపణలతో ఆమె కూడా సాదాసీదా రాజకీయవేత్తగా, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని స్పష్టం అవుతోంది. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని చెప్పడం పనికి వస్తుందేమోగానీ, ఇందులో హేతుబద్ధత కనిపించడం లేదు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి అత్యంత విధేయుడిగానే వ్యవహరించారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉభయుల మధ్య పొరపొచ్చాలు తలెత్తిన దాఖలాలు ఏమీ లేవు. అయినా, కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రకు పాల్పడి, తన భర్తను చంపించిందని శ్రీమతి విజయలక్ష్మి ఆరోపిస్తే నమ్మడం ఎలా? ఇక్కడ ఒక విషయం ఆమె స్పష్టం చేయాలి. తన భర్త మరణం వెనుక కుట్ర ఉందని ఆమెకు ఎప్పుడు అనుమానం కలిగింది? తన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకునే వరకు ఆమెకు అనుమానం ఎందుకు రాలేదు? ముందునుంచి ఈ అనుమానం ఉండి ఉంటే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, ఆయన నియోజకవర్గమైన పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై కొంత కాలంపాటు ఆ పార్టీ సభ్యురాలిగా ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత శ్రీమతి విజయలక్ష్మిపై ఉంది.

శ్రీమతి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనని కాసేపు అనుకుందాం! అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా చలామణి అవుతున్న రాజశేఖర్ రెడ్డినే చంపించగలిగిన వారికి తమ అధికారానికే సవాల్‌గా మారిన జగన్‌కు హాని చేయడం కష్టం ఎందుకవుతుంది? విజయలక్ష్మిగానీ, మరొకరుగానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధ ఆరోపణలు చేసుకుంటూపోతే ప్రజల మనస్సులు కూడా కలుషితం అవుతాయి. అదే జరిగితే, భవిష్యత్‌లో తాము నిజాలు చెప్పినా జనం నమ్మని పరిస్థితి వస్తుంది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే ఎంతగా పతనం అవ్వాలో అంతగా పతనం అయ్యాయి.

ఇకపై మరింతగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లే ప్రమాదం పొంచి ఉంది. సి.బి. ఐ. కాంగ్రెస్ చేతిలో పావుగా మారి జగన్‌ను వేధిస్తున్నదని తల్లీ కూతుళ్లు శ్రీమతి విజయలక్ష్మి, షర్మిల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇది కూడా నిజమేనని అనుకుందాం! అలాంటప్పుడు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సి.బి.ఐ. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనీ, దాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరనీ సర్టిఫికెట్ ఇవ్వడంపై వీరు ఏమి సమాధానం చెబుతారు? రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపక్షాల ఆరోపణలపై చాలా ఉదారంగా సి.బి.ఐ. విచారణకు ఆదేశించేవారు. అందులో భాగంగానే పరిటాల రవి హత్యపై కూడా సి.బి.ఐ.తో విచారణ జరిపించారు.

ఆనాటి విచారణలో జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని తేల్చారు. విజయలక్ష్మి ఆరోపణల ప్రకారమైతే, ఆనాడూ సి.బి.ఐ.ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రభావితం చేయించి జగన్‌కు క్లీన్ చిట్ పొందారని భావించవలసి ఉంటుంది. తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినంత కాలం మంచిదైన సి.బి.ఐ. ఇప్పుడు వారికి చేదుగా మారడం సహజం. కేంద్ర ప్రభుత్వం ఆడించినట్టుగా సి.బి.ఐ. ఆడుతుందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. బహుశా ఆ ఉద్దేశంతోనే కాబోలు, పలు సందర్భాలలో రాజశేఖర్ రెడ్డి సి.బి.ఐ. విచారణకు ఆదేశించి క్లీన్‌చిట్ పొందారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఒక తప్పు చేసింది.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మాయా వ్యాపార సామ్రాజ్యంపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఈ ఆరోపణలపై సి.బి.ఐ. విచారణకు ఆదేశించి ఉంటే తాము కోరుకున్న విధంగా నివేదిక ఇచ్చి ఉండేవారేమో? ఈ విషయం వారికి ఎందుకు తట్టలేదో? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెట్టడం వల్ల రాజకీయంగా ప్రయోజనం లభించవచ్చునేమోగానీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చట్టాల నుంచి తప్పించుకోలేరు.

ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తన కుమారుడు అక్రమ సంపాదనతో రాజసౌధాలు నిర్మించుకోవడంతో పాటు, వేల కోట్ల రూపాయల మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్న విషయం శ్రీమతి విజయలక్ష్మికి తెలియదా? తోటకూర దొంగలించిననాడే మందలించి ఉంటే అన్నట్టుగా ఆదిలోనే జగన్‌ను నివారించి ఉంటే ఇప్పుడు తన కొడుకు జైలు పాలయ్యాడని ఆవేదన చెందే పరిస్థితి ఆమెకు ఉండేది కాదుకదా! ఒక రాజకీయ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా కూడా ఉన్న శ్రీమతి విజయలక్ష్మి ఆ బాధ్యతను విస్మరించి కేవలం పుత్ర వ్యామోహానికే పరిమితం అవుతున్నారు.

జగన్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్న వారందరూ అంతకుముందు జరిగిన అరెస్ట్‌లపై నోరు మెదపకపోవడం శోచనీయం. వాన్‌పిక్ వ్యవహారంలో లబ్ధిపొందారో లేదో తెలియదుగానీ, బలహీనవర్గాలకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కూడా జైలు పాలయ్యారు. జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ జైలు జీవితం గడుపుతున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే ఎందరో ఉన్నారు. మరికొంత మంది తోడు కావొచ్చు. అక్కడిదాక ఎందుకు, వల్లమాలిన విధేయతతో జగన్‌కు సహకరిస్తూ వచ్చిన విజయ సాయిరెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు శ్రీమతి విజయలక్ష్మి ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న ఉండనే ఉంది.

కుమారుడిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నా, దీక్ష చేసిన శ్రీమతి విజయలక్ష్మి అండ్ కో ప్రస్తుత కేసులలో ఎంతోమంది అరెస్ట్ అయినా ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఎమార్ కేసుగానీ, ఓబుళాపురం మైనింగ్ కేసుగానీ, అక్రమాస్తుల కేసుగానీ ప్రధానంగా లాభపడింది ఎవరు? ఏ ఒత్తిళ్లు లేకుండానే అధికారులుగానీ, మరొకరుగానీ తప్పుడు పనులు చేశారా? వాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నప్పుడు జాలి పడనివాళ్లు జగన్ విషయంలోనే ఎందుకు జాలి పడాలి? ఐ.ఎ.ఎస్. అధికారులు శ్రీలక్ష్మి, బి.పి.ఆచార్యకు కూడా కుటుంబాలు ఉన్నాయి.

కాకపోతే వారు రాజకీయాల్లో లేరు కనుక వారి కుటుంబ సభ్యులు వీధి నాటకాలు ప్రదర్శించ లేదు. తెలిసో తెలియకో, కాసులకు కక్కుర్తిపడో, ఒత్తిళ్లకు తలొగ్గో తప్పు చేసిన ఎందరో శిక్ష అనుభవిస్తున్నప్పుడు... రాష్ట్ర సంపదను లూటీ చేసి గరిష్ఠంగా లాభపడిన గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి వారికి మరింత పెద్ద శిక్ష అవసరం లేదా? న్యాయమూర్తి పట్టాభి రామారావు ఉదంతంతో ఈ ఇరువురు 'న్యాయాన్ని' కూడా కొనుక్కోగలరని తేట తెల్లమైంది కనుక, ఇటువంటి వారి విషయంలో సమాజమే అప్రమత్తంగా ఉండాలి. తాత్కాలిక భావోద్వేగాలకు లోనైతే మన భవిష్యత్తుకు మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది. ధర్మోరక్షతి రక్షితః అన్నట్టు వ్యవస్థలను నీవు కాపాడితే వ్యవస్థలు నిన్ను కాపాడతాయి. ఇందుకు భిన్నంగా వ్యవస్థలను ధ్వంసం చేసేవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

అదే సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి గాలి, జగన్‌లను దోషులుగా రుజువు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న సి.బి.ఐ. అధికారులకు నైతిక బలం ఇవ్వడానికై వారికి అండగా నిలబడాలి. నిజాయితీపరులను గుర్తించి గౌరవించకపోతే ఇకపై అలాంటి వాళ్లు మిగలరు. రాష్ట్రంలో మూడేళ్ల క్రితం జరిగిన దానికి ప్రస్తుతం కాంగ్రె స్ పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. ఇకపై ప్రజలే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా బెయిల్ పొందడానికి కోట్ల రూపాయలు వెదజల్లగలిగే వారి పట్ల ఇటు పౌర సమాజం, అటు వ్యవస్థలు కఠినంగా వ్యవహరించకపోతే దేవుడు కూడా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడలేడు!
- ఆర్కే

Friday, May 25, 2012

స్ఫూర్తి కొరవడిన పంచాయతీలు

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతున్నాయి? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి   దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే.

కారణాలు ఏమైనప్పటికీ, ఈ రోజు పల్లెల్లో పల్లె మాట, ఆట, పాట; పల్లె ప్రేమ-అనురాగాలు అన్నీ మసిబారి పోయాయి. మానవీయ విలువలు, నిజాయితీ, కష్టించే తత్వానికీ, నిస్వార్థానికీ నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడ్డ పల్లె యువత నేడు మద్యం మత్తుకు బానిసలవుతున్నట్లే, అవినీతి రాజకీయాలకూ బానిసలవుతున్నారు. స్త్రీలపై హింస, అణచివేత, అసహనం, వివక్ష రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు పంచాయతీలనూ వాటిని నడిపించే ప్రెసిడెంట్ల పనితీరునూ ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కక్ష సాధింపులూ, ఓట్ల రాజకీయాలూ తప్ప అభివృద్ధి లక్ష్యంగా సాగాల్సిన స్థానిక పాలన కోసం చేసిన పంచాయతీ రాజ్ చట్టాల స్ఫూర్తి దెబ్బతిన్నది. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో ముఠా తగాదాలు పెరిగి విభజించి పాలించే తత్వం వేళ్ళూనుకుంటున్నది.

ఏ కొంచెం చదువు, జ్ఞానం వున్న వాళ్ళైనా, పల్లెలు బాగుంటే భారతదేశం బాగుంటుంది అని నమ్మే పెద్ద మనసున్న వాళ్ళైనా-పల్లెల గురించి ఆలోచించటం అంటే పంచాయతీల పనితీరు చర్చించటమే! మనకున్న చట్టాలు చాలా గొప్పగా ఉన్నట్లే పంచాయతీరాజ్ చట్టం కూడా ఎంతో గొప్పగానే తీర్చి దిద్దుకున్నాం. కానీ పంచాయతీలు నడుస్తున్న తీరు గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఏలుతున్న నీతిబాహ్యమైన, పార్టీ రాజకీయాలకు ఎంత మాత్రం తీసిపోదు. పంచాయతీ ప్రెసిడెంట్‌లు, ఆయా గ్రామాల్లో ఒక చిన్నపాటి గూండా రాజ్యాన్ని తయారు చేస్తున్నట్లే కనిపిస్తుంది! వారి వారి పార్టీలని బతికించుకోడానికి, బలోపేతం చేసుకోడానికి, ఓట్లు పెంచుకోడానికి సీట్లు రాబట్టుకోవడానికే పనిచేస్తున్నారు తప్పించి, పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తి అమలుకావటం లేదు. పంచాయతీలని నడిపిస్తున్న ప్రెసిడెంట్లు, ఆర్థిక సామాజిక దోపిడీలకు పాల్పడుతుంటే పట్టించాల్సిన, పట్టించుకోవాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థ స్తబ్దుగా తయారైంది.

గుంటూరు జిల్లాలోని ఒకానొక గ్రామంలో ఆ ఊరి ప్రెసిడెంట్, తన పార్టీకి చెందని గ్రామస్తులని కనీసం పలకరించడు కూడా! అదే గ్రామంలో, వేరే పార్టీకి చెందిన ఒక పేద కుటుంబం, టైలర్ పని చేసుకుంటూ కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటోంది. అటుగా వెళ్తున్న ఊరి ప్రెసిడెంట్ - ఎప్పుడూ పలకరించిన పాపాన పోనివాడు, ఆగి మరీ అడిగి ఇసుక ఎక్కడినుంచి వస్తుందో కనుక్కుంటాడు. అంతే, తెల్లారితే కప్పు వేయాల్సిన ఇంటిపని కాస్తా అర్ధంతరంగా ఆగిపోతుంది. ఎందుకంటే సమయానికి రావాల్సిన ఇసుక లారీ, ప్రెసిడెంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్‌తో ఎక్కడో సీజ్ చెయ్య బడింది! అదే ఊరిలో ఇద్దరు అత్తా కోడళ్ళు గొడవపడితే, ముసలి అత్తను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసినప్పటికీ కోడలికి మద్దతు పలికితే ఎక్కువ ఓట్లు వస్తాయని లెక్క వేసుకుని, కోడలికే వత్తాసు పలుకుతాడు.

అందుబాటులోకి వచ్చిన రాయితీలను ఉపయోగించుకుని వాగులో మట్టి తవ్వి అమ్ముకోవటం, సొంత చేన్లో లెక్కకు మించి స్కీముల కింద బావుల్ని తవ్వుకుని మట్టి అమ్ముకోవటం, ఊరికోసం వచ్చిన ప్రభుత్వ పథకాలన్నీ పొల్లుపోకుండా సొంత పార్టీ వాళ్ళకి వాడి డబ్బు చేసుకోవటం మొదలైన విషయాల్లో అందె వేసిన చెయ్యి అతనిది.

ఊరికి ప్రెసిడెంట్ కాక ముందు మామూలు రైతు, ప్రెసిడెంట్ అయ్యాక మూడేళ్ళు కూడా తిరక్కుండానే లక్షాధికారి! అవతల పార్టీ సానుభూతిపరుల కుటుంబాలను రాచి రంపాన పడేయటం, పేద కుటుంబాలు అయితే ప్రభుత్వ పథకాలని రానీయకుండా చేయడం -కొంచెం ఆర్థిక స్వావలంబన ఉన్న కుటుంబాలు అయితే వారికి ఆదాయాన్నిచ్చే మార్గాలకి పూర్తి స్థాయి అంతరాయం కల్పించటం, దాని కోసం ఎంతటి దగుల్భాజీ పనైనా చేయటం అతని కర్తవ్యంగా నెరవేరుస్తాడు.

ఆ గ్రామంలో సెంటు భూమి ఖాళీ ఉండదు. పిల్లలు ఆడుకొనే ఆట స్థలం ఉండదు. వీధి దీపాలు విధిగా వెలగటం 40 ఏళ్ళుగా ప్రశ్నార్థకం. కాని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతాయి- బెల్టుషాపు ఓనర్లకి; ఏడాదికోసారి అంగరంగ వైభవంగా (రాజకీయ పార్టీల) పే రుతో ఊరబంతులు పెట్టి, తాగబోయించి, రికార్డు డ్యాన్సులు పెట్టిస్తారు. ఎవరి కోసమో అనుకుంటున్నారా- అన్నీ త్యజించి, త్యజించమని లోకానికి ఎలుగెత్తిచెప్పిన సాధువు వీరబ్రహ్మం గారికి! ఓట్ల కో సంపడే పాట్లలోభాగమని చెప్పకుండానే ఆయనకో గుడి కట్టిస్తారు...

ఆ ఫలానా రాజకీయ పార్టీ అనుయాయుడుగా మారి జనాన్ని తన అప్రజాస్వామిక పద్ధతుల్లో పంచాయతీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి, భయ భ్రాంతులకి గురిచేయటమే కాక, అమాయక రైతులని, పేద వాళ్ళని, యువతని తన అవినీతిలో నెమ్మది నెమ్మదిగా భాగస్వాములని చేసుకుంటున్నాడు. 'ఎవడు మాత్రం కడిగిన ముత్యం? తింటే తిన్నాడు -ఎంతో కొంత మాకూ ఇస్తున్నాడు కదా, పని కూడా చేస్తున్నాడు కదా!' అనే వాళ్ళ సంఖ్య పెంచుతున్నాడు. ప్రజాస్వా మ్యం అంటే ప్రజల గొంతు, వారి ఆకాంక్ష అనుకునే ప్రజాస్వామ్య వాదులకు 'ప్రజలతోనే బుద్ధి చెప్పించే' ప్రయత్నమే ఇది.

ఈ అవినీతి రాజకీయ నేతలు పల్లెల్లో ప్రెసిడెంట్ల నుంచి పట్నాల్లో బడా రాజకీయ నాయకుల దాకా ప్రజలని కూడా అవినీతిలో భాగస్వాములను చేస్తున్నారు. కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్య తప్పించి, పంచాయితీ ప్రెసిడెంట్ల తీరు దాదాపుగా రాష్ట్రమంతటా ఇదే తీరు అని చెప్పుకోవడంలోఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే జిల్లాల పేర్లు, పార్టీ పేర్లు మారొచ్చు. అంతే తేడా!

రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ప్రెసిడెంట్ తన ఊరిలోని ఒక రేప్ కేసులో నిందితుడిని కాపాడడానికి చెయ్యని సాహసం లేదు. పోలీస్ కేసుని వాపసు తీసుకోమని ఒత్తిడిపెంచడం దగ్గరినుంచి, పోలీసులతోటే బెదిరించడం, ఊరి జనాన్ని ఎగతోయడం, 'మా ఊర్లో ఏమైనా జరిగితే ముందు మా దృష్టికి రావాలిగాని, పోలీసుల దృష్టికి ఎందుకు పోవాలి?' అనే ప్రశ్నలు సంధించడం, ఊరిలో ఎట్లా తిరుగుతారో చూస్తాం అని బెదిరించడం, ఏ పార్టీకి సంబంధం లేని ఒక సేవా సంస్థ మీద 'వారు అవతలి పార్టీకి సానుభూతి పరులు, అందుకే మన మీద కేసు పెట్టారు' అని అబద్ధపు ప్రచారం చేయటం వగైరా అన్నీ చేశాడు.

ఇదంతా ఎందుకు చేశాడు అంటే, పంచాయతీ ప్రెసిడెంట్‌కి, నిందితుని పట్ల ప్రేమా కాదు, బాధితుల పట్ల ద్వేషమూ లేదు - ఓట్ల కోసం అదొక లెక్క! ఆ గ్రామంలో ఆ నిందితునికి సంబంధించిన సామాజిక వర్గానికి ఎక్కువ నోట్లున్నాయి! అతని దృష్టిలో ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే, కాళ్ళ బేరానికొచ్చి, ఊరి పెద్దకి చెప్పుకుని నాలుగు పైసలు పరిహారంగా తీసుకొని వెళ్ళి పోవాలే తప్ప అతని ఓట్ల లెక్కలకి అడ్డు వచ్చి, పోలీసులకి చెప్పి, కోర్టులకెక్కి చట్టం న్యాయం అని వాపోతే ఆ ప్రెసిడెంట్ ఎట్లా ఏడిపించాలో అట్లా ఏడిపిస్తాడు.

నల్లగొండ జిల్లాలో ఒక తండా. 15 ఏళ్ళ గొర్రెల కాపరి. ఆ వయసులోనే ఊరి మగపిల్లల దాష్టీకానికి గురైంది. ఆరు నెలలు నిండేవరకు ఏమీ అర్థం కాలేదు. పొట్ట పెరిగిందని తల్లి డాక్టర్‌కి చూపిస్తే విషయం తెలిసింది. ఇంటికి తీసుకొచ్చి బిడ్డని తల్లీ తండ్రీ ఇద్దరూ కొట్టి చంపారు. విషయం ఊరిలో అందరికీ తెలుసు. ప్రెసిడెంట్‌కి కూడా తెలుసు. సమాచారం పోలీసులకి చేరదు! చట్టం దృష్టికి పోదు... 'గర్భిణిని పూడ్చకూడదు, ఊరికి అరిష్టం అనే మూఢనమ్మకాన్ని మాత్రం ఊరి వాళ్లు తుచ తప్పక అమలుచేయటానికి ఊరి ప్రెసిడెంట్ జనంతో మమేక మవుతాడు.

ఎక్కడినుంచో పోలీసులకు ఉప్పందితే తప్ప, అంత భయంకరమైన హత్య, ఒక ఇంటి గుట్టు, ఊరి పరువు ప్రతిష్ఠగానే మిగిలిపోతుంది. ప్రజల పేదరికాన్నే కాదు, మూఢనమ్మకాలనీ ఓట్ల రాజకీయాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మద్యం మత్తు కాకుంటే మరో మత్తు. జనాన్ని మానవ హక్కులు, నిజాయితీ, మహిళల సమానత్వం, మానవీయ విలువలు, అలాంటి అవగాహనకి ఎంత దూరంగా ఉంచితే అంతకాలం వాళ్ల ని ఓట్ల రాజకీయాలకి అవినీతికి అంత సులువుగా వాడుకోవచ్చు! ఈ సత్యా న్ని మాత్రం పంచాయితీ ప్రెసిడెంట్లు వారి వారి ప్రధాన రాజకీయ పార్టీ నేతల అడుగుజాడల్లో, వారి అండదండలతో ఆసాంతం అవగతం చేసుకుని, నిష్ఠగా అమలుపరుస్తున్నారు.

చాలా చోట్ల కుల సంఘాల నాయకులే ఊరి పెద్దలు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా. కుల సంఘాల నాయకులు తమ తమ కులాల సామాజిక న్యాయం కోసం పోరాడటం హర్షించాల్సిందే . అణచివేత, వివక్ష, హింస, దారిద్య్రం, దోపిడీ, హక్కుల హననం ఎక్కడున్నా ఎదిరించాల్సిందే! వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే, ఆయా పోరాటాల్ని ప్రజాస్వామ్య వాదులు ఎల్లప్పుడూ బలపరుస్తున్నారు. కాని ఈ కుల సంఘాల నాయకత్వాలకు కూడా ఓట్లు, సీట్లు, అధికారం చేజిక్కించుకోడానికే వ్యూహాలు ఎత్తుగడలు ఉంటున్నాయి తప్ప ఆయా కులాల్లో జరుగుతున్న బాల్య వివాహాలు, వరకట్న దాహాలు, హత్యలు, పరువు పేరుతో హత్యలు, మహిళలపై హింస, వివక్ష లాంటి దారుణాలను ఆయా కుల సంఘనాయకులు ఏనాడైనా పట్టించుకుని మాట్లాడారా? మాట్లాడరు.

రాజ్యాధికారం చేజిక్కే వరకు నోళ్ళు విప్పరు అని అనుకోవాలా? వారే గనక వారి కులాల్లో ఆడవాళ్ళ సమస్యల మీద న్యాయ బద్ధంగా మాట్లాడి, వారి వారి కులాల్ని ప్రభావితం చేసి ఉంటే ఇన్ని ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న హత్యలు జరిగి ఉండేవా? వారి వారి కుటుంబాల్లో ఆడపిల్లలకి, స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల్ని పట్టించుకోకుండా, వారి కులాలకి సామాజిక న్యాయం కోరే నాయకత్వాల నిజాయితీని శంకించకుండా ఎలా ఉండటం? ప్రధానంగా బాల్య వివాహా లు, కుటుంబ హింస, ఆడపిల్లల పట్ల వివక్ష ఎన్ని చట్టాలొచ్చినా ఎం తటి నిజాయితీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నా చట్టం ఎంత పటిష్ఠంగా ఉన్నా సమస్యకు కొంత మాత్రమే ఉపశమనం.

కులసంఘాల నాయకులూ పంచాయతీ ప్రెసిడెంట్లు కులపెద్దలూ, బస్తీ నాయకు లూ బాధ్యులు కానంత కాలం స్త్రీలపై హింస పెరుగుతూనే ఉంటుంది. గ్రామాలలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, బయటకురాని మహిళల హత్యలు ఎన్నో ఉన్నాయి. చాలా భాగం కేసులు తొక్కి పెట్టి ఉంచటంలో ఊరి ప్రెసిడెంట్, కుల పెద్దల పాత్ర అధికం. కొన్నిచోట్ల పోలీసులు కూడా, వీరిని ఎదిరించే సాహసం చేయరు. కుల సంఘాల నాయకులే పంచాయతీ ప్రెసిడెంట్లు అయినప్పుడు మరింతగా వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశముంది.

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతుంది? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే. తమ తమ పంచాయతీ ప్రెసిడెంట్‌లను, అనుబంధ కుల సంఘాలను కేవలం గ్రామాల్లో ఓట్లు సమకూర్చే ప్రతినిధులుగా కాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని దాని స్ఫూర్తిని అందుబాటులోకి తెచ్చే నేతలుగా ఎదిగేలా సహాయపడాలి.
- అంకురం సుమిత్ర
వ్యాస రచయిత్రి, సామాజిక కార్యకర్త

Friday, May 4, 2012

హిందూరం?

Tirupati-Balaj 

వరస వెంట వ…రస తప్పులో కాలేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కేంద్రబిందువుగా మళ్లీ మొదలయిన మరో వివాదం ఆయనను చివరకు హిందూమతానికి వ్యతిరేకిగా ముద్రవేసే ప్రమాదం తెచ్చింది. బుధవారం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన జగన్‌, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందన్న డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న సరికొత్త వివాదానికి తెరలేపి నట్టయింది. గతంలో సాంకేతికంగా పార్శీ అయిన ఇందిరాగాంధీ, సిక్కు మతానికి చెంది న రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్‌ కూడా తిరుమలలో డిక్లరేషన్‌ ఇచ్చారు. అదేవిధంగా జగన్‌ కూడా తిరుమలలో డిక్లరేషన్‌ ఇస్తారని భావించారు.

కానీ ఆయన అందుకు తిరస్కరించి, వైఎస్‌ గతంలో ఎప్పుడూ డిక్లరేషన్‌ ఇవ్వలేదని, పైగా స్వామివారికిపట్టు వసా్తల్రు కూడా సమర్పించారని వాదించారు. అదేవిధంగా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఏనాడూ డిక్లరేషన్‌ ఇవ్వనప్పుడు తానెందుకు ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. దానితోపాటు అనుచరులు చేసిన నినాదాల హడావిడి భక్తులను చికాకు పరిచింది. జగన్‌ తనది సోనియాగాంధీ స్థాయి అని చెప్పుకోవడాన్ని అటుంచితే, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే ఏమవుతుందని హిందు మత సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. చాలాకాలం నుంచి జగన్‌ను క్రైస్తవుడిగానే భావిస్తామని, ఆయన కుటుంబ సంప్ర దాయాలు క్రైస్తవమతానికి సంబంధినవే కాబట్టి జగన్‌ను రెడ్డిగా పరిగణించబోమని సీనియర్‌ నేతలు జెసి దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డి బాహాటంగానే వాదిస్తూ వస్తున్నా రు.

ఈ నేపథ్యంలో వారి విమర్శలకు తెరదించేందుకయినా జగన్‌ తనకు హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే బాగుండేదని హిందూ ధార్మిక సంస్థలు వాదిస్తున్నాయి. ఇప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వలేదు కాబట్టి ఆయనను హిందువులంతా క్రైస్తవుడిగానే భావించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ జీవించినప్పుడు ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేసేందుకు ప్రయత్నించి, ఆ మేరకు ఒక జీఓ కూడా ఇవ్వడం ఇప్పుడు జగన్‌ చర్య ద్వారా మళ్లీ చర్చనీయాంశమయింది. శ్రీ వెంకటేశ్వరుడి పరిధిని ఏడు కొండల నుంచి రెండు కొండలకు కుదించి, అక్కడ జగన్‌ బావ బ్రదర్‌ అనిల్‌ సారధ్యంలో తొలుత ఒక పెద్ద చర్చి నిర్మించి, ఆ తర్వాత అక్కడ వ్యాపార కేంద్రం నిర్మించాలని ప్రయత్నించిన వైనంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికిన విషయం తెలిసిందే.

YSR-Cong-Flag 

వైఎస్‌ ప్రయత్నాలను వ్యతిరేకించిన నాటి ఒక సీనియర్‌ మంత్రి రాత్రికి రాత్రే చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి తిరుమలను మీరే కాపాడాలని అభ్యర్ధించారు. తర్వాత టీడీపీ తన ఆందోళన ద్వారా రెండుకొండలకు కుదించే వైఎస్‌ ప్రయత్నాలను అడ్డుకోవడం తెలిసిందే. తాజా పరిణామాలు జగన్‌ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారన్న భావన హిందూ వర్గంలో మొదలయింది. నైవేద్యం గంట కొట్టకముందే జగన్‌ వైకుంఠం నుంచి ఆలయంలోకి వచ్చి రంగనాయక మంటపంలో కూర్చోవడాన్ని హిందూ మతస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని ద్వారా ఆయన నైవేద్యాన్ని కూడా అపవిత్రం, అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వారి వెంట కార్యకర్తలు, అనుచరులు సహజంగా వస్తుంటారని..

ఈ విషయంలో జగన్‌ను తప్పు పట్టవలసిన పనిలేదంటున్నారు. అయితే జగన్‌తో వచ్చిన అనుచరులు ఆయనకు జిందాబాదులు కొట్టడం స్వామిని అవమానించడమేనని స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప, అన్యుల కీర్తన సంప్రదాయా నికి, మతానికి విరుద్ధమని గుర్తు చేస్దున్నారు. కాగా జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని వైకాపా నేతల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వివాదాలు మంచివి కాదంటున్నారు. మతం చాలా ప్రమాదకరమైన అంశమని, దానితో ఆడుకుంటే కష్టాలు కోరితెచ్చుకోవడమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఒకవేళ జగన్‌ తమ నేత జగన్‌ అంతా అనుకున్నట్లు క్రైస్తవుడే అయినప్పటికీ తనకు హిందూ మత విశ్వాసాలపై గౌరవం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే హిందువుల్లోనూ ఆయనపై గౌరవం, అభిమానం పెరిగేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ అధికారులు మూడుసార్లు కోరినా డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో.. జగన్‌ తనను తాను క్రైస్తవుడినని అంగీకరించినట్టయిందని, దానివల్ల పార్టీ హిందువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీల నిరసనలు
తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతోంది. శాసనసభలో టీడీపీ సభాపక్ష నేత దాడి వీరభద్రరావు హిందూ మత సంప్రదాయాలు, సంస్కృతిని జగన్‌ అవమానించారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వకుండా దౌర్జన్యంగా లోపలికి వెళ్లడం హిందువులను అవమానించడమేనని, ఇది హిందువుల మనోభావాలను అగౌరవపరచడమేనని స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ తిరుమల నిధులను తన నియోజకవర్గానికి తరలించారని, ఇప్పుడు జగన్‌ దృష్టి తిరుమలపై పడిందని, ఇకపై ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుమలను నాలుగుసార్లు దర్శించుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ డిక్లరేషన్‌పై సంతకం చేశారని, గతంలో ఇందిరాగాంధీ కోరి మరీ డిక్లరేషన్‌పై సంతకాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. సోనియా నాలుగుసార్లు వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు నరేష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ హిందువులను అవమానించారన్నారు. అటు బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం చేసి ఉండాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ స్పష్టం చేయగా, టీటీడీ మూడుసార్లు కోరినా జగన్‌ సంతకం పెట్టకపోవడం ఏమిటని, ఒక సంతకం పెడితే పోయేదేముందని బీజేపీ నేత సామంచి శ్రీనివాస్‌ ప్రశ్నించారు.


- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్

కాపు కాస్తున్నాయ్‌!

kapu 
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలపై అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నేశాయి. సీమాం ధ్రలో ప్రధాన సామాజిక వర్గమైన కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ దన్ను కోసం మూడు పార్టీలూ పరితపిస్తు న్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన సాగుతోన్న రెడ్డి సామాజికవర్గం జగన్‌ వైపు వెళుతోందన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం వారికి ప్రత్యామ్నాయంగా అంతకంటే మూడింతల సంఖ్యాబలం ఉన్న కాపు, బలిజలకు చేరువయేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి కాపు-బలిజను దువ్వే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ తర్వాత బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి కూడా ఇచ్చి రాయలసీమలో బలిజలకు చేరువయింది. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధి కంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న కాపులకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా పావులు కదుపుతోంది. రాయలసీమలో కడప, చిత్తూరులో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న బలిజలకు చేరువయేందుకు ఆయా కుల నేతలను ప్రోత్సహిస్తోంది. నెల్లూరులో కూడా బలిజల హవా ఎక్కువే. తాజా ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం కాపులకు, తిరుపతి బీసీ బలిజలకు ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వం ఆ ప్రయోజనాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో పొందాలని భావిస్తోంది. ఇక చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.

అందుకే కాపు, బలిజ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవిని ప్రచారంలోకి దింపాలని నిర్ణయించింది. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లా, ప్రధానంగా విజయవాడ నగరంలో దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయడు వంగవీటి రాధా ఇటీవల వైకాపా తీర్ధం తీసుకోవడంతో కలవరపడిన కాంగ్రెస్‌.. ఆయనతో పాటు కాపులు చేజారకుండా ఉండేందుకు ఆ వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. అందులో భాగంగా యాదవ వర్గానికి చెందిన మంత్రి పార్ధసారథి ఇటీవల కాపు నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాపులు కాంగ్రెస్‌లోనే ఉంటారని, రాధా పార్టీ మారినప్పటికీ ఎన్నాళ్ల నుంచో రంగాతో ఉన్న కాపులు మాత్రం జగన్‌ పార్టీలో చేరరని పార్ధసారథి సమక్షంలోనే కాపు నేతలు భరోసా ఇచ్చారు. కాపులంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

చిరంజీవికి పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తోందని గుర్తు చేశారు. కోస్తాలో కాపులు జగన్‌ వైపు వెళ్లకుండా నిరోధించడంతో పాటు, తన వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్‌ తన ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కాపు-బలిజ వర్గంపై కన్నేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు తనతో కొనసాగిన కాపు-బలిజ సామాజికవర్గాన్ని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరని ఆ సామాజికవర్గాన్ని దరిచేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా, రాయలసీమలో రాజంపేట, రాయచోటి, తిరుపతిలో బలిజ తూర్పు గోదావరిలో రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాపులకు, అనంతపురంలో అనంతపురం అర్బన్‌లో బలిజకు అవకాశం ఇచ్చారు. ఆ మేరకు కాపు-బలిజ సంఘ నేతలు బాబును అనంతపురంలో కలసి తమ వర్గానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ వర్గానికి చెందిన అభ్యర్ధులను గెలిపించుకోవడంతో పాటు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. సీమలో మొదటి నుంచీ టీడీపీకి బలిజలు సంప్రదాయ ఓటు బ్యాంకుగానే ఉన్నారు. కోస్తాలో కాపులు పూర్తి స్దాయిలో లేనప్పటికీ కాంగ్రెస్‌-టీడీపీకి చెరిసగం మద్దతునిచ్చేవారు. చిరు పార్టీ పెట్టిన తర్వాత ఆ సమీకరణలో మార్పు వచ్చిన నేపథ్యంలో, తిరిగి ఆ సామాజికవర్గాల ఓటు బ్యాంకు కోసం టీడీపీ వ్యూహరచన చేయడంతో పాటు, దానిని కార్యాచరణలో పెట్టింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాపులను దువ్వే పనిలో ఉంది. విజయవాడలో వంగవీటి రాధా చేరికతో ఆ ప్రాంతంలో కాపులకు చేరువ కావాలని యోచిస్తోంది.

తూర్పు గోదావరిలో ఇప్పటికే జ్యోతుల నెహ్రు వంటి కాపు నేతలు పార్టీలో ఉన్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు చాలామంది జగన్‌ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ పద్మనాభం వంటి అగ్రనేత కూడా జగన్‌తో కలసి నడిచారు. అయితే జగన్‌ ఒంటెత్తు పోకడలు, వన్‌మ్యాన్‌షో నచ్చని ముద్రగడ వైకాపా నుంచి పక్కకు తప్పుకున్నారు. చిరంజీవి, చంద్రబాబునాయుడు ఆ రెండు జిల్లాల్లో కాపులపై దృష్టి సారిస్తుండటంతో జగన్‌ వైపు వచ్చేవారు తక్కువయిపోతున్నారు. కానీ, కోస్తాలో కాపులను ప్రోత్సహించడం ద్వారా అధికారంలోకి సులభంగా రావచ్చని జగన్‌ అంచనా వేస్తున్నారు.
- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌

Sunday, January 22, 2012

* డా. మైసూరారెడ్డి - Inner View

 http://www.tv5news.in/en/politics/photos/2549/mysura.jpg
మైసూరమ్మ మీదుగా మైసూరారెడ్డి
మైసూరారెడ్డిని బాగా ఎరిగినవాళ్లతో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం కొంత అర్థమవుతుంది. ఆయనకు జనాన్ని ఆకర్షించేంతటి వాగ్దాటి లేకపోయినా, సబ్జెక్టును స్టడీ చేసి మెప్పించే ఓపిక ఉంది. ఈగోయిస్ట్‌గా కనబడినా, ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో ఉన్నా ‘రాజకీయం’ చేయరు. ఫ్యాక్షన్ గొడవలకు దూరం పాటిస్తారు. పైగా సెన్సిటివ్. అందువల్లే ఆయన గౌరవనీయ నాయకుడయ్యారు. అయితే ఈ లక్షణాలే ఆయన్ని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా చేశాయా? ‘ఎక్కడో పల్లెటూళ్లో పుట్టి, ఈ స్టేజ్‌కు వచ్చినాము కదా, ఇది చాలదా!’ అంటారు. 
  కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరా ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి 2004లో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే...http://desiboost.com/telugu/wp-content/uploads/2011/04/mysoora-reddy-300x267.jpg
 
మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి మా అబ్బ నిడిజివ్వికి ఇల్లటం వచ్చినాడు. మా వూల్లల్లో తండ్రి తండ్రిని అబ్బ అంటాము. తల్లి తండ్రిని తాత అంటాము. మా తండ్రి చనిపోయేంతవరకు అన్‌అపోజ్డ్‌గా గ్రామ సర్పంచిగా చేసినాడు. మా అమ్మ అన్నగారు(మాజీ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ ఊటుకూరి రామిరెడ్డ్డి) కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చినాడు. అలా మొదట్నుంచీ రాజకీయాలతో సంబంధాలుండేవి.

ప్రొద్దుటూరు దగ్గర తాళమాపురం అనే ఊరుంది. అక్కడ ఉన్న గ్రామదేవత మైసూరమ్మ. అందుకే మైసూరయ్య, మైసూరప్ప, మైసూరమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు మీదనే నాకూ మైసూరారెడ్డి అని పెట్టినారు. మానాన్న కూడా బాలమైసూరారెడ్డి. బయటి ప్రాంతాల్లో ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదో మైసూరు ఉంది కదా, అదేమో అనుకుంటారు.


మేము నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు చెల్లెళ్లు. అందర్ల్లోకీ నేనే పెద్దోణ్ని. నిడిజివ్విలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల స్కూలు. గొప్పలకు ఎందుకు పోవాల? యావరేజ్ స్టూడెంట్‌నే. తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివిన. అప్పట్లో దాన్ని డబ్బా రేకుల కాలేజీ అనేవాళ్లు.



 












 
ఫీజులేని డాక్టరుగా...
మా కుటుంబంలోగానీ, మా బంధువుల్లోగానీ ఎవరూ పెద్ద చదువు చదివింది లేదు. మా తండ్రి కోరిక ఏమంటే నేను డాక్టర్ చదవాలని. ఎంబీబీఎస్ డొనేషన్ కోసం లెక్క కూడా కూడబెట్టినాడు. గుల్బర్గాలో అయితే ఐదువేలు, కాకినాడలో అయితే పదివేలు. అయితే నాకు 82 శాతం మెరిట్ మీదనే కర్నూలు కాలేజీలో సీటు వచ్చినాది.

హౌస్ సర్జెన్సీ అయిపోతానే ఐదు సంవత్సరాలు ఎర్రగుంట్లలో ప్రాక్టీస్ చేసినాను. పరీక్ష చేయిచ్చడమూ, వాళ్లకు కావాల్సిన మందులో, ఇంజెక్షన్లో రాయిచ్చడమో చేసేవాణ్ని. కన్సల్టేషన్ ఫీజు తీసుకునేది లేదు. మొదట్నుంచీ ఉన్నోళ్లమే కాబట్టి, వాళ్లిచ్చే రెండ్రూపాయలో, మూడ్రూపాయలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది నాకు కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రాక్టీస్ మానేసినాను. కొందరైతే సలహా గూడా ఇచ్చినారు, ‘రోజూ ఓ గంటన్నా ప్రాక్టీస్ చేయగూడదా’ అని. న్యాయవాది రాజకీయాల్లో ఉన్నాగని ఫరవాలేదు. డాక్టర్‌కు ఏడ కుదురుతుంది? క్లైంట్ వెయిట్ చేస్తాడుగానీ పేషెంట్ ఆగలేడు కదా!


పుస్తకం చదువుకుని బాధ్యతలు తెలుసుకున్నా...

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కాబట్టి, మెడికల్ కాలేజీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉంటి. తండ్రి చనిపోయిన తర్వాత ఊరికి సర్పంచ్‌గా చేసినాను. తర్వాత కమలాపురం సమితి అధ్యక్షుడిగా పదివేల ఓట్లతో గెలిచినా(1981-85). అప్పుడు నాకు 32 ఏళ్లు. చిన్నవయసుగదా ఏం చేస్తాడో, ఎట్ల చేస్తాడో అని అందరికీ అనుమానముండె.

స్థానిక సంస్థల విధులేమిటి, ప్రెసిడెంటుగా ఏం చెయ్యాలి, అని రూల్స్ బుక్కు తీసుకోని చదివి, ఫస్ట్ మీటింగుకు పోతనే అధికారులతో మాట్లాడినా. అందులో ఉన్న బాధ్యతల ప్రకారం రివ్యూ చేసి, ‘ఫలానా చోట ఉంది చూసుకోలేదా?’ అనంగనే, ‘ఓయమ్మ ఈయన అసాధ్యుడే’ అనుకున్నారు. గ్రామాల్లో తిరగటం, మట్టిరోడ్లు వేయించటం, చదువు చెప్తాండారా లేదా అని స్కూళ్లు ఇన్‌స్పెక్ట్ చేయడం... అట్ల మంచిపేరే వచ్చింది.


స్టేజ్ ఫియర్‌తోనే రాయలసీమ ఉద్యమంలోకి...

ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వం తెలుగుగంగ పనులు మొదలుపెట్టింది. తెలుగుగంగ పేరు మీద నెల్లూరుకు, మద్రాసుకు దొంగదారిన నీళ్లు పోతాయి, రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయం మొదలైంది. ‘రాయలసీమ విమోచన సమితి’ అని మొదలుపెట్టి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, లక్కిరెడ్డిపల్లె రాజగోపాలరెడ్డి, బద్వేలు వీరారెడ్డి రాయలసీమంతా పర్యటిస్తాన్నరు(కొంతకాలానికి రా.వి.స. ఆగిపోయింది. తర్వాత రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి బలం పుంజుకుంది).

ఎన్.శివరామిరెడ్డి, ఎన్.సి.గంగిరెడ్డి, మాసీమ రాజగోపాలరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు, అందులో సీపీఐ, కాంగ్రెస్, అన్ని పార్టీలవాళ్లున్నరు. ‘యువకుడు కదా, ఓపిగ్గా తిరుగుతాడు, అఖిలపక్షం కన్వీనర్‌గా మైసూరారెడ్డిని పెడదాం’ అని పెద్దవాళ్లంతా నిర్ణయించినారు. అయితే నాకు స్టేజ్ ఫియరుండేది. ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అరగంట ఆలోచించి ప్రిపేర్ అయ్యేవాణ్ని. తర్వాత స్టేజి మీద మాట్లాడడం అలవాటయ్యింది.


పోతిరెడ్డిపాడు సామర్థ్యం పదివేల క్యూసెక్కులు పెట్టినారు. దాని సామర్థ్యం పెంచాలనేది ప్రధాన డిమాండు. తర్వాత శ్రీశైలం కుడికాలువ చిత్తూరు జిల్లాకు పొడిగించాలనీ, ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, కృష్ణానది నికర జలాల్లో వాటా కావాలనీ, రేణిగుంట నుంచి గుంతకల్లుకు రైల్వే డబ్లింగ్ లైన్ కావాలనీ, కడప ఆకాశవాణిని అభివృద్ధి చేయాలనీ, థర్మల్ స్టేషన్ కావాలనీ డిమాండ్లు పెరిగిపోయినాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం కోరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నొక్కి చెబుతున్నా... రాష్ట్రంలో ఉంటూనే అభివృద్ధి కావాలనుకున్నాం.


పాదయాత్రలు ఎట్ల జేస్తారు?

ఉద్యమంలో భాగంగా రాయలసీమ ఉద్యోగుల సంఘాలతో కలిసినాం. యూనివర్సిటీ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థులను కూడగట్టినాం. పత్రికల ఎడిటర్లను కలిసి సమస్యలు ఏమిటో వివరించినాం. నాలుగు జిల్లాల్లో ధర్నాలు చేసినం. సభలు జరిపినం. అయితే డిమాండ్లను ఎట్ల ప్రజల్లోకి తీసుకొనిపోవాల? పాదయాత్ర చేస్తే గ్రామగ్రామాన చెప్పొచ్చు కదాని ఆలోచించినాం.


మరి పాదయాత్రలు ఎట్లా జేస్తారు? ఏదో మఠాధిపతులు చేయడము చూసినాముగానీ రాజకీయ నాయకులు పాదయాత్ర ఏరకంగా చేస్తారో తెలీదు కదా! గాంధీజీ దండి సత్యాగ్రహం బుక్కు గూడా సంపాదించి చదివినా. ఏయే ఊర్లున్నాయి, ఎట్ల నడవాలి, ఎక్కడ ఆగాలి అని ప్లాన్ వేసినాం. తిరుపతి నుంచి కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా పోతిరెడ్డిపాడు వెళ్లాలని ఐడియా. ఇదే వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పినాం. ఎంవీ రమణారెడ్డి కూడా మంచి ఆలోచనే అన్నాడు. అప్పుడింకో సమస్యొచ్చింది. ఇంతమంది నాయకులు ఎట్ల వెళ్లడం?


అందుకే మరో ఆలోచన జేసి, తిరుపతి(నేను), లేపాక్షి(వైఎస్), కళ్యాణదుర్గం(రమణారెడ్డి), ఆదోని(రఘునాథరెడ్డి), కదిరి(సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి) నుంచి ప్రారంభమయ్యేట్టుగా ఐదు గ్రూపులు చేసినాం.
అన్ని గ్రూపులూ నంద్యాలలో కలిసి ఆడనుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్లాలనేది ఆలోచన. అదే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు నాంది అని చెప్పుకోవచ్చు. రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. ఒకరోజు 18 రావొచ్చు, ఒకరోజు 22 రావొచ్చు, కాని మొత్తంగా 420 కిలోమీటర్లను 22 రోజుల్లో పూర్తిచేయాలి.

వెంబడి టెంట్లు, భోజనాలు ఇలా ఏమీ తీసుకెళ్లింది లేదు. కొంచెం పెద్ద గ్రామం చూసుకోవడం, అక్కడే గ్రామస్తులు వండిపెట్టిన పులగమన్నమో, పప్పో తినడం, బడి లాంటిది చూసుకుని పడుకోవడం... వెళ్తూ గ్రామస్తులకు సమస్యలు అర్థమయ్యేట్టు జెప్పడం... దీంతో రాయలసీమ ఉద్యమానికి ఒక ఊపొచ్చింది. తర్వాత వివిధ దశల్లో, వివిధ ప్రభుత్వాల్లో మేము పెట్టిన డిమాండ్లు చాలామట్టుకు పూర్తవుతూ వచ్చినై.

http://www.thehindu.com/multimedia/dynamic/00114/HY10MYSOORA_REDDY_114968e.jpg
బొక్కల దవాఖాన
సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలైంది. అది సహజంగానే రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. అందువల్లే కమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నిక సేఫ్ ల్యాండింగ్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ హవా ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి సీతారామయ్య మీద 35,000 మెజారిటీతో గెలిచినాను(1985).

పాత బిల్డింగులో శాసనసభ మొదటి సమావేశం. బీజేపీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతున్నాడు. నిజాం ఆర్థొపెడిక్ హాస్పిటల్ గురించిన అంశం అనుకుంటా. బొక్కల దవాఖాన అన్నాడు. ఇదేంది బొక్కలు అంటాండడు అనుకున్నా. ‘ఏంది ఇంద్రసేన్ ఏదో బొక్కలు అంటివి?’ అని అడిగితి. ‘బొక్కలు బొక్కలు అవే బోన్స్’ అన్నాడు. ఓహో, శాసనసభలో మన భాష మనం మాట్లాడుకోవచ్చు!


రాయలసీమ భాషంటే జంకూగొంకు ఉండే. ఉంటాదిగదా! అప్పట్నుంచీ భాష ఏం మాట్లాడతాండరు అని ఎప్పుడూ ప్రాధాన్యం ఇయ్యలే. వాళ్లు మాట్లాడేదాంట్లో సబ్జెక్టుందా లేదా ఇదే చూస్తాంటి. తర్వాత మైసూరారెడ్డి మాట్లాడితే సామెతలు, పిట్టకథలు చెబుతాడని నా భాష కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు ఏదైనా కొత్త అంశం మాట్లాడగలమా? అని ఆలోచన జేస్తా. ఒకసారి రాజ్యసభలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది.


అందులో అస్సెట్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నింది. ఏందిరా అనంటే హైకోర్టు జడ్జీలు, కిందిస్థాయి జడ్జీలు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తేమో రాష్ట్రపతికిస్తాడు. ఇవన్నీ ఎలా ఇస్తారు? సీల్డు కవర్లలో! అందరూ సీల్డు కవర్లలో ఇస్తే ఇంగేంటికి? ఇంట్లో బీరువాలో పెడితే పోతాదిగదా అని పాయింట్ లేవనెత్తినాను. దాంతో బిల్లు వెనక్కిపోయింది. అప్పుడు బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ‘రెడ్డీ, హౌ డిడ్ యు గెట్ దట్ పాయింట్? అర్ యు యాన్ అడ్వొకేట్ ఆర్ వాట్?’ అన్నారు.

http://www.aircargonews.com/FT10/Mysoora-Reddy.gif
చీటీలో మంత్రిపదవి
అప్పుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కాకి మాధవరావు ఆయన పర్సనల్ సెక్రటరీ. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రాజభవన్‌లో ప్రమాణస్వీకారం అయిపోయి, గ్రూప్‌ఫొటో అయిపోతానే, ‘పోండి, మీ పోర్టుఫోలియోస్ ఆ రూములో ఉన్నాయి చూసుకోపోండి’ అన్నాడు మాధవరావు. వినూత్నంగా ఉండాలని వాళ్లు రాత్రే చీటీల్లో రాసిపెట్టినారు. ఆ రూములో కొంచెం లైటింగ్ తక్కువుంది. చూస్తే హోమ్ అని ఇంగ్లీషులో నాలుగక్షరాలే కనపడినాయి.

బయటికి వస్తానే చెంగారెడ్డి, అడ్వకేట్‌గదా, ‘ఏమయ్యా హోంమంత్రీ, సీఆర్‌పీఎఫ్ తెలుసునా, ఐపీఎస్ తెలుసునా’ అనే. యాదో తెలిసినకాడికి తెలుసులే, లేకపోతే వాళ్లే నేర్పిస్తారుగదాంటి. (లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి) అప్పటికి అది అంత ప్రాధాన్యత గల శాఖ కాదు. మావాళ్లంతా గూడా ఇదేంటికి, చిన్న శాఖైనా సరే ఇంకేదైనా మార్పించుకో అన్నారు. సర్లేబ్బా ఏదో ఇచ్చినారు, దాన్నే మెప్పించేట్టు పనిచేసుకుందాం అంటి.


నేదురుమల్లి నన్ను హోం మినిస్టర్‌గా ఎంపిక చేయడమే కాకుండా, ఫ్రీహ్యాండ్ ఇచ్చినాడు. నిజాయితీపరున్నని ఆయనకు ప్రత్యేక అభిమానం. అప్పుడు ఐజీ(లా అండ్ ఆర్డర్) వీరనారాయణరెడ్డి ఉండే. దూరపు బంధువు గూడా. ఏదో మీటింగ్ అయిపోయాక చనువుకొద్దీ
‘హోంమంత్రి అయినావుగదా, రాయలసీమ ఆందోళనలో నిన్ను చిత్తూరులో లాకప్‌లో ఏసి కొట్టినాడుగదా, ఆయన గుర్తున్నాడా? ఆయనదేమైనా పనివుంటే జేస్తావా?’ అన్నాడు. రూల్స్ ప్రకారముంటే ఆయనకొచ్చేది ఆయనకిద్దామంటి. ఆయన ప్రమోషన్ పెండింగులో ఉండే. ఓకే చేస్తి. దాంతో నేనేదైనా నార్మ్స్ ప్రకారం చేస్తానని పోలీసుల్లో అభిమానం పెరిగింది.

అట్లనే అప్పుడు నక్సల్స్ యాక్టివిటీస్ ఎక్కువ. ల్యాండ్‌మైన్స్‌లో పోలీసులు చనిపోతాండిరి. దాంతో పోలీసుల్లో భయం ఉంటుండె. చనిపోయినా వాళ్ల శాలరీ కంటిన్యూ అయ్యేట్టుగా నిర్ణయం తీసుకుంటిమి. అలాగే ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటే ఆ ప్రమోషన్ శాలరీ ఇచ్చేది. రిటైర్ అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేట్టు చేస్తిమి. ప్రాణం ఇవ్వలేముగాని ఉద్యోగ భద్రత కల్పించినాం. దాంతో పోలీసుశాఖలో గౌరవం పెరిగింది. ఈ విధానాన్నే తర్వాత కేంద్రం ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో అమలుచేస్తోంది.

















వైఎస్ నన్ను ‘డాక్టర్’ అని సంబోధించేవారు
రాజశేఖరరెడ్డిని నేను ‘సార్’ అనీ, ‘ఏమండీ’ అనీ పిలిచేవాణ్ని, ఆయన నన్ను ‘డాక్టర్’ అని పలకరించేవారు. కడపలో అందరమూ కాంగ్రెస్‌వాళ్లమే అయినా కందుల ఓబుల్‌రెడ్డిది ఒక వర్గం. బద్వేలు శివరామకృష్ణయ్య, రఘురామిరెడ్డి, నేను... మేమంతా వైఎస్ వర్గం. అయితే 1989,90 ప్రాంతం నుంచి నాకూ, వైఎస్‌కూ కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది.

అయినాగూడా వైఎస్ నా రెండో కుమారుడి పెళ్లికి వచ్చినాడు. ఒకసారి అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒకే ఫ్లైట్‌లో వస్తుంటే కలిసినాము. కరువు ప్రాంతాలకోసం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. నేను పశువుల గడ్డి, తాగునీరుకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పాను. అదే అనుకుంటా ఆయన్తో చివరిసారి మాట్లాడటం.


ఎదుగుదలకు పరిమితి ఏముంది?

కొన్ని కారణాల వల్ల నేను 2004లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లాను. అక్కడ కూడా నా గౌరవం నాకుంది. పార్టీనుంచే గదా రాజ్యసభకు వెళ్లాను. గల్లీనుంచి ఢిల్లీస్థాయిలో పేరు తెచ్చుకోవడానికి పార్టీ అవకాశం ఇచ్చిందిగదా!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiQ4aHsGyMVVD0OCuK17KsRZnmXnYKxnSTWlQUVRQId3aUIh7pEJ79RjUj_ZatjrVNrEBh6Dz2XIbhbEKtNsOx_tpfIE-3NcJCigH2UaZETxTaCqSEXbrCySRV_PDbWzMD1NjfID-96LCw/s1600/newspics+mysoora+babu.JPG
రాజకీయాల్లో ఎదుగుదలకు పరిమితి అంటూ ఏముంది? ఎంతైనా ఎదగొచ్చు. నేను ఎదగాల్సినంతగా ఎదిగానా అన్నదికాదుగానీ నాకైతే ఏ రకంగానూ అసంతృప్తి లేదు. పరిస్థితులు, ప్రభావాలవల్ల కొందరు కొన్నిసార్లు ముఖ్యమంత్రులు కూడా అయినారు. నసీబ్ అంటారు కదా అది కూడా ఉండాలి. నిబంధనలకు లోబడి నేను ఏం చేయగలనో అది చేయడానికే ప్రయత్నించినాను. ఏనాడూ ఏడ్చిందీ లేదు, అయ్యో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఒకరిని బాధపెట్టినామే అనుకున్నదీ లేదు. వాళ్లెవరో అంత ఎదిగినారు అని కాకుండా, రైతు కుటుంబంలో పుట్టి ఇంతదాకా వచ్చినాము కదా అనుకుంటాండ.

ప్రొఫైల్...

పూర్తి పేరు : మూలె వెంకట మైసూరారెడ్డి
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, బాల మైసూరారెడ్డి
జన్మదినం : 28.2.1949
జన్మస్థలం : కడప జిల్లా నిడిజివ్వి
వృత్తి : కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు.
భార్య : స్వరూప
పిల్లలు : ఇద్దరు కుమారులు; హర్షవర్ధన్‌రెడ్డి, రఘుకార్తీక్‌రెడ్డి (ఒకరు ఇంజినీరింగ్, మరొకరు డిగ్రీ చదివారు. మైనింగ్ బిజినెస్‌లో ఉన్నారు.)
నియోజకవర్గం : కమలాపురం
ఎమ్మెల్యే : 1985-94; 1999-2004
హోం, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ : 1990-94
సందర్శించిన దేశాలు : చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.
ప్రస్తుతం : 2006 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడు

సైడ్‌లైట్
ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో మైసూరా రెండున్నరేళ్ల మనవడు శ్రీతన్ ‘అబ్బా’ అంటూ వచ్చి, ఆయన ఒళ్లో కూర్చున్నాడు. ‘ఇదేం పేరు సర్?’ అంటే, ఇప్పుడందరికీ యాడలేని పేరుగావాలిగదా, అని నవ్వారు. వెంకటేశ్వరస్వామికి ఇదో పేరని తర్వాత చెప్పారు.

పర్సనల్ ట్రివియా...


విద్యార్థి దశలో సినిమాలు అవీ చూసేవాణ్ని. పేక కూడా బాగా ఆడేవాణ్ని. రాజకీయాల్లోకి వచ్చాక రెండూ పోయాయి.

నచ్చే నాయకుడిగా గాంధీజీ పేరే చెబుతాను. ఆయనకున్న దూరదృష్టి సామాన్యమైనది కాదు.
పుస్తకాలు చదువుతానుగానీ సాహిత్యాభిలషతో కాదు. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేవే చదువుతాను.
గాడ్‌ఫాదర్లంటూ ఎవరూ లేరు, సంఘటనలే నన్ను మలిచాయి.
మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అంతకుముందు మా కుటుంబాలకు బంధుత్వం ఏమీ లేదు. అమ్మాయిని చూశా, నచ్చింది, చేసుకున్నా.
ఏ భర్తకైనా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లకైతే భార్య సహకారం తప్పనిసరి. ఇంట్లో రొద ఉంటే, బయట ఎలా తిరుగుతాం? ఆ విషయంలో ఆమె పూర్తి సహకారం అందించింది.
ఇద్దరబ్బాయిలకూ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కనబడటం లేదు. నేనూ వారిని బలవంతపెట్టి తేవాలని అనుకోవట్లేదు.
ఎక్కడ పుట్టినానో, ఎక్కడ పెరిగినానో అక్కడ ఇప్పటికీ మాకు ఇల్లుంది. జిల్లాకు పోతే ఇప్పటికీ రాత్రికి ఊర్లోనే ఉంటాను.
నేను ఆస్తికుడినీ కాదు, నాస్తికుడినీ కాదు. ఇంట్లోవాళ్లు మాత్రం పూజలవీ చేసుకుంటాంటరు.
విదేశాల్లో ఏదో గొప్ప అభివృద్ధి జరుగుతుందన్న భ్రమ నాకు లేదు. చైనాలో అవినీతి లేదంటారుగానీ నాకు అక్కడే ఎక్కువ ఉన్నట్టు కనబడింది.
అన్నివేళలా నాకు అండగావుండే బంధువులు, మిత్రులే నా బలం. 

- సాక్షి Daily

Saturday, January 14, 2012

పందెం పోరులో రాజకీయ పుంజులు

 

కొక్కొరొ... కొ.. అంటే కొట్లాట
పందెం పోరులో రాజకీయ పుంజులు
ఓట్లు బెట్ కాస్తూ జనం ముందుకు
పొలిటి'కోళ్లు' 

ప్రత్యర్థులపై విచ్చు కత్తులు
తమలో తామే 'కూల్చే ఎత్తులు'
కాంగ్రెస్ బరిలో అనేక కోళ్లు
టీడీపీ, టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ఫైట్
ఎన్నికలు రాక ముందే బరిలోకి
కళ్లలో కసి... కదలికలో వ్యూహం... కత్తిగట్టిన కాలిదెబ్బ... అబ్బో! బరిలో దిగిన పందెం కోళ్ల పౌరుషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. సంక్రాంతి అంటేనే కొ... క్కొ...క్కొరోకో... కోళ్ల పందేలు! ఇది ఏడాదికో పండగ! కానీ... రాజకీయ పందెం కోళ్లకు నిత్యం సంక్రాంతే! చాన్స్ చిక్కిందంటే... కొట్టుకోవడమే! ఈకలు పీక్కోవడమే! ఈ పొలిటికల్ కోళ్లు ప్రత్యర్థి కోళ్లపై విరుచుకుపడుతుంటాయి. మైకులు పట్టుకు నమిలేస్తుంటాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పందెం కోళ్లు ఒకదానిపై ఒకటి మీదపడి రక్కేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ కోళ్లు కూడా కాలి వేళ్లకు కత్తులు కట్టుకుని ఎగురుతుంటాయి. ఇలా పార్టీల మధ్య జరిగే పందేలు ఒకవైపు... ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం కొట్టుకునే కోళ్లు మరో వైపు! మొదటిరకం పందేలు అందరికీ తెలిసినవే. రెండో రకం కోళ్ల పందేలు మాత్రం తెరవెనుక జరుగుతుంటాయి. ఈ కోళ్లు అదను చూసుకుని 'కత్తి గోరు' విసిరేందుకు వేచి చూస్తుంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా... అన్ని పార్టీల్లోనూ ఈ కుమ్ములాటల కోళ్లు ఉన్నాయి. ఇక చూసుకోండి వాటి రక్కిసలాట...

కాంగ్రెస్‌లో ఎన్నెన్ని కోళ్లో..
ఎక్కడైనా, ఏ బరిలోనైనా ఒక బరిలో, ఒకే సమయంలో రెండు కోళ్లే కొట్టుకుంటాయి. కానీ... కాంగ్రెస్ బరి తరీఖానే వేరు. ఒకేసారి ఆరేడు కోళ్లు బరిలోకి దిగి కీచులాడుకుంటాయి. ఒకే కోడి మీదికి నాలుగైదు కోళ్లు కాలు దువ్వుతాయి. అలాగని ఆ నాలుగైదు కోళ్లు కలిసి మెలిసి ఉంటాయా అంటే అదీ లేదు. ప్రధాన పోటీ మాత్రం... సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సల మధ్యే ఉంటుంది. బరిని విచ్చలవిడిగా ఏలుదామని వచ్చిన కిరణ్‌కు బొత్స పెను సవాల్‌గా మారారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దలను కదలడం, కిరణ్‌ను ఇరుకున పెట్టేలా గుడిసెపైకి ఎక్కి 'కొక్కొరొకో' అనడం బొత్సకు షరా మామూలే.
vestrana

అయితే... మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులతో బొత్సను డిఫెన్స్‌లో పడేయడంలో కిరణ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక 'కోడి' కొంత దారిన వచ్చిందని అనుకునేలోపే... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరింత పెద్ద కత్తులు కట్టుకుని దిగారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎంను 'అంశాల' వారీగా నిలదీసినట్లు కనిపించినప్పటికీ... పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిరూపించుకోవడమే రాజనర్సింహ అసలు లక్ష్యం.
అత్యంత ముఖ్యమైన తెలంగాణ అంశంపైనా పార్టీ వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రకటించడం, తరచూ ఢిల్లీకి వెళ్లి తన 'ప్రయత్నాలు' సాగించడం ద్వారా రాజనర్సింహ బరిలోని 'పెద్ద కోడి'కి చికాకు తెప్పిస్తున్నారు. బరిని ఏలేందుకు చేతిలో కర్చీఫ్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక చిరంజీవి, నాదెండ్ల మనోహర్ కూడా బరిలో ఉన్నప్పటికీ... కిరణ్‌తో హోరాహోరీగా మాత్రం పోరాడటంలేదు. 'టైమ్ వస్తే దూకుదాం' అని వేచి చూసే రకం! మంత్రి శంకర్రావు వంటి 'చిలిపి కోళ్లు' ఉండనే ఉన్నాయి. అయితే... కాంగ్రెస్ బరిలో ఎప్పుడు, ఏయే కోళ్లు కీచులాడుకుంటాయనేది ఎప్పుడూ ఆసక్తికరమే!
'దేశం' పుంజుల కోలాహలం
తెలుగుదేశం బరిలో రకరకాల కోళ్లు కొట్టుకుంటున్నాయి. టీడీపీ తెలంగాణ ఫోరం బరిలో ఒకవైపు ఎర్రబెల్లి దయాకర రావు, మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు! పైకి గాయాలు కనిపించకుండా కొట్టుకోవడమే వీరి 'ఫైట్' ప్రత్యేకత. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌గా తనకే గుర్తింపు రావాలన్నది ఎర్రబెల్లి ఆరాటం. కేసీఆర్‌పై గొంతు చించుకుని, మేడెక్కి అరిచేది తాను కాబట్టి, తనకే 'పెద్ద కోడి'గా పట్టం కట్టాలనేది మోత్కుపల్లి పోరాటం! అయితే... ఈ రెండు కోళ్లకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మోత్కుపల్లిలా గట్టిగా అరవలేకపోవడం ఎర్రబెల్లి బలహీనత. ఎర్రబెల్లి స్థాయిలో సమన్వయ నైపుణ్యం లేకపోవడం మోత్కుపల్లి వీక్‌నెస్.

తెలుగుదేశం 'ఫ్యామిలీ' బరిలోనూ కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. 'పెద్దకోడి' చంద్రబాబుకు తెలుగుదేశం బరిని మరో పదేళ్లపాటు ఏలగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ... 'నెక్ట్స్ ఎవరు?' అనే అంశంపై తేల్చుకునేందుకే పోరు సాగుతోంది. అయితే... ఈ పోరు ఇతర ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంతా అంతర్గతమే. ఈ పోరు బరిలో ఉన్నది ఎవరో కాదు! అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణలే! భవిష్యత్ రాజకీయాలపై వీరిమధ్య అపార్థాలునెలకొన్నాయి. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం బరిని సిద్ధం చేయాలని హరికృష్ణ ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.

ఇందుకు బాలకృష్ణ అడ్డొస్తాడన్నది ఆయన భయం. బాలయ్య తన అల్లుడైన నారా లోకేశ్‌నే ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే, ఇటీవల బాలయ్య 'కూత' ఈమధ్య జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ మధ్య హరికృష్ణ, బాలకృష్ణ పరస్పరం మాట్లాడుకోవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు చూడటమే మానేశారు.

టీఆర్ఎస్‌లో మామా అల్లుళ్ల సవాల్
టీఆర్ఎస్‌లోనూ తెలుగుదేశం తరహా కోళ్ల పందెమే జరుగుతోంది. అటు తెలంగాణ బరిలో, ఇటు టీఆర్ఎస్ పార్టీ బరిలో ఇప్పుడు కేసీఆర్ మాటకు ఎదురే లేదు. ఆయనే నెంబర్ వన్! 'నెంబర్ 2' కోడి ఎవరో తేల్చుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్య పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో హరీశ్‌వర్గం, కేటీఆర్ వర్గం అనే విభజన వచ్చింది.
http://images.blogs.hindustantimes.com/dabs-and-jabs/post/KCR.jpg
కేటీఆర్‌తో పోల్చితే... పార్టీని నడపడం, వ్యూహ రచనలు, సమన్వయ సాధనలో హరీశ్‌రావుకే ఎక్కువ మార్కులు పడతాయి. కానీ... పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అవకాశం ఎక్కువ సందర్భాల్లో కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్‌కే దక్కుతోంది. దీనిపై హరీశ్‌లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోకున్నప్పటికీ... గ్రూపులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య పార్టీలోని 'చిన్న కోళ్లు' నలిగిపోతుండటం మాత్రం నిజం.

'దేశం'పై జగన్ గురి

ఇదో చిత్రమైన బరి! ఈ పార్టీలో పెద్ద కోడి జగన్. అయితే... రాష్ట్ర రాజకీయ పోరు మాత్రం జగన్ పార్టీ చుట్టూనే తిరుగుతోంది. 2014లోపు జగన్‌ను బలహీనం చేస్తే తనకు ఎదురేలేదని చంద్రబాబు... బాబును దెబ్బతీస్తే అధికారం తనదేనని జగన్ భావిస్తున్నారు. అత్యంత చిత్రంగా... ఈ పోరులో అధికార కాంగ్రెస్ బరి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇరుప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడిందని జగన్, చంద్రబాబు భావిస్తుండటమే దీనికి కారణం. టీడీపీలోని ప్రధాన పందెం కోళ్లన్నీ జగన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాయి.

డేగ కళ్లు, వాడి కాళ్లు వేసుకుని... చిన్న అవకాశం దొరికినా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. జగన్ కూడా అంతే! తాను కేసుల్లో ఇరుక్కోవడంతో చంద్రబాబుపైనా తన తల్లితో కేసులు వేయించారు. విషయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లారు. తనపైనా, తన తండ్రిపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా, దాని మూలాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి... అధికార పార్టీ అస్త్ర సన్యాసం చేయగా, రెండు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

బహు బరులు... బడా కోళ్లు
కిరణ్ - జగన్, కిరణ్ - చంద్రబాబు, చంద్రబాబు - కేసీఆర్... ఇలా బడా కోళ్ల మధ్య భారీ పోరాటమే జరుగుతోంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో... ఇక తనకు తలుపులు మూసేసినట్లేనని జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేశారు. ఆ క్షణం నుంచి కిరణ్‌ను బలహీనం చేయడంపై దృష్టి సారించారు. పథకాలు మూలనపడ్డాయని ప్రతి సభలో తిట్టిపోయడం ఇందులో భాగమే. అవిశ్వాసం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావించినప్పటికీ... ఈ విషయంలో కిరణ్‌దే పైచేయి అయ్యింది. సామాజిక వర్గం, ప్రాంతం, ఎమ్మెల్యేల మధ్య తమ పట్టు నిలుపుకొనేందుకు కిరణ్, జగన్ మధ్య పోరు జరుగుతూనే ఉంది.

ఇక, తెలంగాణలో చంద్రబాబును బలహీన పరచాలని కేసీఆర్... టీఆర్ఎస్‌ను ఎంతోకొంత నిలువరించాలని చంద్రబాబు పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. టీడీపీని దెబ్బతీస్తే తెలంగాణలో 80 శాతం సీట్లు స్వీప్ చేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. ఆ చాన్స్ ఇవ్వకుండా... తెలంగాణలో కొన్ని, సీమాంధ్రలో భారీగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే... టీఆర్ఎస్, టీడీపీ కోళ్ల మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. 'నువ్వొకటంటే నేను నాలుగంటా' అన్నట్లుగా పోటా పోటీ ప్రెస్ మీట్లు, విమర్శలు! రాజకీయ బరిలో ఇదో రసవత్తర పోరు!

ఈ కోళ్లూ ఉన్నాయ్...

రాజకీయ కోళ్ల పందెంలో సీపీఎం, సీపీఐ బాగా వెనుకబడ్డాయి. 2004-09 మధ్య కాళ్లకు కత్తులు కట్టుకుని వీరోచితంగా పోరు సాగించిన సీపీఎం ఈ మధ్య కాలంలో అస్త్ర సన్యాసం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌లతో వెళ్లలేక... జగన్‌తో జట్టుకట్టే విషయంపై తేల్చుకోలేక... అత్యంత అయోమయంలో పడింది. సీపీఎంతో పోల్చితే సీపీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 'పుంజు కోడి' నారాయణ నోరే ఈ పార్టీకి కొండంత బలం. వారూ వీరని కాకుండా, ఎవ్వరిపైనైనా ఇంతేసి నోరు వేసుకుని పడటం, ఏదో ఒకస్థాయి పోరాటాలతో ఆయన పార్టీ ఉనికిని కాపాడటంలో విజయవంతం అయ్యారు. టీడీపీతో దోస్తీ సాగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక... బీజేపీ పరిస్థితి కూడా అయోమయంలోనే ఉంది. 'తెలంగాణ' నినాదాన్ని టీఆర్ఎస్ తర్వాత అత్యంత స్పష్టంగా భుజానికెత్తుకున్న ఈ పార్టీ సీమాంధ్రలో అడుగుపెట్టలేక పోతోంది. అలాగని... తెలంగాణలో దూసుకుపోతోందా.. అంటే అదీ లేదు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా టీఆర్ఎస్ నీడ నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే యాత్రల ద్వారా సొంత వ్యూహం రచిస్తోంది.

కొసమెరుపు: పార్టీల పందెం కోళ్లు ఎంతగా కొట్టుకుంటున్నా... ఎవరి బలం ఎంతో తేలేందుకు 2014 దాకా ఆగాల్సిందే. కానీ, బరి సిద్ధకాకముందే, పోటీని వీక్షించే ప్రజలు గుమికూడక ముందే కోళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మరో రెండేళ్లకు ఎవరి కత్తులు మొద్దు బారిపోతాయో, ఎవరివి వాడిగా ఉంటాయో వేచి చూడాలి మరి! 
http://www.thehindu.com/multimedia/dynamic/00503/16_P1_CARTOON_503599e.jpg