Tuesday, October 19, 2010

నిండుగా నిర్లక్ష్యం * ‘గోడౌన్ల సమస్య’ సాకుతో పర్మిట్లు ఇచ్చే యోచన

అసలు రోగం ఒకటైతే... చికిత్స మరొకటి
గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలతోనే అసలు సమస్య... అడిగేవారు లేక గోదాముల్లో ఉన్న మనకు పనికిరాని నిల్వలను పట్టించుకోని కేంద్ర మంత్రిత్వ శాఖలు
అవకాశాన్ని వాడుకుని సన్నబియ్యం పర్మిట్లకై మిల్లర్ల ఎత్తుగడలు
ఇప్పటికే పూర్తిగా నిండిన గోదాములు... మార్కెట్లోకి రానున్న ఖరీఫ్ ధాన్యం
గోదాముల పరిస్థితి చూసి పట్టు బిగిస్తున్న మిల్లర్లు...
వారికి తలొగ్గి పర్మిట్ల జారీకి సిద్ధమవుతున్న సర్కారు...
పర్మిట్లు ఇస్తే గోదాములు ఎలా ఖాళీ అవుతాయన్నది జవాబులేని ప్రశ్న


ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతు పక్షపాతి, దివంగత నేత వైఎస్ హయాంలో అమలు చేసిన విధానానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు రైతులకు సరైన ధర, మరోవైపు వినియోగదారుల ప్రయోజనాల రక్షణనూ ఆలోచించిన వైఎస్ ప్రభుత్వం అప్పట్లో సన్నబియ్యం ఎగుమతులపై పలు ఆంక్షలు అమలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల బెదిరింపులకు భయపడి ఆ ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. ఎలాగైనా బియ్యం ఎగుమతికి పర్మిట్లు పొంది భారీగా గడించాలనే వ్యూహంతో, ముమ్మరంగా యార్డులకు ధాన్యం రాబోతున్న కీలక తరుణంలో కొనుగోళ్లు ఆపేస్తామంటూ మిల్లర్లు హెచ్చరికలకు దిగారు. కొన్ని రాజకీయపక్షాలు కూడా వారికి వంత పాడాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. మొన్నటికిమొన్న నెల్లూరు సన్నాల విషయంలో రోజుకోరకం జీవోలు విడుదల చేసి రైతును నిండా ముంచేసిన తీరు ఇంకా మరవకముందే ఆంక్షల ఎత్తివేతకు సిద్ధమవుతోంది. అదేమిటంటే గోదాముల సమస్యను సాకుగా చూపుతోంది. పర్మిట్లు ఇచ్చినా గోదాములు ఖాళీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే మూలుగుతున్న గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోకుండా పర్మిట్లు ఇచ్చినంతమాత్రాన సమస్య ఎలా పరిష్కారమవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

ఎక్కడెక్కడి నిల్వలూ రాష్ట్రంలోనే!

రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, వివిధ విభాగాలకు చెందిన గోడౌన్ల నిల్వ సామర్థ్యం 36 లక్షల టన్నుల వరకు ఉంది. ఇందులో ఇప్పటికే 33 లక్షల టన్నుల ధాన్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో రాష్ర్టంలో ఉపయోగించని, ఇక్కడ పండని గోధుమలు 2-3 టన్నులు కాగా, ఉప్పుడు బియ్యం ఏకంగా 21 లక్షల టన్నులు మూలుగుతున్నాయి. ఇవి మన అవసరాలకు ఉపయోగపడవు. అలాగని వీటిని తరలించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. వివిధ ఆపదల సమయాల్లో ఇతర దేశాలకు చేసే సహాయం కింద ఆహారధాన్యాల నిల్వలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తరలించిందే తప్ప... మన రాష్ట్రంలో నిల్వ చేసిన ఉప్పుడు బియ్యాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ర్ట ప్రభుత్వం గట్టిగా కోరితే ఉప్పుడు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ విషయంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో గోదాములనిండా ఉప్పుడు బియ్యమే మూలుగుతోంది.

ఈసారి ఖరీఫ్, రబీలో అధిక దిగుబడులు వస్తాయని తెలిసినా ఈ నిల్వల తరలింపుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఫలితంగా ఈ బియ్యం ఇక్కడ నిల్వ ఉన్నంత కాలం గోదాముల సమస్య ఇలాగే కొనసాగనుంది. ఆహార ధాన్యాల నిల్వల తరలింపునకు సరిపడా రైల్వే ర్యాకులను తీసుకురావడంలోనూ కొంత వైఫల్యం కనిపిస్తోంది. సరిపడా ర్యాకులను తెప్పించగలిగామని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నా, అంతగా ర్యాకులు వచ్చి ఉంటే ఇప్పటికే సగం నిల్వలు ఖాళీ అయ్యేవని ఎఫ్‌సీఐ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నించగల నేత లేకపోవడంతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచాయి. మన ఉన్నతాధికారులు సైతం సీఎంతో కొన్ని లేఖలు కేంద్రానికి పంపించి, అదే సరిపోతుందనుకుని మిన్నకుండిపోయారు. ఫలితంగా ర్యాకులు రాక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి.

ఇదే అదునుగా మిల్లర్లు..!
గోదాముల్లో ఖాళీ లేకపోవడాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని పర్మిట్లు సాధించేందుకు మిల్లర్లు ఎత్తుగడ వేశారు. గోదాముల్లో ఖాళీ లేదనే సాకు చూపి కొనుగోళ్ల సమ్మె ప్రకటించారు. ముందుగా ధాన్యం వచ్చే తెలంగాణ మిల్లర్లు ఈ ప్రకటన జారీ చేయగా... అనుకూల నిర్ణయం వస్తే తమకూ మంచిదనే భావనతో ఆంధ్రా మిల్లర్లు కూడా ఇదే డిమాండ్‌ను వినిపించడం మొదలుపెట్టారు. నిజానికి ఒక మిల్లర్ 100 లారీలు లెవీ పెడితే, తనకు ఎగుమతి పర్మిట్లు వచ్చేది కేవలం 25 లారీలకే! అందులోనూ మూడో వంతు మాత్రమే పచ్చిబియ్యం ఉండాలని, మిగతాది ఉప్పుడు బియ్యమైతే అభ్యంతరం లేదని గతంలో పూనం మాలకొండయ్య కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆంక్షలు విధించారు. తద్వారా విలువైన సన్నరకాల బియ్యం రాష్ట్రం నుంచి తరలిపోకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రస్తుతం సన్న బియ్యం ధరలు చాలా అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే కిలోకు 21 చొప్పున తాము ఎంత బియ్యమైనా మార్కెట్‌లో అమ్ముతామని చెబుతూ మిల్లర్లు ఒకరిద్దరు రాజకీయ నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. నిజానికి ఉప్పుడు బియ్యం ఎగుమతికి మిల్లర్లకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చినా అది ఎవరికీ నష్టం కలిగించదు. రైళ్లు, ఓడల ద్వారా ఎగుమతికి అవకాశం కల్పించినా మంచిదే. కానీ ఈ ముసుగులో సన్నరకాల బియ్యానికి రోడ్డు మార్గంలో (లారీల్లో...) పర్మిట్లు పొందాలనేది మిల్లర్ల ఎత్తుగడ. గతంలో ఇలా పర్మిట్లు పొంది భారీగా కాండ్లా రేవుకు తరలించి, అక్కడ్నుంచి విదేశాలకు అమ్మారని ప్రభుత్వమే ఒక దశలో నిర్ధారించుకుని భారీగా మిల్లులపై దాడులు చేసి కేసులు పెట్టింది. ఇప్పుడవన్నీ విస్మరించి, మిల్లర్ల హామీలను విశ్వసించి ఆంక్షల సడలింపునకు పూనుకోవడమే విచిత్రం!

నెల్లూరు సన్నాల పేరుతోనూ దోపిడీ!
నల్లమచ్చ పేరిట గత ఏడాది మిల్లర్లు నెల్లూరు సన్నాల ధాన్యాన్ని కొనడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం కూడా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్‌సీఐ ద్వారా కొనిపించాలనే రైతుల డిమాండ్‌ను పక్కనబెట్టి, మచ్చ శాతాన్ని బట్టి ధాన్యం ధరలో కోత పెట్టి మిల్లర్లే కొనుగోలు చేసుకోవచ్చునని జీవో ఇచ్చింది. ఈ వాల్యూకట్ విధానంలో మిల్లర్లు అడ్డగోలు ధరలకు కొన్నాక, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించటానికి అనుకూలంగా మరో జీవో ఇచ్చింది. మిల్లర్లు తమ నిల్వలను ఈ సంస్థలకు అమ్మేసి బాగుపడ్డారు. మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించే ప్రస్తుత ఉన్నతాధికారుల వైఖరికి ఇదే పెద్ద ఉదాహరణ. కేవలం 25 శాతం పర్మిట్ల కోసం ఎగుమతికి అవకాశాలు ఇస్తే... మొత్తం గోదాముల సమస్య ఎలా పరిష్కారమవుతుందో ఆ అధికారులే చెప్పాలి. కొత్త గోదాముల అవసరాన్ని గతంలోనే వైఎస్ గుర్తించారు. 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లను నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికను రూపొందించారు. అందుకోసం ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రొత్సహించడానికి తగు చర్యల్ని తీసుకున్నారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన అకాల మృతికి గురయ్యారు. తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ఏడాది క్రితమే గోడౌన్ల నిర్మాణాలను చేపట్టినట్టయితే... ఈ పాటికి చాలా వరకు అందుబాటులోకి వచ్చేవి. ఎస్‌డబ్ల్యూసీ గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇప్పటికీ అవి ఖరారు కాలేదు. ఇప్పుడు నిర్మాణాలు ఆరంభించినా ఈ సీజన్‌కు ఆ కొత్త గోదాములు ఏమాత్రం ఉపయోగపడవు. ఉప్పుడు బియ్యం, గోధుమల నిల్వల తరలింపే ప్రస్తుత పరిష్కారం. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం మిల్లర్ల పాటకు వంత పాడుతూ సమస్యకు పరిష్కారం చూపని పర్మిట్ల జారీకి సంసిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై అఖిలపక్షం సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ అంతా బాగానే ఉందని, గోదాముల సమస్యతో సహా అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అలాగైతే బియ్యం ఎగుమతులకు పర్మిట్ల మాటేమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం కొసమెరుపు!!
దాన్యం నిల్వలకు ప్రైవేటు గిడ్డంగులు
 సీఎం రోశయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది ధాన్యం ఉత్పతి అధికంగా వచ్చే అవకాశముందని, ధాన్యం నిల్వల కోసం ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దెకు తీసుకోవాలని ఆదేశించామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సోమవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యాల నిల్వకు తగిన వసతికోసం గత రెండు మాసాలుగా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందని తెలిపారు. ఎఫ్‌సీఐ, రైల్వే, పౌరసరఫరాల శాఖ, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలన్నిటితో సమన్వయం చేస్తూనే ఉన్నామని, మరీ ముఖ్యంగా రైల్వే విభాగాన్ని కనీసం 7 రాక్స్ కావాలని అడిగామని చెప్పారు. అదనపు స్పేస్ కోసం అవసరమైతే ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దె (హైర్)కు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం కూడా అత్యధిక సంఖ్యలో నిల్వ ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు బయటకు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి రైతులకు కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు. గోదాముల అద్దె ప్యాకేజీ ఆకర్షించే విధంగా లేదని, ఆ పాలసీని సవరించి, ఆమోదయోగ్య పాలసీని తీసుకురావాలన్న మిల్లర్ల కోరికను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ విషయాలన్నిటినీ మంగళవా రం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని రోశయ్య చెప్పారు.

తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన గిడ్డంగులు: ఖరీఫ్‌తో పాటు రబీలోనూ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుండటంతో రాష్ట్రంలో ధాన్యాల నిల్వలకు గాను తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదిక గిడ్డంగుల ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖామంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి వద్ద సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది 3 నుంచి 4 శాతం అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, రానున్న జనవరి నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక యూనిఫైడ్ కో-ఆపరేటివ్ యాక్ట్
త్వరలోనే సహకార శాఖలో యూనిఫైడ్ యాక్ట్ రానుందని సహకార శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సహకారశాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టంపై ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించి ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 2831 కోట్లు రుణాలిచ్చామని, రబీలోనూ రూ. 1885 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పం రెస్కోలకు ఎన్నికలు జరపాలని సీఎం ఆదేశాలిచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లా తరహాలోనే రాష్ట్రంలో అన్ని సొసైటీ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తామని ఆయన చెప్పారు.

No comments: