Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య


No comments: