Monday, October 25, 2010

మంత్రులపై 'రోష'య్య ! * స్వీయ నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా?

సిఫార్సు చేయకుండా నాపై తోసేయడం సబబేనా?
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయరా?
పలువురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం

 కొంతమంది మంత్రులు తమ తమ శాఖలనే పట్టించుకోవడం లేదు. మరికొందరు విధాన నిర్ణయాల విషయంలో చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరిస్తుంటే.. మరికొందరు స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా భారం మొత్తం సీఎంపైనే వేసేస్తున్నారు.

కానీ, సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా తనపైనే బాధ్యతలను నెట్టేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

శాఖాపరంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రులు సమష్టిగా స్పందించడం లేదని మంత్రివర్గ సమావేశాల్లో తరచూ ఆయన ఆగ్రహిస్తున్నారు కూడా. అధిష్ఠానం అంటే తనకు తెలియదని, తనకు తెలిసిన అధిష్ఠానం వైఎస్సేనని ప్రకటించి తూర్పు గోదావరి జిల్లాలో కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తితో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయినా.. తాను బంధుత్వానికే విలువ ఇస్తానంటూ ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆయన వ్యవహారంపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, ఎరువుల సరఫరా విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో మంత్రి రఘువీరారెడ్డి స్పందించిన తీరు పట్ల సీఎం సంతృప్తి చెందలేదు.

ఈ విషయమై మంత్రి బొత్సతోపాటు పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో రఘువీరాతో వాగ్వాదానికి దిగినా ఏమీ మాట్లాడకుండా సీఎం మౌనం దాల్చడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు, మహిళా స్వయం సహాయక బృందాలకు పరపతి లభించడంపై కడప ఎంపీ జగన్‌కు చెందిన దినపత్రికలో కథనాలు రావడం పట్ల సంబంధిత మంత్రి వట్టి వసంతకుమార్‌పై కూడా మంత్రివర్గ సమావేశంలో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం ఉంది.

'సాయంత్రం నువ్వు జగన్‌ను కలుస్తావు. మర్నాడు ఆయన పత్రికలో కథనాలు వస్తాయి' అని వ్యాఖ్యానించారని సమాచారం. అలాగే, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో 42 శాతం వాటా అమలయ్యేలా కృషి చేస్తామంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి గీతారెడ్డిని సీఎం ప్రశ్నించారని తెలిసింది.

డీఎస్సీ-08 నియామకాల విషయంలో శాఖాపరంగా సిఫార్సు చేయకుండా సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించిన మాణిక్యవరప్రసాద్‌పైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటాపై ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

గత మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. దానిపై దృష్టిసారించాలని గీతారెడ్డికి సూచించారు. ఇచ్చిన బాధ్యతలను వెంటనే పూర్తి చేయాలని మంత్రుల ఉప సంఘానికి హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, తనను కలిసిన గీతారెడ్డితో సీఎం రోశయ్య ఆ అంశాన్ని ప్రస్తావించారు.

'తెలంగాణ న్యాయవాదుల సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆచరణకు నోచుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వచ్చేస్తోంది. ఆ సమయానికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం బాగుంటుంది? దీనిపై వారు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారు?' అని కాస్త ఆగ్రహంతో ప్రశ్నించారు.

సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నా వీలు చిక్కడం లేదని, రెండు రోజుల్లో దానిపై ఓ సిఫార్సు చేస్తామని గీతారెడ్డి జవాబిచ్చారు. 'తెలంగాణ న్యాయవాదులతో సమావేశం జరిపిన రోజే సమయం లేదని చెబితే.. ఆ బాధ్యతను మరొకరికి అప్పగించేవాళ్లం కదా' అని సీఎం ప్రశ్నించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, తనను కలవడానికి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చిన సందర్భంలో.. "ఏమిటీ మీరొక్కరే వచ్చారు? డీఎస్సీ-08 ఫైలు ఏదీ!? అధికారులు రాలేదా?'' అని రోశయ్య నిలదీశారు. న్యాయపరమైన అంశాలు మిళితమై ఉన్న ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ తనపై వదిలేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో "ఇది చాలా కీలకమైన అంశమైనందున ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను' అని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, అధికారులతో కలిసి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలో సూచించాలని రోశయ్య చెప్పారు. దీంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, వివిధ సందర్భాల్లో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతారా!? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది.

No comments: