
వరస వెంట వ…రస తప్పులో కాలేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్రబిందువుగా మళ్లీ మొదలయిన మరో వివాదం ఆయనను చివరకు హిందూమతానికి వ్యతిరేకిగా ముద్రవేసే ప్రమాదం తెచ్చింది. బుధవారం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన జగన్, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న సరికొత్త వివాదానికి తెరలేపి నట్టయింది. గతంలో సాంకేతికంగా పార్శీ అయిన ఇందిరాగాంధీ, సిక్కు మతానికి చెంది న రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్ కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు. అదేవిధంగా జగన్ కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇస్తారని భావించారు.

కానీ ఆయన అందుకు తిరస్కరించి, వైఎస్ గతంలో ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదని, పైగా స్వామివారికిపట్టు వసా్తల్రు కూడా సమర్పించారని వాదించారు. అదేవిధంగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఏనాడూ డిక్లరేషన్ ఇవ్వనప్పుడు తానెందుకు ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. దానితోపాటు అనుచరులు చేసిన నినాదాల హడావిడి భక్తులను చికాకు పరిచింది. జగన్ తనది సోనియాగాంధీ స్థాయి అని చెప్పుకోవడాన్ని అటుంచితే, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుందని హిందు మత సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. చాలాకాలం నుంచి జగన్‌ను క్రైస్తవుడిగానే భావిస్తామని, ఆయన కుటుంబ సంప్ర దాయాలు క్రైస్తవమతానికి సంబంధినవే కాబట్టి జగన్‌ను రెడ్డిగా పరిగణించబోమని సీనియర్ నేతలు జెసి దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డి బాహాటంగానే వాదిస్తూ వస్తున్నా రు.
ఈ నేపథ్యంలో వారి విమర్శలకు తెరదించేందుకయినా జగన్ తనకు హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే బాగుండేదని హిందూ ధార్మిక సంస్థలు వాదిస్తున్నాయి. ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయనను హిందువులంతా క్రైస్తవుడిగానే భావించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్ జీవించినప్పుడు ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేసేందుకు ప్రయత్నించి, ఆ మేరకు ఒక జీఓ కూడా ఇవ్వడం ఇప్పుడు జగన్ చర్య ద్వారా మళ్లీ చర్చనీయాంశమయింది. శ్రీ వెంకటేశ్వరుడి పరిధిని ఏడు కొండల నుంచి రెండు కొండలకు కుదించి, అక్కడ జగన్ బావ బ్రదర్ అనిల్ సారధ్యంలో తొలుత ఒక పెద్ద చర్చి నిర్మించి, ఆ తర్వాత అక్కడ వ్యాపార కేంద్రం నిర్మించాలని ప్రయత్నించిన వైనంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికిన విషయం తెలిసిందే.

వైఎస్ ప్రయత్నాలను వ్యతిరేకించిన నాటి ఒక సీనియర్ మంత్రి రాత్రికి రాత్రే చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి తిరుమలను మీరే కాపాడాలని అభ్యర్ధించారు. తర్వాత టీడీపీ తన ఆందోళన ద్వారా రెండుకొండలకు కుదించే వైఎస్ ప్రయత్నాలను అడ్డుకోవడం తెలిసిందే. తాజా పరిణామాలు జగన్ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారన్న భావన హిందూ వర్గంలో మొదలయింది. నైవేద్యం గంట కొట్టకముందే జగన్ వైకుంఠం నుంచి ఆలయంలోకి వచ్చి రంగనాయక మంటపంలో కూర్చోవడాన్ని హిందూ మతస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని ద్వారా ఆయన నైవేద్యాన్ని కూడా అపవిత్రం, అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వారి వెంట కార్యకర్తలు, అనుచరులు సహజంగా వస్తుంటారని..
ఈ విషయంలో జగన్‌ను తప్పు పట్టవలసిన పనిలేదంటున్నారు. అయితే జగన్‌తో వచ్చిన అనుచరులు ఆయనకు జిందాబాదులు కొట్టడం స్వామిని అవమానించడమేనని స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప, అన్యుల కీర్తన సంప్రదాయా నికి, మతానికి విరుద్ధమని గుర్తు చేస్దున్నారు. కాగా జగన్ డిక్లరేషన్ ఇచ్చి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని వైకాపా నేతల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వివాదాలు మంచివి కాదంటున్నారు. మతం చాలా ప్రమాదకరమైన అంశమని, దానితో ఆడుకుంటే కష్టాలు కోరితెచ్చుకోవడమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ జగన్ తమ నేత జగన్ అంతా అనుకున్నట్లు క్రైస్తవుడే అయినప్పటికీ తనకు హిందూ మత విశ్వాసాలపై గౌరవం ఉందని డిక్లరేషన్ ఇస్తే హిందువుల్లోనూ ఆయనపై గౌరవం, అభిమానం పెరిగేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ అధికారులు మూడుసార్లు కోరినా డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో.. జగన్ తనను తాను క్రైస్తవుడినని అంగీకరించినట్టయిందని, దానివల్ల పార్టీ హిందువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీల నిరసనలు
తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతోంది. శాసనసభలో టీడీపీ సభాపక్ష నేత దాడి వీరభద్రరావు హిందూ మత సంప్రదాయాలు, సంస్కృతిని జగన్ అవమానించారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా లోపలికి వెళ్లడం హిందువులను అవమానించడమేనని, ఇది హిందువుల మనోభావాలను అగౌరవపరచడమేనని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ తిరుమల నిధులను తన నియోజకవర్గానికి తరలించారని, ఇప్పుడు జగన్ దృష్టి తిరుమలపై పడిందని, ఇకపై ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలను నాలుగుసార్లు దర్శించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిక్లరేషన్‌పై సంతకం చేశారని, గతంలో ఇందిరాగాంధీ కోరి మరీ డిక్లరేషన్‌పై సంతకాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. సోనియా నాలుగుసార్లు వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు నరేష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ హిందువులను అవమానించారన్నారు. అటు బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి ఉండాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ స్పష్టం చేయగా, టీటీడీ మూడుసార్లు కోరినా జగన్ సంతకం పెట్టకపోవడం ఏమిటని, ఒక సంతకం పెడితే పోయేదేముందని బీజేపీ నేత సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు.
- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్
No comments:
Post a Comment