Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

1 comment:

gabriel said...

దున్నేవాడిదే భూమి . పాదయాత్ర చేసేవాడిదే పదవి.అధికారం, నాయకుడు కనపడితే ప్రజలు ఎగబడుతున్నారు. నాయకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి,పలకరించాలని కోరుకుంటున్నారు. యే పార్టీ నాయకుడు వచ్చినా ప్రజలు నిర్భయంగా తమ గోడు వినిపిన్చుకుంటున్నారు. శుభ పరిణామం. చెప్పి వచ్చేకంటే, చెప్పా పెట్టకుండా, మంత్రులు వచ్చి తనిఖీ మొదలు పెడితే, పరిస్తుతులు చక్కబడతాయి. యంత్రాంగం కదులుతుంది. అధికారులకు భయం వుంటుంది. మెల్ల మెల్లగా,నాయకులు,చేలలో దిగి,కలిసి వ్యవసాయం చేసే పద్దతి కూడా రావచ్చు. .
నడవలేని నాయకులు రిటైర్ అవుతారు. పరుగెత్తే నాయకులు వస్తారు. పోలీసు సేలెక్షనుకు 5 కిలోమీటర్లు పరుగెత్తలేక ఎలా చనిపోతున్నారో, అలా పార్టీ టికెట్ అడిగిన వారికి 25 K M నడకలాంటి పరుగు పందాలు వస్తాయి. రాజకీయ నాయకుల పొట్టలు కరిగి, B .P షుగర్ తగ్గుతాయి. సోనియా వంటి పార్టీ అధినేతలు, నాయకుల పొట్టల చుట్టుకొలతలు కొలిపించి,కిరణ్ కుమార్ వంటి క్రీడా కారులను పదవులలోకి దించుతారు. అశ్వని నాచప్ప,కరణం మల్లేశ్వరి లాంటి వారిని బ్రతిమాలి పార్టీ లో చేర్చుకుంటారు.అసెంబ్లీ,పార్లమెంట్ ఆవరణములో లాంగ్ జుంప్,హై జుంప్,ప్రాక్టీసు లు వుంటాయి. తెలుగు వోటరు అదృష్టవంతుడు మంచి నాయకులు వస్తారు.