Friday, May 25, 2012

స్ఫూర్తి కొరవడిన పంచాయతీలు

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతున్నాయి? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి   దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే.

కారణాలు ఏమైనప్పటికీ, ఈ రోజు పల్లెల్లో పల్లె మాట, ఆట, పాట; పల్లె ప్రేమ-అనురాగాలు అన్నీ మసిబారి పోయాయి. మానవీయ విలువలు, నిజాయితీ, కష్టించే తత్వానికీ, నిస్వార్థానికీ నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడ్డ పల్లె యువత నేడు మద్యం మత్తుకు బానిసలవుతున్నట్లే, అవినీతి రాజకీయాలకూ బానిసలవుతున్నారు. స్త్రీలపై హింస, అణచివేత, అసహనం, వివక్ష రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు పంచాయతీలనూ వాటిని నడిపించే ప్రెసిడెంట్ల పనితీరునూ ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కక్ష సాధింపులూ, ఓట్ల రాజకీయాలూ తప్ప అభివృద్ధి లక్ష్యంగా సాగాల్సిన స్థానిక పాలన కోసం చేసిన పంచాయతీ రాజ్ చట్టాల స్ఫూర్తి దెబ్బతిన్నది. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో ముఠా తగాదాలు పెరిగి విభజించి పాలించే తత్వం వేళ్ళూనుకుంటున్నది.

ఏ కొంచెం చదువు, జ్ఞానం వున్న వాళ్ళైనా, పల్లెలు బాగుంటే భారతదేశం బాగుంటుంది అని నమ్మే పెద్ద మనసున్న వాళ్ళైనా-పల్లెల గురించి ఆలోచించటం అంటే పంచాయతీల పనితీరు చర్చించటమే! మనకున్న చట్టాలు చాలా గొప్పగా ఉన్నట్లే పంచాయతీరాజ్ చట్టం కూడా ఎంతో గొప్పగానే తీర్చి దిద్దుకున్నాం. కానీ పంచాయతీలు నడుస్తున్న తీరు గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఏలుతున్న నీతిబాహ్యమైన, పార్టీ రాజకీయాలకు ఎంత మాత్రం తీసిపోదు. పంచాయతీ ప్రెసిడెంట్‌లు, ఆయా గ్రామాల్లో ఒక చిన్నపాటి గూండా రాజ్యాన్ని తయారు చేస్తున్నట్లే కనిపిస్తుంది! వారి వారి పార్టీలని బతికించుకోడానికి, బలోపేతం చేసుకోడానికి, ఓట్లు పెంచుకోడానికి సీట్లు రాబట్టుకోవడానికే పనిచేస్తున్నారు తప్పించి, పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తి అమలుకావటం లేదు. పంచాయతీలని నడిపిస్తున్న ప్రెసిడెంట్లు, ఆర్థిక సామాజిక దోపిడీలకు పాల్పడుతుంటే పట్టించాల్సిన, పట్టించుకోవాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థ స్తబ్దుగా తయారైంది.

గుంటూరు జిల్లాలోని ఒకానొక గ్రామంలో ఆ ఊరి ప్రెసిడెంట్, తన పార్టీకి చెందని గ్రామస్తులని కనీసం పలకరించడు కూడా! అదే గ్రామంలో, వేరే పార్టీకి చెందిన ఒక పేద కుటుంబం, టైలర్ పని చేసుకుంటూ కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటోంది. అటుగా వెళ్తున్న ఊరి ప్రెసిడెంట్ - ఎప్పుడూ పలకరించిన పాపాన పోనివాడు, ఆగి మరీ అడిగి ఇసుక ఎక్కడినుంచి వస్తుందో కనుక్కుంటాడు. అంతే, తెల్లారితే కప్పు వేయాల్సిన ఇంటిపని కాస్తా అర్ధంతరంగా ఆగిపోతుంది. ఎందుకంటే సమయానికి రావాల్సిన ఇసుక లారీ, ప్రెసిడెంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్‌తో ఎక్కడో సీజ్ చెయ్య బడింది! అదే ఊరిలో ఇద్దరు అత్తా కోడళ్ళు గొడవపడితే, ముసలి అత్తను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసినప్పటికీ కోడలికి మద్దతు పలికితే ఎక్కువ ఓట్లు వస్తాయని లెక్క వేసుకుని, కోడలికే వత్తాసు పలుకుతాడు.

అందుబాటులోకి వచ్చిన రాయితీలను ఉపయోగించుకుని వాగులో మట్టి తవ్వి అమ్ముకోవటం, సొంత చేన్లో లెక్కకు మించి స్కీముల కింద బావుల్ని తవ్వుకుని మట్టి అమ్ముకోవటం, ఊరికోసం వచ్చిన ప్రభుత్వ పథకాలన్నీ పొల్లుపోకుండా సొంత పార్టీ వాళ్ళకి వాడి డబ్బు చేసుకోవటం మొదలైన విషయాల్లో అందె వేసిన చెయ్యి అతనిది.

ఊరికి ప్రెసిడెంట్ కాక ముందు మామూలు రైతు, ప్రెసిడెంట్ అయ్యాక మూడేళ్ళు కూడా తిరక్కుండానే లక్షాధికారి! అవతల పార్టీ సానుభూతిపరుల కుటుంబాలను రాచి రంపాన పడేయటం, పేద కుటుంబాలు అయితే ప్రభుత్వ పథకాలని రానీయకుండా చేయడం -కొంచెం ఆర్థిక స్వావలంబన ఉన్న కుటుంబాలు అయితే వారికి ఆదాయాన్నిచ్చే మార్గాలకి పూర్తి స్థాయి అంతరాయం కల్పించటం, దాని కోసం ఎంతటి దగుల్భాజీ పనైనా చేయటం అతని కర్తవ్యంగా నెరవేరుస్తాడు.

ఆ గ్రామంలో సెంటు భూమి ఖాళీ ఉండదు. పిల్లలు ఆడుకొనే ఆట స్థలం ఉండదు. వీధి దీపాలు విధిగా వెలగటం 40 ఏళ్ళుగా ప్రశ్నార్థకం. కాని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతాయి- బెల్టుషాపు ఓనర్లకి; ఏడాదికోసారి అంగరంగ వైభవంగా (రాజకీయ పార్టీల) పే రుతో ఊరబంతులు పెట్టి, తాగబోయించి, రికార్డు డ్యాన్సులు పెట్టిస్తారు. ఎవరి కోసమో అనుకుంటున్నారా- అన్నీ త్యజించి, త్యజించమని లోకానికి ఎలుగెత్తిచెప్పిన సాధువు వీరబ్రహ్మం గారికి! ఓట్ల కో సంపడే పాట్లలోభాగమని చెప్పకుండానే ఆయనకో గుడి కట్టిస్తారు...

ఆ ఫలానా రాజకీయ పార్టీ అనుయాయుడుగా మారి జనాన్ని తన అప్రజాస్వామిక పద్ధతుల్లో పంచాయతీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి, భయ భ్రాంతులకి గురిచేయటమే కాక, అమాయక రైతులని, పేద వాళ్ళని, యువతని తన అవినీతిలో నెమ్మది నెమ్మదిగా భాగస్వాములని చేసుకుంటున్నాడు. 'ఎవడు మాత్రం కడిగిన ముత్యం? తింటే తిన్నాడు -ఎంతో కొంత మాకూ ఇస్తున్నాడు కదా, పని కూడా చేస్తున్నాడు కదా!' అనే వాళ్ళ సంఖ్య పెంచుతున్నాడు. ప్రజాస్వా మ్యం అంటే ప్రజల గొంతు, వారి ఆకాంక్ష అనుకునే ప్రజాస్వామ్య వాదులకు 'ప్రజలతోనే బుద్ధి చెప్పించే' ప్రయత్నమే ఇది.

ఈ అవినీతి రాజకీయ నేతలు పల్లెల్లో ప్రెసిడెంట్ల నుంచి పట్నాల్లో బడా రాజకీయ నాయకుల దాకా ప్రజలని కూడా అవినీతిలో భాగస్వాములను చేస్తున్నారు. కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్య తప్పించి, పంచాయితీ ప్రెసిడెంట్ల తీరు దాదాపుగా రాష్ట్రమంతటా ఇదే తీరు అని చెప్పుకోవడంలోఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే జిల్లాల పేర్లు, పార్టీ పేర్లు మారొచ్చు. అంతే తేడా!

రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ప్రెసిడెంట్ తన ఊరిలోని ఒక రేప్ కేసులో నిందితుడిని కాపాడడానికి చెయ్యని సాహసం లేదు. పోలీస్ కేసుని వాపసు తీసుకోమని ఒత్తిడిపెంచడం దగ్గరినుంచి, పోలీసులతోటే బెదిరించడం, ఊరి జనాన్ని ఎగతోయడం, 'మా ఊర్లో ఏమైనా జరిగితే ముందు మా దృష్టికి రావాలిగాని, పోలీసుల దృష్టికి ఎందుకు పోవాలి?' అనే ప్రశ్నలు సంధించడం, ఊరిలో ఎట్లా తిరుగుతారో చూస్తాం అని బెదిరించడం, ఏ పార్టీకి సంబంధం లేని ఒక సేవా సంస్థ మీద 'వారు అవతలి పార్టీకి సానుభూతి పరులు, అందుకే మన మీద కేసు పెట్టారు' అని అబద్ధపు ప్రచారం చేయటం వగైరా అన్నీ చేశాడు.

ఇదంతా ఎందుకు చేశాడు అంటే, పంచాయతీ ప్రెసిడెంట్‌కి, నిందితుని పట్ల ప్రేమా కాదు, బాధితుల పట్ల ద్వేషమూ లేదు - ఓట్ల కోసం అదొక లెక్క! ఆ గ్రామంలో ఆ నిందితునికి సంబంధించిన సామాజిక వర్గానికి ఎక్కువ నోట్లున్నాయి! అతని దృష్టిలో ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే, కాళ్ళ బేరానికొచ్చి, ఊరి పెద్దకి చెప్పుకుని నాలుగు పైసలు పరిహారంగా తీసుకొని వెళ్ళి పోవాలే తప్ప అతని ఓట్ల లెక్కలకి అడ్డు వచ్చి, పోలీసులకి చెప్పి, కోర్టులకెక్కి చట్టం న్యాయం అని వాపోతే ఆ ప్రెసిడెంట్ ఎట్లా ఏడిపించాలో అట్లా ఏడిపిస్తాడు.

నల్లగొండ జిల్లాలో ఒక తండా. 15 ఏళ్ళ గొర్రెల కాపరి. ఆ వయసులోనే ఊరి మగపిల్లల దాష్టీకానికి గురైంది. ఆరు నెలలు నిండేవరకు ఏమీ అర్థం కాలేదు. పొట్ట పెరిగిందని తల్లి డాక్టర్‌కి చూపిస్తే విషయం తెలిసింది. ఇంటికి తీసుకొచ్చి బిడ్డని తల్లీ తండ్రీ ఇద్దరూ కొట్టి చంపారు. విషయం ఊరిలో అందరికీ తెలుసు. ప్రెసిడెంట్‌కి కూడా తెలుసు. సమాచారం పోలీసులకి చేరదు! చట్టం దృష్టికి పోదు... 'గర్భిణిని పూడ్చకూడదు, ఊరికి అరిష్టం అనే మూఢనమ్మకాన్ని మాత్రం ఊరి వాళ్లు తుచ తప్పక అమలుచేయటానికి ఊరి ప్రెసిడెంట్ జనంతో మమేక మవుతాడు.

ఎక్కడినుంచో పోలీసులకు ఉప్పందితే తప్ప, అంత భయంకరమైన హత్య, ఒక ఇంటి గుట్టు, ఊరి పరువు ప్రతిష్ఠగానే మిగిలిపోతుంది. ప్రజల పేదరికాన్నే కాదు, మూఢనమ్మకాలనీ ఓట్ల రాజకీయాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మద్యం మత్తు కాకుంటే మరో మత్తు. జనాన్ని మానవ హక్కులు, నిజాయితీ, మహిళల సమానత్వం, మానవీయ విలువలు, అలాంటి అవగాహనకి ఎంత దూరంగా ఉంచితే అంతకాలం వాళ్ల ని ఓట్ల రాజకీయాలకి అవినీతికి అంత సులువుగా వాడుకోవచ్చు! ఈ సత్యా న్ని మాత్రం పంచాయితీ ప్రెసిడెంట్లు వారి వారి ప్రధాన రాజకీయ పార్టీ నేతల అడుగుజాడల్లో, వారి అండదండలతో ఆసాంతం అవగతం చేసుకుని, నిష్ఠగా అమలుపరుస్తున్నారు.

చాలా చోట్ల కుల సంఘాల నాయకులే ఊరి పెద్దలు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా. కుల సంఘాల నాయకులు తమ తమ కులాల సామాజిక న్యాయం కోసం పోరాడటం హర్షించాల్సిందే . అణచివేత, వివక్ష, హింస, దారిద్య్రం, దోపిడీ, హక్కుల హననం ఎక్కడున్నా ఎదిరించాల్సిందే! వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే, ఆయా పోరాటాల్ని ప్రజాస్వామ్య వాదులు ఎల్లప్పుడూ బలపరుస్తున్నారు. కాని ఈ కుల సంఘాల నాయకత్వాలకు కూడా ఓట్లు, సీట్లు, అధికారం చేజిక్కించుకోడానికే వ్యూహాలు ఎత్తుగడలు ఉంటున్నాయి తప్ప ఆయా కులాల్లో జరుగుతున్న బాల్య వివాహాలు, వరకట్న దాహాలు, హత్యలు, పరువు పేరుతో హత్యలు, మహిళలపై హింస, వివక్ష లాంటి దారుణాలను ఆయా కుల సంఘనాయకులు ఏనాడైనా పట్టించుకుని మాట్లాడారా? మాట్లాడరు.

రాజ్యాధికారం చేజిక్కే వరకు నోళ్ళు విప్పరు అని అనుకోవాలా? వారే గనక వారి కులాల్లో ఆడవాళ్ళ సమస్యల మీద న్యాయ బద్ధంగా మాట్లాడి, వారి వారి కులాల్ని ప్రభావితం చేసి ఉంటే ఇన్ని ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న హత్యలు జరిగి ఉండేవా? వారి వారి కుటుంబాల్లో ఆడపిల్లలకి, స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల్ని పట్టించుకోకుండా, వారి కులాలకి సామాజిక న్యాయం కోరే నాయకత్వాల నిజాయితీని శంకించకుండా ఎలా ఉండటం? ప్రధానంగా బాల్య వివాహా లు, కుటుంబ హింస, ఆడపిల్లల పట్ల వివక్ష ఎన్ని చట్టాలొచ్చినా ఎం తటి నిజాయితీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నా చట్టం ఎంత పటిష్ఠంగా ఉన్నా సమస్యకు కొంత మాత్రమే ఉపశమనం.

కులసంఘాల నాయకులూ పంచాయతీ ప్రెసిడెంట్లు కులపెద్దలూ, బస్తీ నాయకు లూ బాధ్యులు కానంత కాలం స్త్రీలపై హింస పెరుగుతూనే ఉంటుంది. గ్రామాలలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, బయటకురాని మహిళల హత్యలు ఎన్నో ఉన్నాయి. చాలా భాగం కేసులు తొక్కి పెట్టి ఉంచటంలో ఊరి ప్రెసిడెంట్, కుల పెద్దల పాత్ర అధికం. కొన్నిచోట్ల పోలీసులు కూడా, వీరిని ఎదిరించే సాహసం చేయరు. కుల సంఘాల నాయకులే పంచాయతీ ప్రెసిడెంట్లు అయినప్పుడు మరింతగా వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశముంది.

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతుంది? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే. తమ తమ పంచాయతీ ప్రెసిడెంట్‌లను, అనుబంధ కుల సంఘాలను కేవలం గ్రామాల్లో ఓట్లు సమకూర్చే ప్రతినిధులుగా కాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని దాని స్ఫూర్తిని అందుబాటులోకి తెచ్చే నేతలుగా ఎదిగేలా సహాయపడాలి.
- అంకురం సుమిత్ర
వ్యాస రచయిత్రి, సామాజిక కార్యకర్త

No comments: