Saturday, January 8, 2011

కిం.. కర్తవ్యం ?

Babu
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పెట్టిన చిచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంకా రగులుతోంది. కాంగ్రెస్‌-టీడీపీ ఒకేరకమైన సమస్యతో సతమత మవుతుంటే, టీఆర్‌ఎస్‌ మరో రకమైన సమస్యతో ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి కాంగ్రెస్‌-టీడీపీలకు ప్రాణసంకటంలా మారగా, కేసీఆర్‌ మాత్రం తన భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై అనుసరించాల్సిన వ్యూహమేమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ-సీమాంధ్రలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి వైఖరి అనుసరిం చాలో తెలియక అవస్థలు పడుతోంది. ఏ ప్రాంతం వైపు మొగ్గుచూపినా మరొక ప్రాంతంలో దెబ్బ తింటా మన్న భయం వెన్నాడుతోంది.

తెలంగాణ వైపు మొగ్గుచూపినా ఆ రాజకీయ లబ్థి టీఆర్‌ఎస్‌- బీజేపీకి వెళుతుందన్న భయం కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీ నామా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు గతంలో అనుసరించిన వైఖరిని బట్టి, ఈసారి కూడా అంత సీను ఉండదని, మళ్లీ అధిష్ఠానం హెచ్చరికలతో మరోసారి అస్తస్రన్యాసం చేస్తారన్న అంచనా తెలం గాణ ప్రజల్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడుడీఎస్‌ స్వయంగా తెలంగాణ నేత అయినప్పటికీ, పార్టీ వైఖరిని ప్రకటిం చలేకపోతున్నారు. మరోవైపు పార్టీ వైఖరితో ప్రజల్లో ముఖం చూపించలేక తెలంగాణ ఎంపీలు తల్లడిల్లిపోతున్నారు. అందుకే భేటీల మీద భేటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

kcrr 

ఇక తెలంగాణ కోసం ఏర్పడిన టీ ఆర్‌ఎస్‌ మరో విచిత్ర మైన ఇరకాటంలో ఇబ్బంది పడింది. సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, చంద్రబాబు నాయుడు ఒక్కరే తెలంగాణకు అడ్డుపడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు యుపీఏ అడ్డం తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో సోనియాగాంధీని విమర్శించాలో, వద్దో అర్థం కాక సతమతమవుతున్నారు. నిజంగా సోనియాగాంధీ తెలంగాణ ఎప్పుడో ఇచ్చినట్టయితే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దానిపై చిదంబరం భేటీ, మళ్లీ ఈనెలాఖరులో చిదంబరం భేటీ ఎందుకన్న ప్రశ్నలు తెలంగాణలోని సామాన్య జనంలో మొదలు కావడం ఇబ్బంది కలిగిస్తోంది.

తన దీక్ష విరమణ సందర్భంగా డిసెంబర్‌ 9న చిదంబరం చేయవలసిన ప్రకటనను తానే నిర్దేశించానని సగర్వంగా చెప్పు కున్న కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయించలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రతర్థి వర్గాలు నిలదీస్తుండటం ఆ పార్టీకి ఇరకా టంగా పరిణమించింది. బహుశా ఇలాంటి ఇరకాటం తోనే కేసీఆర్‌ జోరు తగ్గించారని, పార్లమెంటు సమావేశాల వరకూ గడువు ఇచ్చి, ఆ లోగా జరిగే పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌ సోనియాగాంధీని విమ ర్శించకపోవడం కూడా చర్చనీయాంశమయింది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ఆయన సోనియాను విమర్శించడం లేదని, కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

D.-Sriniva 

అందుకే గత డిసెంబర్‌ ముందున్న స్పీడు, జోరు ఆయనలో కనిపించడం లేదంటున్నారు.అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తెలంగాణపై సంకట స్థితినే ఎదుర్కొంటు న్నారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయా లన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గతంలో శ్రీ కృష్ణ కమిటీపై పెదవి విప్పకుండా రెండు ప్రాంతాల నేతలతోనే మాట్లాడించిన బాబు, ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకునే అవసరం ఉన్నందున, తెలంగాణ నేతల స్వేచ్ఛకు అడ్డు రాకుం డానే అటు పార్టీని, ఇటు రెండు ప్రాంతాల నాయకుల ను కాపాడుకోవటం సవాలుగా పరిణమించింది.

ఇటీవల చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా తెలంగాణ విద్యార్థి జేఏసీలు, ఉద్యమ సంఘాల వ్యతిరేకత తగ్గించుకున్న బాబు, ఈనెలాఖరులో మళ్లీ ఢిల్లీలో జరిగే భేటీకి హాజరుకా వాలా వద్దా అన్న అంశంపై తర్జనభర్జన పడుతు న్నారు. సోనియా ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, తానే అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్‌ ఇప్పటివరకూ చేసిన ఆరోపణలో నిజం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమయినందున, ఆ తర్వాత పరిణామాలు తమ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయోనని వేచిచూస్తున్నారు. ఈలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ముద్దాయిగా నిలబెట్టా లన్న వ్యూహం అనుసరిస్తున్నారు.

No comments: