Sunday, October 31, 2010

రోశయ్యే సుప్రీం ! ‘‘ రోశయ్య సుప్రీం ’’

roshaiah-cmm
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన, పార్టీ ప్రజాప్రతి నిధులపై క్రమంగా పట్టుబిగుస్తున్నారు. బలహీన ముఖ్యమంత్రి అన్న భావన నుంచి బయటపడి బలమైన ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తున్నారు. కొద్దికాలంపాటు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ‘‘ముఖ్యమంత్రి మార్పు’’ ఊహాగానాల... నుంచి మళ్లీ పాలనపై పట్టుసాధించే పరిస్థితికి చేరుకొన్నారు. అనారోగ్యం నుంచి తేరుకొని మునుపటి కంటే ఎక్కువగా ప్రభుత్వ శాఖల సమీక్షలకు అధిక సమయం కేటాయిస్తున్నారు. దీనికి తోడు...పార్టీ అధిష్ఠానానికి, తనకు ప్రత్యక్షంగా-పరోక్షంగా కంట్లో నలుసుగా మారిన వై.ఎస్‌.జగన్‌ వ్యవహారం ‘‘పార్టీపరంగా’’ ‘ముగింపు దశకు రావడం, ఆయన విధేయులంతా రోశయ్యకు మద్దతు ప్రకటించడం, ప్రతిపక్షం కూడా వై.ఎస్‌.హయాం స్థాయిలో ఉద్యమించక పోవ టంతో ఇక ఇప్పట్లో కొణిజేటికి తిరుగులేదన్న భావన, ఇక ‘‘ఆయనే సుప్రీం’’ అన్న నమ్మకం పార్టీ వర్గాలలో బలపడుతోంది.

అధిష్ఠానం అండదండలు...
పార్టీలో సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ వస్తున్న రోశయ్యకు అధిష్ఠానం పూర్తిస్థాయిలో దన్నుగా నిలవడంతో ‘‘సుప్రీం’’గా అవతరించారు. అయితే...వై.ఎస్‌.మాదిరిగా దానిని ఎక్కడా కనిపించనీయకుండా ఢిల్లీ పర్యటనలోనూ హడావుడి చేయకుండా, ప్రచారానికి దూరంగా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న వైనాన్ని పార్టీ నాయకులు గ్రహించారు. అధిష్ఠానం కూడా... రోశయ్యకు మద్దతు పలకకపోతే పార్టీలో భవితవ్యం ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ సొంత విధేయతలను పక్కకుపెట్టి అనివార్య పరిస్థితులలో రోశయ్యకు విధేయత ప్రకటిస్తున్నారు.

దానికి అదనంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులలో ఎక్కువ మద్దతు ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ను పక్కకు పెట్టి అధిష్ఠానం అండదండలున్న రోశయ్యకే విధేయత ప్రకటించడంతో కెవిపి సలహాల ప్రకారం నడిచే సదరు మెజార్టీ ప్రజాప్రతినిధులంతా ఆయనను అనుసరిస్తున్నపరిస్థితి కనిపిస్తోంది.అందని ముఖ్యమంత్రి కిరీటం కోసం అర్రులు చాస్తూ పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్‌కు ఇక పార్టీలో భవితవ్యంలేదని నిర్ధారించుకొన్న ప్రజా ప్రతినిధులంతా నాయకత్వం దన్ను ఉన్న రోశయ్యకు సహాయనిరాకరణ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్లు కూడా దక్కవన్న భయాన్ని ప్రకాశం జిల్లా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా స్వయంగా గ్రహించారు.

జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం స్వయంగా చెప్పడంతో ప్రకాశంజిల్లా ఎమ్మెల్యేలలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా జగన్‌ యాత్రకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. జగన్‌తో ఉంటే భవిష్యత్తులేదని అధిష్ఠానం విస్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, అంతకు ముందు జగన్‌కు మద్దతు దార్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రోశయ్యను బలోపేతం చేస్తున్నారు. ఇక పాలనా పరంగా కూడా రోశయ్య పట్టుబిగుస్తున్నారు.

అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పూర్తిస్థాయిలో ప్రభుత్వ శాఖల సమీక్షలు నిర్వహిస్తున్నారు. బదిలీలు, ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపులు వివిధ శాఖలలో ఖాళీల భర్తీలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియామకాలు ప్రకటిస్తు న్నారు. కీలకమైన వివాదాలను కూడా ఆయన చాక చక్యంగా పరిష్కరిస్తూ అధిష్ఠానం ప్రశంసలు అందుకొంటున్నారు.

సర్కార్‌ను అతలాకుతలం చేసిన హైకోర్టు న్యాయవాదుల ఆందోళనను సమర్థవంతంగా పరిష్కరించి తానేమిటో, తాన రాజకీయ అనుభవం ఏమిటో చాటారు. ఆంధ్ర-తెలంగాణకు 40 చొప్పున, రాయలసీమకు 20శాతం స్టాండింగ్‌ కౌన్సెల్‌, ఏజిపి, జిపి పోస్టులను ప్రాంతాల వారీగా విభజించి, ఆ సమస్యను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించారు. ప్రాణహిత పుష్కరాలు, బతుకమ్మ జాతర వంటి సాంస్కృతికపరమైన అంశాలలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా...ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ప్రాంతీయ అభిమానాలు ఉండవని, అన్ని ప్రాంతాలు సమానమేనని చాటిచెప్పి ‘‘తాను ప్రాంతాలకు అతీతుడినినని’’ రుజువు చేసుకొన్నారు. ఇన్ని కీలకమైన వివాదాలు పరిష్కరించి ‘‘రోశయ్య సుప్రీం’’ అనిపించుకొన్నారు.

తగ్గిపోయిన ధిక్కార ధోరణి
రోశయ్య సుప్రీంగా మారుతున్న తీరుతో మంత్రులు సైతం తమ దిక్కారధోరణీ, వ్యవహార శైలినీ మార్చుకొని ఆయనకు పూర్తి విధేయతను ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఎవరి ఇష్టంవారిదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రులు మాత్రం అవతరణ దినోత్సవాలలో పాల్గొం టామని స్పష్టంచేయటం రోశయ్యకు పూర్తిస్థాయిలో విధేయత ప్రదర్శించటంగానే స్పష్టమవుతోంది.

డిసెంబర్‌ పరిణామాలకు సిద్ధం
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి డిసెంబర్‌ అనంతర పరిణా మాలకు సిద్దంగానే ఉన్నారు. కేంద్రం నుంచి పారా మిలటరీని పిలిపిస్తున్నారు.శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అందులో రాజకీయ నేతల ప్రమేయాన్ని సహించవద్దని డిజిపికి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్‌ అనంతర పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించటం, కఠి నంగా అణిచివేయటం ద్వారా తాను బలమైన ముఖ్యమంత్రినన్న సంకేతాలు పంపేందుకు రోశయ్య సిద్దమవుతున్నారు.

No comments: